కొందరు భార్యభర్తలు క్షణికావేశంలో నిర్ణయాలు తీసుకుంటున్నారు. వారి చర్యల వలన కుటుంబం, వారి మీద ఆధారపడిన వాళ్ల తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తోంది. ముఖ్యంగా తల్లిదండ్రుల నిర్ణయాల వలన పిల్లలు అనాథలుగా మారుతున్నారు. వారికి అండగా ఉండేవారు లేక ఆలనాపాలన చూసే వారు లేక ఒంటరిగా మిగిలిపోతున్నారు.చిన్నతనంలోనే తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తున్నది. కుటుంబ కలహాలు, ఆర్థిక ఇబ్బందులు, బంధువులు మోసం చేశారని, ఉద్యోగ ఒత్తిడి, అనారోగ్య సమస్యల కారణంగా ఆత్మహత్యలు క్రమంగా పెరుగుతున్నాయి.
తాజాగా ఏపీలోని పల్నాడు జిల్లాలో దారుణం చోటుచేసుకుంది.కుటుంబ కలహాల నేపథ్యంలో ఇద్దరు పిల్లలను చంపి ఓ వివాహిత ఆత్మహత్యకు పాల్పడింది. వివరాల్లోకివెళితే.. పల్నాడు జిల్లా వినుకొండ మండలం విఠంరాజుపల్లి గ్రామంలో సునీల్ రెడ్డి అనే వ్యక్తి పాల వ్యాన్ డ్రైవర్‌గా పనిచేస్తూ కుటుంబాన్నిపోషించుకుంటున్నాడు. ఆయనకు భార్య భారతి(24), పిల్లలు తేజేష్ రెడ్డి(6), హేమనాధ నాగిరెడ్డి(4)లు ఉన్నారు.
ఇటీవలికాలంలో సునీల్ రెడ్డి చెడు వ్యసనాలకు బానిసయ్యాడు. కుటుంబాన్ని పట్టించుకోకపోవడంతో పాటు ఇంట్లో భార్య తరచూ గొడవ పడేవాడని స్థానికులు తెలిపారు. దంపతుల మధ్య తరచూ గొడవలు జరుగుతూ ఉండటంతో తీవ్ర మనస్తాపానికి గురైన భారతి.. రాత్రి భర్త విధులకు వెళ్లాక పిల్లలకు విషం ఇచ్చి చంపేసింది. ఆ తర్వాత ఆమె సైతం ఆత్మహత్య చేసుకున్నది. భారతి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు. సునీల్ రెడ్డి ప్రస్తుతం పోలీసుల అదుపులో ఉన్నట్టు సమాచారం.












