వాతావరణాన్ని అతలాకుతలం చేసే ఎల్‌నినో తీవ్రతను తగ్గించేందుకు శాస్త్రవేత్తలు ఒక వినూత్న మార్గాన్ని అన్వేషిస్తున్నారు. సూర్యరశ్మి భూమిని తాకకుండా మేఘాల మెరుపును పెంచడం ద్వారా ఈ ముప్పును ఎదుర్కోవచ్చని శాస్త్రవేత్తల తాజా పరిశోధనలు చెబుతున్నాయి. అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా పరిశోధకులు సోలార్ జియో ఇంజినీరింగ్ విధానాన్ని పరిశీలిస్తూ ‘సైన్స్ అడ్వాన్సెస్’ పత్రికలో ఈ వివరాలను వెల్లడించారు.
ఈ సరికొత్త ప్రతిపాదన ప్రకారం, భూమి పైపొరల్లో ప్రత్యేకమైన ఏరోసాల్స్ (కణాలు) విడుదల చేస్తారు. దీనివల్ల సముద్రాలపై ఉండే మేఘాలు మరింత తెల్లగా, ప్రకాశవంతంగా మారి అద్దాల్లా పనిచేస్తాయి. ఇవి సూర్యకిరణాలను అంతరిక్షంలోకి తిరిగి పంపడం ద్వారా భూ ఉపరితల ఉష్ణోగ్రతలు తగ్గుతాయి. శాస్త్రవేత్తలు ఈ వినూత్న సాంకేతిక ప్రక్రియను ‘మెరైన్ క్లౌడ్ బ్రైటెనింగ్’ అని పిలుస్తున్నారు.
పసిఫిక్ మహాసముద్రంలో వేడి అసాధారణంగా పెరగడం వల్లే ఎల్‌నినో ఏర్పడి కరవు, వడగాల్పులు, వరదలు సంభవిస్తాయి. గతంలో వచ్చిన సూపర్ ఎల్‌నినోల ఆధారంగా నిర్వహించిన కంప్యూటర్ నమూనాల ప్రకారం, ఈ కొత్త పద్ధతి ద్వారా వాతావరణ తీవ్రతను దాదాపు 40 శాతం వరకు తగ్గించవచ్చని తేలింది. ఇది గ్లోబల్ వార్మింగ్ వల్ల ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు జరిగే భారీ నష్టాన్ని నివారిస్తుంది.
అయితే, ఈ విధానంపై శాస్త్రవేత్తల్లో కొన్ని అభ్యంతరాలు కూడా వ్యక్తమవుతున్నాయి. వాతావరణం చల్లబడాలంటే ఈ ప్రక్రియను నిరంతరం చేయాల్సి ఉంటుందని, దీనివల్ల అసలైన కర్బన ఉద్గారాల తగ్గింపుపై నిర్లక్ష్యం పెరిగే ప్రమాదం ఉందని కొందరు హెచ్చరిస్తున్నారు. ప్రస్తుతానికి దీనిని నేరుగా ప్రయోగించే ప్రణాళికలు లేనప్పటికీ, భవిష్యత్తు ముప్పులను తట్టుకోవడానికి ఇలాంటి ప్రత్యామ్నాయాలపై అధ్యయనాలు సాగించడం ఎంతో అవసరమని పరిశోధక బృందం స్పష్టం చేసింది.












