Ram Charan: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఇటీవలే పెద్ది సినిమాతో వచ్చి గ్లోబల్ వైడ్ గా ప్రశంసలు అందుకున్నాడు. సినిమా ఫలితం ఎలా ఉన్నప్పటికీ, చరణ్ పర్ఫార్మెన్స్ తో మాత్రం నిలబెట్టాడు. విలేజ్ బ్యాక్‌డ్రాప్‌లో స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమాను బుచ్చిబాబు సానా తెరకెక్కించాడు. జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటించింది. ఏఆర్ రెహమాన్ సంగీతం అందించాడు. పెద్ది సినిమాపై ఉన్న అంచనాలను అందుకోలేకపోయింది.
అయితే, చరణ్ నటనకి మాత్రం గ్యారెంటీగా అవార్డ్స్ వస్తాయని అటు సినీ విశ్లేషకులు ఇటు అభిమానులు, సినీ ప్రముఖులు ఎంతో నమ్మకంగా చెప్పారు. ఇక, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ రేంజ్ కి తగ్గ కథలు ఆర్ఆర్ఆర్ తర్వాత పడట్లేదనేది గేమ్ ఛేంజర్, పెద్ది సినిమాలతో అందరికీ అర్థమైంది. ఇలాంటి, పరిస్థితుల్లో సుకుమార్ దర్శకత్వంలో సినిమా చేయడానికి చరణ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు.
గతంలో సుకుమార్, రామ్ చరణ్ కాంబినేషన్‌లో వచ్చిన రంగస్థలం ఎంతటి హిట్ సాధించిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. కెరీర్ లో మొట్ట మొదటిసారి చరణ్ కి వినికిడి లోపం ఉన్న పాత్రలో చూపించి సుకుమార్ భారీ హిట్ ఇచ్చాడు. ఈ సినిమాలో చరణ్ నటనకి ప్రతీ ఒక్కరు ఆశ్చర్యపోయారు. సమంత పాత్రను సుకుమార్ అద్భుతంగా మలిచాడు. మళ్ళీ, ఇప్పుడు సుక్కూతో చరణ్ సినిమా అనేసరికి అంచనాలు పీక్స్ కి వెళ్ళాయి.
కథ ఏంటో తెలియకుండానే మెగా ఫ్యాన్స్ రంగస్థలం సీక్వెల్ అని ప్రచారం చేస్తున్నారు. కానీ, సుకుమార్ ఓ కొత్త కథను తయారు చేశాడట. ఇటీవలే, పూర్తి కథను నరేట్ చేయగా, చిన్న చిన్న మార్పులను సూచించాడని తెలుస్తోంది. చరణ్ చెప్పిన మార్పులు చేసి బౌండెడ్ స్క్రిప్ట్ ని త్వరలో కంప్లీట్ చేసి..అధికారికంగా ప్రాజెక్ట్ అనౌన్స్ చేస్తారని సమాచారం. అంతేకాదు, ఈ సినిమా ఓపెనింగ్ అండ్ రెగ్యులర్ షూటింగ్ ఈ ఏడాది అక్టోబర్ నుంచి ఉంటుందని విశ్వసనీయ వర్గాల ద్వారా అందుతున్న సమాచారం.












