సెప్టెంబర్ 17 తెలంగాణ పౌరుషానికి, త్యాగాల చరిత్రకు నిదర్శనమని, అయితే ఈ చారిత్రక ఘట్టాన్ని కాంగ్రెస్, బీజేపీలు తమ రాజకీయ ప్రయోజనాల కోసం పూర్తిగా వక్రీకరిస్తున్నాయని తెలంగాణ రక్షణ సేన అధినేత్రి కల్వకుంట్ల కవిత విమర్శించారు. సెప్టెంబర్ 17 పురస్కరించుకుని బంజారాహిల్స్‌లోని పార్టీ కార్యాలయంలో గురువారం ఆమె జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ.. తెలంగాణ విలీన పోరాట యోధుల స్ఫూర్తితో రాష్ట్రంలో రాజ్యమేలుతున్న అరాచక శక్తులను గద్దె దించాలని పిలుపునిచ్చారు.
తెలంగాణ విలీనానికి స్టేట్ కాంగ్రెస్ పోరాటమే కారణమని ముఖ్యమంత్రి చెప్పడం ఎంతమాత్రం వాస్తవం కాదని కవిత స్పష్టం చేశారు. ఆనాడు సంస్థానాల్లో పోరాటం చేయడం తమ విధానం కాదని మహాత్మా గాంధీ చెప్పిన విషయాన్ని ఆమె ఈ సందర్భంగా గుర్తుచేశారు. నిజాం ప్రభుత్వం పేదలకు ఇచ్చిన దాదాపు 10లక్షల ఎకరాల భూమిని భారత యూనియన్‌లో విలీనమైన తర్వాత నాటి కాంగ్రెస్ ప్రభుత్వం తిరిగి భూస్వాములు, జమీందార్లకే అప్పగించి పేదలకు నమ్మకద్రోహం చేసిందని తీవ్రంగా ఆరోపించారు.
మరోవైపు, బీజేపీ తీరుపై కూడా కవిత తీవ్రస్థాయిలో మండిపడ్డారు. నాటి ముస్లిం రాజుపై కేవలం హిందువులు మాత్రమే చేసిన పోరాటంగా చిత్రీకరిస్తూ చరిత్రకు మతం రంగు పులిమేందుకు బీజేపీ కుట్రలు చేస్తోందని ధ్వజమెత్తారు. అసలు నాటి విమోచన పోరాటం జరుగుతున్న సమయంలో బీజేపీ కానీ, ఆర్‌ఎస్‌ఎస్ కానీ ఉనికిలోనే లేవని ఎద్దేవా చేశారు. భూస్వాములు, జాగీర్దార్ల దాష్టీకాలకు వ్యతిరేకంగా మతాలకు అతీతంగా నాటి తెలంగాణ ప్రజలే స్వచ్ఛందంగా తిరగబడ్డారని వివరించారు.
వట్టికోట ఆళ్వార్ స్వామి, సురవరం ప్రతాపరెడ్డి, కాళోజీ, దాశరథి, షోయాబుల్లాఖాన్, మగ్దూం మొయినుద్దీన్ వంటి కవులు, రచయితలు ప్రజల్లో చైతన్యం నింపారని కవిత కొనియాడారు. వారి స్ఫూర్తితోనే దొడ్డి కొమురయ్య, చాకలి ఐలమ్మ, షేక్ బందగీ వంటి వీరులు పోరాటంలో ముందంజ వేశారని తెలిపారు. అదే విప్లవ స్ఫూర్తితో తెలంగాణ రక్షణ సేన కూడా కులమతాలకు అతీతంగా ప్రజల హక్కుల కోసం పోరాడుతుందని, రాష్ట్రంలో సాగుతున్న అరాచక పాలనకు అంతం పలికే వరకు విశ్రమించేది లేదని కవిత స్పష్టం చేశారు.












