తెలంగాణ

Telangana: అసెంబ్లీలో హిట్ ఎక్కిన రాజకీయం.. స్పీకర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ!!..

రచన: Venu4 నిమిషాల పఠనం

అసెంబ్లీ స్పీకర్ ను ధూషించిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తాత మధు సభ్యత్వాన్ని వెంటనే రద్దు చేయాలని మంత్రి సీతక్క డిమాండ్ చేశారు. స్పీకర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేయడం దారుణమని పేర్కొన్నారు.

తెలంగాణ రాజకీయాలలో అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. కొండా సురేఖ ఎపిసోడ్ తరువాత ఇప్పుడు అసెంబ్లీ వేదికగా కొత్త లెక్కలు తెర మీదకు వస్తున్నాయి. అసెంబ్లీ సమావేశాల మొదటి రోజునే బీఆర్ఎస్ నేతల నిరసనలు వివాదాస్పదంగా మారాయి. గులాబీ నేతలపై పోలీసులు అనుచితంగా ప్రవర్తించారని, ఈ ఘటనపై ప్రభుత్వం స్పందించాలని డిమాండ్ చేస్తున్నారు.

ఇదే సమయంలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ అనుచిత వ్యాఖ్యలు చేయడంతో ఈ వివాదం కొత్త మలుపు తీసుకుంది. ఆ ఎమ్మెల్సీ పై వేటు వేయాలంటూ మంత్రులు ఫిర్యాదు చేసారు. ఆ దిశగా కసరత్తు చేస్తున్నట్లు సమాచారం.. ఇక అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌పై బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ తాత మధు అనుచిత వ్యాఖ్యలు చేసారని కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు. స్పీకర్‌పై మధు అనుచిత వ్యాఖ్యల వీడియోను సీఎంవో విడుదల చేసింది.

ఈ క్రమంలో శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి.. తాతా మధుపై చర్యలకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. సభ నుంచి ఆయనను బహిష్కరించే యోచనలో మండలి చైర్మన్ ఉన్నట్లు ప్రచారం జరుగుతుంది.. మరోవైపు మధు వ్యవహారంపై స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే, ఈ వ్యాఖ్యలను స్పీకర్, శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు తీవ్రంగా ఖండించారు.

అదేవిధంగా మధు పైన చర్యలు తీసుకోవాలని పలువురు మంత్రులు డిమాండ్ చేసారు. స్పీకర్ సభకు అధిపతి అని.. ఆయనపై అనుచిత వ్యాఖ్యలు చేయడం సరైన పద్దతి కాదని పేర్కొన్నారు. ఇదిలా ఉండగా.. బీఆర్ఎస్ అధికారంలో ఉన్న సమయంలో ఏమీ అనకపోయినా తనను, సంపత్‌ను సస్పెండ్ చేశారని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు. స్పీకర్‌పై అనుచితంగా మాట్లాడితే క్షమించకూడదని సూచించారు..

మరోవైపు అసెంబ్లీ స్పీకర్ ను ధూషించిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తాత మధు సభ్యత్వాన్ని వెంటనే రద్దు చేయాలని మంత్రి సీతక్క డిమాండ్ చేశారు. స్పీకర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేయడం దారుణమని పేర్కొన్నారు. తాత మధును ఆ పార్టీ నుంచి బీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ తక్షణం బహిష్కరించాలని పేర్కొన్నారు. అలాగే తాత మధుపై చర్యలు తీసుకోవాలని ఎంపీ మల్లు రవి సైతం డిమాండ్ చేశారు.

అయితే, తాను అనుచిత వ్యాఖ్యలు చేయలేదని తాతా మధు చెబుతున్నారు. దీంతో.. ఇప్పుడు మండలి ఛైర్మన్ నిర్ణయం పైన పార్టీలో ఉత్కంఠ నెలకొంది. ఇక తెలంగాణ శాసనసభ వర్షాకాల సమావేశాల తొలిరోజే సభలో తీవ్ర నిరసనలు, గందరగోళ వాతావరణం చోటుచేసుకుంది.

#telangana#council#chairman#gutta-sukhender-reddy#brs#mlc tata-madhu
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి