రాష్ట్ర రాజకీయాల్లో మరో కీలకపరిణామం చోటుచేసుకుంది. తన మీద అసత్య ఆరోపణలు చేసినందుకు గాను బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్, మాజీ మంత్రి హరీశ్ రావు చట్టపరమైన చర్యలకు ఉపక్రమించారు. క్షుద్రపూజల పేరిట నిరాధారమైన ఆరోపణలు చేశారని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, కాంగ్రెస్ ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్‌ల మీద హరీశ్ రావు న్యాయపోరాటానికి దిగారు.
ఇప్పటికే వారికి లీగల్ నోటీసులు పంపించిన ఆయన.. వారిద్దరూ బహిరంగ క్షమాపణ చెప్పకపోవడంతో ప్రజాప్రతినిధుల కోర్టును ఆశ్రయించినట్టు తెలిసింది. గురువారం నాంపల్లిలోని ప్రజాప్రతినిధుల కోర్టులో కాంగ్రెస్ నేతలపై క్రిమినల్ పరువు నష్టం పిటిషన్ దాఖలు చేసినట్టు సమాచారం. తన రాజకీయ ప్రతిష్టను, వ్యక్తిత్వాన్ని దెబ్బతీసేలా కాంగ్రెస్ నేతలు అసత్య ఆరోపణలు చేశారని, వీరిపై చర్యలు తీసుకోవాలని పిటిషన్‌లో పేర్కొన్నట్టు తెలిసింది.
ఇదిలాఉండగా, రాష్ట్రంలో వర్షాలు కురవకుండా అడ్డుకునేందుకు హరీశ్ రావు కర్ణాటకకు వెళ్లి క్షుద్ర పూజలు చేశారని టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ ముందుగా ఆరోపించారు. అనంతరం ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ సైతం ఇదే తరహా నిరాధార ఆరోపణలు చేశారు. దీంతో ఆగ్రహించిన హరీశ్ రావు వారి వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. తన సుదీర్ఘ రాజకీయ జీవితంలో ఎప్పుడూ లేని విధంగా తన భక్తిభావాన్ని కూడా రాజకీయం చేస్తూ దుష్ప్రచారం చేస్తున్నారని ఫైర్ అయ్యారు.
https://x.com/TeluguScribe/status/2100494189553496072?s=20
తాను ఆలయాలకు వెళితే క్షుద్రపూజలు చేస్తున్నానని ఆరోపించడం ఎంతమాత్రం క్షమించరానిదని మండిపడ్డారు. ఈ క్రమంలోనే తనపై చేసిన నిరాధార ఆరోపణలకు గాను టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్, అద్దంకి దయాకర్ బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తూ గతంలోనే హరీశ్ రావు లీగల్ నోటీసులు పంపించారు. అయినా వారి నుంచి స్పందన రాకపోవడంతో తాజాగా ప్రజాప్రతినిధుల కోర్టును మాజీ మంత్రి ఆశ్రయించినట్టు తెలిసింది.












