తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డికి రెండు వేర్వేరు నియోజకవర్గాల్లో ఓటు హక్కు ఉందంటూ సోషల్ మీడియాలో ఒక వార్త జోరుగా ప్రచారమవుతోంది. ఆయనకు నాగర్‌కర్నూల్ పార్లమెంట్ పరిధిలోని అచ్చంపేట నియోజకవర్గంతో పాటు, మహబూబ్‌నగర్ పార్లమెంట్ పరిధిలోని కొడంగల్ నియోజకవర్గంలోనూ ఓటు హక్కు ఉన్నట్లు నెటిజన్లు స్క్రీన్‌షాట్లను షేర్ చేస్తున్నారు.
అత్యంత ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, ఈ రెండు చోట్లా ఆయన ఒకే ఎలక్షన్ ఫోటో ఐడెంటిటీ కార్డ్ (EPIC) నంబర్ (TES0274035) కలిగి ఉన్నట్లు ఆ ఫొటోల్లో కనిపిస్తోంది. సాంకేతికంగా ఒకే ఎపిక్ నంబర్‌తో రెండు వేర్వేరు నియోజకవర్గాల ఓటర్ల జాబితాలో పేరు నమోదు కావడం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. ఇటీవలే ఎన్నికల సంఘం (EC) డబుల్ ఓట్లపై కఠిన హెచ్చరికలు జారీ చేసింది. ఒకే వ్యక్తికి రెండు చోట్ల ఓటు హక్కు ఉంటే చట్టప్రకారం ఏడాది పాటు జైలు శిక్ష పడే అవకాశం ఉందని స్పష్టం చేసింది.
దీనికి తోడు, బహుళ ఓటు హక్కు కలిగి ఉన్నారనే ఆరోపణలపై ప్రముఖ నటుడు ప్రకాష్ రాజ్‌కు బెంగళూరు కోర్టు నాన్-బెయిలబుల్ వారెంట్ జారీ చేసిన ఉదంతాన్ని కూడా ఈ సందర్భంగా కొందరు గుర్తు చేస్తున్నారు. అయితే, ఓటర్ల జాబితా సవరణల్లో దొర్లిన సాంకేతిక లోపం వల్ల ఇలా జరిగిందా? లేక పాత ఓటును తొలగించకుండా కొత్తది కేటాయించారా? అనే కోణంలో అధికారులు పరిశీలించాల్సి ఉంది. ఈ వ్యవహారంపై అటు కాంగ్రెస్ శ్రేణుల నుంచి కానీ, ఇటు ఎన్నికల అధికారుల నుంచి కానీ ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.
ఇదిలా ఉండగా ఒకే ఎపిక్ (EPIC) నంబర్‌తో రెండు నియోజకవర్గాల్లో ఓటు హక్కు ఉండటం అనేది సాంకేతికంగా సాధ్యం కాదు. ఎన్నికల సంఘం నిబంధనల ప్రకారం, ఒక ఓటరు తన నియోజకవర్గాన్ని మార్చుకున్నప్పుడు పాత ఓటు ఆటోమేటిక్‌గా రద్దు కావాలి. అయితే, ఎన్నికల వెబ్‌సైట్ డేటా అప్‌డేట్ కావడంలో దొర్లే సాంకేతిక లోపాలు లేదా పాత ఓటరు జాబితా స్క్రీన్‌షాట్లను సర్క్యులేట్ చేయడం వల్లే ఇలాంటి ప్రచారాలు జరుగుతుంటాయని విశ్లేషకులు అంటున్నారు.












