National

HealthMinistry: మెడికల్ షాపుల్లో సీసీటీవీ నిఘా.. కేంద్రం కీలక ప్రతిపాదనలు!

రచన: Mamatha puppala4 నిమిషాల పఠనం

వైద్యుల సిఫార్సుతో (ప్రిస్క్రిప్షన్) విక్రయించే మందుల పంపిణీపై కఠిన నిఘా ఉంచేందుకు కేంద్ర ప్రభుత్వం బృహత్తర చర్యలు చేపట్టింది. లైసెన్స్ పొందిన ప్రాంగణాలు, మెడికల్ షాపుల్లో డాక్టర్ల ప్రిస్క్రిప్షన్ ఆధారంగా మందులను విక్రయించే సమయంలో తప్పనిసరిగా సీసీ కెమెరాల నిఘా ఉండాలనే ప్రతిపాదనను కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ తీసుకొచ్చింది.

 వైద్యుల సిఫార్సుతో (ప్రిస్క్రిప్షన్) విక్రయించే మందుల పంపిణీపై కఠిన నిఘా ఉంచేందుకు కేంద్ర ప్రభుత్వం బృహత్తర చర్యలు చేపట్టింది. లైసెన్స్ పొందిన ప్రాంగణాలు, మెడికల్ షాపుల్లో డాక్టర్ల ప్రిస్క్రిప్షన్ ఆధారంగా మందులను విక్రయించే సమయంలో తప్పనిసరిగా సీసీ కెమెరాల నిఘా ఉండాలనే ప్రతిపాదనను కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ తీసుకొచ్చింది. ఈ మేరకు డ్రగ్స్ రూల్స్, 1945కి సవరణలు చేస్తూ సెప్టెంబర్ 8న కేంద్రం నోటిఫికేషన్‌ ముసాయిదా విడుదల చేసింది.

విడుదల చేసిన ముసాయిదా ప్రకారం.. హోల్‌సేల్ వ్యాపారులకు మినహాయింపునిస్తూ రిటైల్ ఔషధ దుకాణాల్లో మందుల అమ్మకాలు జరిగే ప్రదేశంలో సీసీటీవీ కెమెరా నిరంతరం పనిచేస్తూ ఉండాలి. ప్రిస్క్రిప్షన్ ఆధారంగా మందుల అమ్మకం సరిగ్గా జరిగిందో లేదో దృశ్యరూపంలో ధ్రువీకరించేలా రికార్డింగ్ సాగాలని, ఆ ఫుటేజ్ లేదా దృశ్యాలను కనీసం మూడు నెలల పాటు సురక్షితంగా భద్రపరచాలని ప్రతిపాదించారు. ప్రిస్క్రిప్షన్ అవసరమైన ఔషధాలను సరైన డాక్టర్ సూచనలు లేకుండా ఓవర్ ద కౌంటర్‌లో అక్రమంగా విక్రయించడాన్ని అరికట్టడమే ఈ నిబంధన ముఖ్య ఉద్దేశం.

 తాజా ముసాయిదా నిబంధన కేవలం షెడ్యూల్ హెచ్, హెచ్1, ఎక్స్ మందులకే కాకుండా, డాక్టర్ల ప్రిస్క్రిప్షన్‌తో విక్రయించే అన్ని రకాల మందులకు వర్తించేలా కేంద్రం రూపొందించింది. ఇటీవల కాలంలో దగ్గు సిరప్‌లు, మత్తు కలిగించే పదార్థాలు, యాంటీబయోటిక్స్‌ను పిల్లలు, పెద్దలకు సరైన వైద్య పర్యవేక్షణ లేకుండా విక్రయించడంపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో బాధ్యతాయుతమైన విక్రయాలను ప్రోత్సహించడానికి, తనిఖీల వేళ అధికారులకు స్పష్టమైన ఆధారాలు లభించడానికి ఈ నిర్ణయం దోహదపడనుంది.

 అయితే, ఈ సీసీటీవీ నిఘా ప్రతిపాదనలు ప్రస్తుతం ముసాయిదా (Draft) రూపంలోనే ఉన్నాయి. సంబంధిత భాగస్వాములు, మెడికల్ అసోసియేషన్లు, ప్రజల నుంచి అభ్యంతరాలు, సూచనలను స్వీకరించిన అనంతరం కేంద్ర ప్రభుత్వం దీనిపై తుది నిర్ణయం తీసుకోనుంది. కేంద్రం అధికారిక గెజిట్‌లో తుది నిబంధనలు ప్రచురించి, పేర్కొనే నిర్దేశిత తేదీ నుంచి మాత్రమే ఈ కొత్త సీసీటీవీ నిఘా చట్టం దేశవ్యాప్తంగా అమల్లోకి వస్తుంది.

 

#MedicalShops#HealthMinistry#CCTVMandatory#PrescriptionMedicines#CentralGovtNews#HealthNews#IndiaNews#swechaanews
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి