సీఎం రేవంత్ రెడ్డి నిన్న అసెంబ్లీ వేదికగా కేసీఆర్ కుటుంబం ఆస్తుల మీద చేసిన ఆరోపణలకు తాజాగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గురువారం తెలంగాణ భవన్‌లో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సీఎం రేవంత్ రెడ్డి మీద తీవ్ర విమర్శలు చేశారు. కేసీఆర్ పుట్టినప్పుడే ఆయన ఇల్లు రెండు ఎకరాల్లో ఉండేదని, ఆయన తండ్రికి వందల ఎకరాల భూమి ఉందని పేర్కొన్నారు.
రైతు కుటుంబం నుంచి వచ్చారు కాబట్టే వ్యవసాయం మీద ఉన్న మక్కువతో ఈనాటికీ వ్యవసాయం చేస్తూనే ఉన్నారని, ఆరోజుల్లోనే చింతమడకలో రెండెకరాల ఇళ్లు ప్రభుత్వ పాఠశాలకు దానం చేశారని పేర్కొన్నారు.కేసీఆర్‌కు ఎప్పటినుంచో వందల ఎకరాలు ఉన్నాయని చెప్పారు.కేసీఆర్ దొర అంటావా? లేక ఈ మధ్య సంపాదించుకున్నాడు అంటావా? ఏదో ఒకటి ఫిక్స్ అవ్వాలని సీఎం రేవంత్‌కు హితవు పలికారు.
‘నీ కంపు నోరుతో కేసీఆర్ ఫామ్‌హౌస్ 1,000 ఎకరాలు ఉందని ఎన్నో సార్లు అన్నావ్. ఈరోజు మళ్ళా నువ్వే కేసీఆర్ గారికి 67 ఎకరాలు ఉందని చెప్తున్నావ్. కేసీఆర్ తన ఎన్నికల అఫిడవిట్‌లో 67 ఎకరాలు భూమి ఉందని పేర్కొన్నాడు. కొత్తగా నువ్వు కనిపెట్టింది ఏందిరా సన్నాసి.కేసీఆర్ రైతు కాబట్టి బరాబర్ అన్ని చట్టాల ప్రకారం భూమి కొనుక్కున్నాడు. కేసీఆర్ భూమిని దేవతలాగా కొలుస్తాడు.. నీ లెక్క మంది కొంపలు ముంచి భూమిని ఆటవస్తువుగా చూడడు’ అని విమర్శించారు.
అప్పుడు ఇప్పుడు..అన్ని అబద్ధాలే..
రేవంత్ రెడ్డి పీసీసీ అధ్యక్షుడిగా ఉన్న రోజుల్లో ప్రగతి భవన్‌లో 150 బెడ్ రూంలు ఉన్నాయని, బంగారు బాత్రూంలు ఉన్నాయని చేసిన చిల్లర వ్యాఖ్యల్లో ఎంత నిజాలు ఉన్నాయో, నిన్న ఆయన చేసిన ఆరోపణల్లో కూడా అన్నే నిజాలు ఉన్నాయన్నారు.ఆరు గ్యారంటీలు అమలు అయ్యాయన్నది ఎంత నిజమో రేవంత్ రెడ్డి మాటలు కూడా అంతే నిజమని సెటైర్లు వేశారు. మైసూరు బోండాలో ఎంత అయితే మైసూరు ఉంటదో నిన్న రేవంత్ రెడ్డి మాట్లాడిన మాటల్లో అంతే నిజం ఉందని మండిపడ్డారు.
ఆయనకు మాకేం సంబంధం..
‘కొండల్ రావు అని కూకట్‌పల్లిలో ఒక పెద్దాయన ఉంటే ఆయన ఆస్తులు కూడా మా దాంట్లో రేవంత్ రెడ్డి వేసేశాడు.ఆయనకి మాకు చుట్టరికం కూడా లేదు.. కేవలం వెలమ కులం అంతే. కేసీఆర్ అక్కాచెల్లెలు, అన్నతమ్ముళ్ల సంతానం 300 మంది ఉంటారు వాళ్ల ఆస్తులు కూడా మా ఖాతాలో వేయి. నవీన్ రావుకి, కొండల్ రావుకి మాకు ఏం సంబంధం..బుద్ధి జ్ఞానం ఉందా? అసలు. సంతోష్ రావుకి మాకు చుట్టరికం ఉంటే ఆయన ఆస్తులు కూడా కేసీఆర్ ఖాతాలో వేస్తావా? నీ అన్నతమ్ముళ్ల వాళ్ల పిల్లల ఆస్తులు నీ ఖాతాలో వేస్తే ఎలా ఉంటుంది?’ అని కేటీఆర్ ప్రశ్నించారు.
‘నేను అమెరికాలో ఆరున్నర సంవత్సరాలు ఉద్యోగం చేసి సంపాదించుకున్నాను. నువ్వు ఏమీ చేసి సంపాదించావు రేవంత్ రెడ్డి? రేవంత్ రెడ్డి 7 ఏండ్లు డిగ్రీ చదివిండు’ అని విమర్శించారు. ‘గోడల మీద పెయింట్ వేసుకునే నీ సంగతి నాకు తెలియదా? కొండారెడ్డిపల్లి పోయి అడిగితే మీ బతుకు మొత్తం బయటపడుతుంది. గోడల మీద పెయింట్ వేసుకునే నీకు జూబ్లీహిల్స్‌లో ప్యాలెస్ ఉండొచ్చు కానీ.. కేసీఆర్ గారికి వ్యవసాయం చేసుకోవడానికి భూమి ఉండొద్దా? అని కేటీఆర్ నిలదీశారు.










