కాంగ్రెస్ పార్టీలో నామినేటెడ్ పోస్టుల భర్తీకి రంగం సిద్ధమైంది.ఇంతకాలం పదవుల కోసం ఎదురుచూస్తున్న ఆశావహులకు టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ శుభవార్త చెప్పారు. దీంతో వారంతా మరోసారి జోరుగా లాబీయింగ్ మొదలుపెట్టినట్టు తెలుస్తోంది. హైకమాండ్ పెద్దలతో పరిచయం ఉన్న నేతలు ఢిల్లీ స్థాయిలో పావులు కదుపుతున్నట్టు తెలుస్తోంది.ఎలాగైనా ఈసారి అవకాశం కల్పించాలని కోరుతున్నట్టు తెలిసింది. మరికొందరు మంత్రుల చుట్టూ ప్రదక్షిణం చేస్తూ ఒక్కచాన్స్ అంటూ వేడుకుంటున్నట్టు సమాచారం.
ప్రస్తుతం ఢిల్లీ పర్యటనలో ఉన్న టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ గురువారం ఏఐసీసీ పెద్దలతో సమావేశానికి ముందు మీడియాతో మాడ్లాడారు.రాష్ట్రంలో 22ఏ భూముల వ్యవహారం కాంగ్రెస్ పాపం కాదని పేర్కొన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే భూ దోపిడీ జరిగిందని ఆరోపించారు.రాష్ట్రంలో జరిగిన భూదోపిడీపై ప్రస్తుతం విచారణ జరుగుతోందని చెప్పారు. గత ప్రభుత్వ హయాంలో జరిగిన భూదోపిడీపై జ్యుడీషియల్ విచారణ అంశంపై సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయం తీసుకుంటారన్నారు. 22ఏ భూముల అంశానికి కాంగ్రెస్‌కు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు.
నెల రోజుల్లో నామినేటెడ్ పోస్టులు
తన పదవీకాలానికి మరో ఏడాది సమయం ఉందని పేర్కొన్న మహేశ్ గౌడ్.. మంత్రివర్గ విస్తరణ చేపట్టాలా? వద్దా? అనే అంశంపై నిర్ణయం సీఎం రేవంత్ రెడ్డిదే అని తెలిపారు. నామినేటెడ్ పోస్టులను నెల రోజుల్లో భర్తీ చేస్తామని తెలిపారు. కాంగ్రెస్ పార్టీకి త్వరలో పూర్తి స్థాయి కార్యవర్గాన్ని ఏర్పాటు చేస్తామన్నారు. డీసీసీ అధ్యక్షుల నియామక ప్రక్రియను కూడా త్వరలో చేపడతామని చెప్పారు.
మంత్రి కొండా సురేఖ అంశం ముగిసిన అధ్యాయమని, ఆమె కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతానని స్పష్టం చేసిన విషయాన్ని గుర్తుచేశారు. రాష్ట్రప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలను పార్టీ అధిష్టానానికి వివరిస్తానని టీపీసీసీ చీఫ్ తెలిపారు.పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేసే దిశగా చర్యలు కొనసాగుతాయని వెల్లడించారు.












