ఏపీలోని విశాఖపట్నం బీచ్‌లో దారుణం చోటుచేసుకుంది. ఓ అమ్మాయి ఉన్నట్టుండి బలవన్మరణానికి పాల్పడింది. అసలు ఆమె ఎందుకు అలా చేసింది. తెలంగాణ అమ్మాయి ఏపీకి ఎందుకు వెళ్లింది. అది కూడా బీచ్‌లో అందరూ చూస్తుండగా ఆత్మహత్యకు ఎందుకు పాల్పడింది.ఈ విషయం ప్రస్తుతం సోషల్ మీడియాలో తీవ్ర చర్చకు దారితీసింది.యువతి ప్రాణాలు తీసుకునేంతవరకు వెళ్లింది అంటే తనకు ఏదైనా అన్యాయం జరిగిందా? ప్రేమ వ్యవహారం ఏదైనా కారణమా? లేక ఇంకా ఏమైనా సమస్యలు ఉన్నాయా? అనేది తెలియాల్సి ఉన్నది.
అసలు విషయానికొస్తే.. విశాఖపట్నం బీచ్‌లో ఒంటిపై పెట్రోల్ పోసుకుని తెలంగాణ యువతి ఆత్మహత్యాయత్నం చేసింది. బాధితురాలిని తెలంగాణ ప్రాంతానికి చెందిన లావణ్యప్రియగా పోలీసులు గుర్తించారు. ఆర్కే బీచ్ రోడ్డులో తన వెంట తెచ్చుకున్న పెట్రోలును ఒంటిపై పోసుకొని యువతి నిప్పు అంటించుకున్నట్టు ప్రత్యక్ష సాక్ష్యులు పోలీసులకు వెల్లడించినట్టు సమాచారం.
నిప్పు అంటుకోగానే యువతి అరుపులు విని గమనించిన స్థానికులు,అక్కడే విధుల్లో ఉన్న పోలీసులు తక్షణమే స్పందించి మంటలను అదుపు తీసుకొచ్చారు. ఈ ప్రమాదంలో యువతి చేతులు, ముఖం, తల భాగం తీవ్రంగా కాలిపోయాయని పోలీసులు తెలిపారు. యువతిని కింగ్ జార్జ్ ఆసుపత్రికి తరలించినట్టు తెలిపారు. ప్రస్తుతం యువతి పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసి ఆత్మహత్యాయత్నానికి గల కారణాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ విషయం కాస్త రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది.












