హైదరాబాద్‌లోని నిమ్స్ (NIMS) ఆస్పత్రిలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఎమర్జెన్సీ మెడిసిన్ విభాగంలో విధుల్లో ఉన్న జూనియర్ రెసిడెంట్ డాక్టర్ కె.శ్రీకాంత్‌పై రోగి బంధువులు తీవ్ర పదజాలంతో దూషిస్తూ, భౌతిక దాడులకు దిగుతామని బెదిరించారు. బుధవారం మధ్యాహ్నం ఈ సంఘటన జరగగా రెసిడెంట్ డాక్టర్స్ అసోసియేషన్ (RDA) గురువారం ఉదయం సమ్మెకు పిలుపునిచ్చింది. వైద్యుల భద్రతను గాలికి వదిలేశారని ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆసుపత్రిలో అవుట్ పేషెంట్ (OPD) సేవలతో పాటు ఎలక్టివ్ సేవలను నిరవధికంగా బహిష్కరిస్తున్నట్లు ప్రకటించారు.
డాక్టర్ శ్రీకాంత్ ఒక అత్యవసర బాధితుడిని పరీక్షించి న్యూరాలజీ కన్సల్టేషన్, సీటీ స్కాన్, క్యాథెటరైజేషన్ సూచించారు. అయితే అదే సమయంలో ఇతర అత్యవసర కేసులను పర్యవేక్షిస్తుండటంతో క్యాథెటరైజేషన్ చేయడంలో కొద్దిపాటి ఆలస్యమైంది. దీంతో ఆగ్రహానికి గురైన రోగి బంధువులు వైద్యుల జీతభత్యాలను ప్రశ్నిస్తూ దారుణంగా బూతులు తిట్టడమే కాకుండా, దాడి చేస్తామని తీవ్రంగా బెదిరించారు. సెక్యూరిటీ, ఆర్‌ఎంవో జోక్యంతో పరిస్థితి సర్దుమణిగినా, డాక్టర్ల భద్రతపై మళ్లీ ప్రశ్నలు వ్యక్తమయ్యాయి.
ఈ ఘటనపై బాధితుడు వ్యక్తిగతంగా పోలీసులకు ఫిర్యాదు చేసినప్పటికీ, రెసిడెంట్ డాక్టర్లు దీనిని తీవ్రంగా పరిగణిస్తున్నారు. కేవలం వైద్యుడు మాత్రమే ఫిర్యాదు చేస్తే సరిపోదని, నిమ్స్ యాజమాన్యమే స్వయంగా సంస్థాగతంగా పోలీస్ కేసు నమోదు చేయాలని పట్టుబడుతున్నారు. కేవలం రెండు వారాల కిందట కూడా ఇలాంటి దాడి జరిగిందని, యాజమాన్యం నిర్లక్ష్యం వల్లే మళ్లీ అలాంటి ఘటన పునరావృతమైందని ఆరోపించారు. యువ డాక్టర్లు ఒంటరిగా కోర్టు చుట్టూ తిరగకుండా సంస్థాగతమైన న్యాయ సాయం అందించాలని డిమాండ్ చేస్తున్నారు.
వైద్యుల సమ్మె కారణంగా నిమ్స్ ఆస్పత్రిలో వందలాది మంది రోగులు, ఓపీ సేవలు అందక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఆస్పత్రి యాజమాన్యం, తెలంగాణ ప్రభుత్వం తక్షణమే స్పందించి నిమ్స్ పరిసరాల్లో కట్టుదిట్టమైన శాశ్వత భద్రతా చర్యలు చేపట్టాలని, సీసీ కెమెరాల నిఘాతో పాటు సాయుధ సెక్యూరిటీని పెంచాలని ఆర్డీఏ తేల్చి చెప్పింది. తమ డిమాండ్లు నెరవేరే వరకు అత్యవసర సేవలు తప్ప మిగిలిన వైద్య సేవలను పునరుద్ధరించేది లేదని భీష్మించుకూర్చోవడంతో ఉత్కంఠ కొనసాగుతోంది.









