రంగారెడ్డి జిల్లా షాబాద్‌లో తన మీద అన్యాయంగా పోక్సో కేసు పెట్టించి జైలుకు పంపించారనే కారణంతో రాజ్ కుమార్ ఆరుగురిని పొట్టన పెట్టుకున్న విషయం తెలిసిందే. చనిపోయిన వారిలో తన భార్య బిడ్డలు కూడా ఉన్నారు. ఆ తర్వాత రెండ్రోజులకు నిందితుడు సైతం ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. వాళ్ల అమ్మమ్మ వాళ్ల ఊరికి వెళ్లి ఓ వెంచర్ లో గడ్డిమందు తాగి ఆత్మహత్యకు పాల్పడటంతో పోలీసులు నిందితుడిని గుర్తించి పోస్టుమార్టం కోసం పంపించడం, ఆ తర్వాత కుటుంబ సభ్యులు మృతదేహాన్ని తీసుకెళ్లడానికి ఇష్టపడకపోవడంతో చివరకు పోలీసులే అంత్యక్రియలు నిర్వహించారు.
ఇదిలాఉండగా, ఈ కేసులో మరో ట్విస్ట్ నెలకొంది. నిందితుడు రాజ్ కుమార్ హిట్ లిస్టులో మరో నలుగురు వ్యక్తులు ఉన్నట్టు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నట్టు తెలిసింది. మైనర్ బాలికను వేధించినందుకు గాను రాజ్ కుమార్‌పై పోక్సో కేసు పెట్టించిన బాలిక మేనమామ రాజు, ఆమె బాబాయ్ చిట్యాల శ్రీనివాస్ ఆయన సతీమణి, నరేష్ అనే వ్యక్తి సహకరించారని హత్యలకు ముందు రికార్డ్ చేసిన వీడియోలో నిందితుడు చెప్పాడు. దీంతో ఆరుగురిని హతమార్చిన రాజ్ కుమార్ .. ఆ నలుగురిని సైతం చంపేయాలని నిర్ణయించుకున్నట్టు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. మర్డర్స్ చేసే టైంలో వాళ్లు అక్కడ లేకపోవడంతో తప్పించుకున్నారని గ్రామస్తులు సైతం చర్చించుకుంటున్నారు.
నిందితుడు సెల్ఫీ వీడియోలో, హత్యలకు ముందు రాసిన బాండ్ పేపర్లపై బాలిక, ఆమె కుటుంబంపై భారీ ఆరోపణలు చేసినా చంపకుండా ఉండాల్సింది అని పేర్కొంటున్నారు. మైనర్ బాలికతో సంబంధం పెట్టుకోవడమే నేరమైతే, అంతకుముందే నిందితుడు మరికొందరు మహిళలతోనూ సంబంధాలు కొనసాగించాడని రాజ్ కుమార్ అత్త మీడియాకు తెలిపారు. అంతేకాకుండా బెట్టింగ్ యాప్స్ లో భారీగా డబ్బులు పోగొట్టుకోవడంతో పాటు తాగడం లాంటి వ్యసనాలు ఉన్నాయని పేర్కొన్నారు.కాగా, నిందితుడి మరణంతో ఈ కేసు ముగిసిపోయింది.












