తెలంగాణ రాజకీయాల్లో కేసీఆర్ వ్యవహారశైలి మరోసారి ఆసక్తికరంగా మారింది. అసెంబ్లీ సమావేశాలకు హాజరు కాకూడదన్న ఆయన నిర్ణయంపై ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చ మొదలైంది. ఎన్నికల్లో గెలిచిన ఎమ్మెల్యే సభకు హాజరై ప్రజల తరఫున మాట్లాడటం ఒక బాధ్యత. ముఖ్యంగా ప్రతిపక్ష నేతగా ప్రభుత్వాన్ని ప్రశ్నించాల్సిన బాధ్యత మరింత కీలకం. అలాంటప్పుడు అసెంబ్లీకి దూరంగా ఉండటం ద్వారా ఈ పెద్ద దొర ప్రజలకు ఎలాంటి సందేశం ఇస్తున్నారనేది అర్థం కావడం లేదని అంటున్నారు..
అయితే కేసీఆర్ సభకు వెళ్లడం ఇష్టం లేదనుకుంటే అది ఆయన వ్యక్తిగత నిర్ణయమే కావచ్చు. కానీ జనంలోకి వెళ్లకపోవడం పై రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంటోంది. ప్రజలు ఎన్నుకున్న ఎమ్మెల్యేగా కొనసాగుతూ సభకు దూరంగా ఉంటే అధికార పక్షానికి విమర్శించే అవకాశం దొరుకుతుంది. ప్రతిపక్ష నేతగా ప్రజా సమస్యలను సభలో ప్రస్తావించాల్సిన సమయంలో గైర్హాజరవుతున్నారన్న ఆరోపణలు ఎదురవుతాయి.
దీంతో 80 వేల పుస్తకాలు చదివిన మహా జ్ఞానిగా కేసీఆర్ రాజకీయంగా తీసుకుంటున్న నిర్ణయం కంటే దాని ప్రభావమే ఇప్పుడు ఎక్కువగా చర్చనీయాంశంగా మారింది. ఇప్పటికే కాంగ్రెస్ నేతలు ఇదే అంశాన్ని ఆయుధంగా మార్చుకున్నారు. కేసీఆర్ అసెంబ్లీకి రావడం లేదని విమర్శిస్తూ ఆయన పదవిపై ప్రశ్నలు సంధిస్తున్నారు. మరోవైపు బీఆర్ఎస్ మాత్రం తమ అధినేత రాజకీయంగా క్రియాశీలంగానే ఉన్నారని చెబుతోంది. దీంతో అసలు కేసీఆర్ తదుపరి రాజకీయ వ్యూహం ఏంటన్న దానిపై ఉత్కంఠ నెలకొంది.
తెలంగాణలో ప్రతిపక్షం బలంగా ఉంటేనే ప్రభుత్వం మీద ఒత్తిడి పెరుగుతుంది. ప్రజా సమస్యలు, ప్రభుత్వ నిర్ణయాలు, హామీల అమలు, విధానాలపై నిలదీయడానికి అసెంబ్లీ ప్రధాన వేదిక. అలాంటి వేదికకు ప్రధాన ప్రతిపక్ష నేత దూరంగా ఉంటే... ఆ లోటును ఎవరు భర్తీ చేస్తారన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి.. మరోవైపు కేసీఆర్ అధికారంలో ఉన్నన్ని రోజులు పరిష్కరించలేని సాగునీటి అంశాన్ని మళ్ళీ తెరమీదికి తీసుకురావడం విడ్డూరంగా ఉందని అంటున్నారు..
రాష్ట్రంలో నీళ్ల వివాదం ఎప్పటి నుంచో కీలక రాజకీయ అంశంగా సాగుతుంది. సాగునీటి కోసం ఉద్యమం చేస్తామంటే ప్రజల్లో స్పందన వచ్చే అవకాశం ఉంది. కానీ అదే సమయంలో గతంలో అధికారంలో ఉన్నప్పుడు తీసుకున్న నిర్ణయాలపైనా ప్రశ్నలు ఎదురవుతాయి. ప్రాజెక్టుల నిర్మాణం, ఖర్చులు, నీటి లభ్యత, సాగు విస్తీర్ణం వంటి అంశాలు చర్చలోకి వస్తాయి. అంటే కొత్త పోరాటానికి శ్రీకారం చుడితే... పాత లెక్కలూ బయటకు వచ్చే పరిస్థితి ఉంటుందనే విషయాన్ని కేసీఆర్ మరచినట్టు ఉన్నారు..
మరోవైపు సీఏం అయ్యేదాక అసెంబ్లీ మెట్లు ఎక్కేది లేదని భీష్మించుకు కూర్చున్న కేసీఆర్ మీద కాంగ్రెస్ నేతలు విమర్శలకు దిగారు.. చెప్పిన మాటకు కట్టుబడి ఉండటమే కదా నాయకుడి లక్షణం. ఎలాగూ చట్టసభ వైపు కన్నెత్తి చూసే ఆలోచన లేనప్పుడు, శాసనసభ్యుడి హోదా, ప్రతిపక్ష స్థానానికి రాజీనామా చేయాలనే డిమాండ్స్ తెరమీదికి వచ్చాయి.. కేసీఆర్ నిర్ణయం వల్ల ఇప్పటి వరకు కోట్ల రూపాయల ప్రజాధనం జీతం రూపంలో వృధా అయ్యింది.. ప్రజాసంక్షేమం కోరేవారెవరైనా ఇలా పని చేయకుండా జీతాలు తీసుకోవడం సమంజసమేనా? అనే ప్రశ్నలు ఇప్పుడు వినిపిస్తున్నాయి..
ప్రజల పన్నుల నుండి వచ్చే జీతాలు కావాలి.. కానీ ప్రజా సమస్యలు వద్దు అనే తీరుగా ఉన్న కేసీఆర్ వ్యవహారం పై కాంగ్రెస్ నేతలు మండిపడుతున్నారు.. దశాబ్దాల సుదీర్ఘ అనుభవం ఉన్న నాయకుడిగా చెప్పుకునే దొరకు ఇది తగని పని కాదా? అని సూటిగా ప్రశ్నిస్తున్నారు.. ఇక ప్రజా తీర్పును గౌరవించి ఉన్నత స్థానంలో కూర్చోవాల్సిన నేత గైర్హాజరైతే, సంబంధిత చట్టాల ప్రకారం చర్యలు తీసుకోవాలా లేక ఆయనే స్వచ్ఛందంగా తప్పుకుంటారా అనే ఆలోచనలో అధికార పక్షం ఉన్నట్టు ప్రచారం జరుగుతుంది.
ఇక కాంగ్రెస్ నేతలు లేవనెత్తిన ఈ ప్రశ్నల్లో నిజం లేకపోలేదనే చర్చ ప్రజల్లో మొదలైంది. బాధ్యత కలిగిన ఎమ్మెల్యేగా చట్టసభలకు రానప్పుడు, ఆ సీటును పట్టుకుని వేలాడటం ఎందుకు? సొంత పనులకు, ఫామ్‌హౌజ్ లో విశ్రాంతికి ఉన్న ప్రాధాన్యం... ఓటేసిన ప్రజల సమస్యలకు లేకపోవడం ఏ రకమైన న్యాయం?.. అధికారం ఉంటేనే సమాజంలోకి వస్తా, లేకపోతే గడప దాటను అనడం ప్రజాస్వామ్యాన్ని పరిహసించడమే అవుతుందని జనం అనుకుంటున్నారు.. అందుకే, ఇప్పటికైనా ఆ పదవికి స్వస్తి పలికి, మరో నాయకుడికి అవకాశమిస్తేనే ఆ అపార జ్ఞానానికి, సుదీర్ఘ అనుభవానికి గౌరవం దక్కుతుంది. లేదంటే, చరిత్రలో ఇదో బాధ్యతారాహిత్యమైన అధ్యాయంగా మిగిలిపోవడం ఖాయమని అధికార పక్ష నేతలు అంటున్నారు..












