రాష్ట్రంలో ఎస్ఐఆర్ మాటున ఒక కోటి ఓట్లు తొలగించే కుట్ర జరుగుతోందని సీఎం రేవంత్ రెడ్డి ఆరోపించారు. ఈ విషయంలో కాంగ్రెస్ నేతలు అప్రమత్తంగా ఉండాలని సీఎం సూచించారు. తమ వ్యతిరేక ఓట్లను గుర్తించేందుకు బీజేపీ ప్రత్యేకంగా ఏజెన్సీలను పెట్టుకుందని, 2009 నుంచి ఓటింగ్ సరళని పరిశీలించి వారికి అనుకూల ఓట్లను ఉంచుకుని, వ్యతిరేక ఓట్లను డిలీట్ చేస్తున్నారని ఆరోపించారు. ప్రధాని మోడీ విధానాలకు వ్యతిరేకంగా వ్యవస్థ సిద్ధమవుతోందని గ్రహించి ‘ఎస్ఐఆర్’ రూపంలో కొత్త కుట్రకు తెరలేపారని అన్నారు.
తెలంగాణలో దాదాపు కోటి ఓట్లు తొలగిస్తున్నా బీఆర్ఎస్ వాళ్లు నోరెత్తడం లేదని ప్రశ్నించారు. సోమవారం రవీంద్రభారతిలో ప్రముఖ రైతు నేత సారంపల్లి మల్లారెడ్డి సంస్మరణ సభకు సీఎం ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జాతీయ స్థాయిలో సెక్యూలర్ శక్తులు సమిష్టిగా మోడీకి వ్యతిరేకంగా పోరాటం చేయాల్సిన చారిత్రక అవసరం ఎంతైనా ఉందని పిలుపునిచ్చారు. తన సొంత నియోజకవర్గం కొడంగల్ నుంచి వలస వెళ్లిన వారి ఓట్లు తొలగిస్తున్నారని రేవంత్ రెడ్డి ఆరోపించారు.
కొడంగల్ సెగ్మెంటులో 81 వేల ఓట్లు అనామలీస్ జాబితాలో చేర్చారని ఫైర్ అయ్యారు. ఇప్పుడు అప్రమత్తంగా ఉంటేనే 2029లో మోడీ ఓటమికి పునాది పడుతుందన్నారు. ఎర్రజెండాను చూస్తే పేదోడికి ఒక నమ్మకమని, దేశానికి మోడీ అత్యంత ప్రమాదకరమైన వ్యక్తి అని పేర్కొన్నారు. ఆయన ఓటమే కమ్యూనిస్టుల గెలుపని సీఎం చెప్పారు. బీజేపీ వ్యతిరేక ఓట్లు అనగానే మైనార్టీ ఓట్లు అని అంతా అనుకుంటున్నారని, పేదలు, గిరిజనుల ఓట్లు కూడా తొలగించే కుట్ర జరుగుతోందన్నారు
ఇక రైతుల కోసం తన జీవితాన్ని సర్వం ధారపోసిన సారంపల్లి మల్లారెడ్డిని కోల్పోవడం తెలంగాణ రైతాంగానికి తీరని లోటు అని సీఎం అన్నారు. కాలక్రమేణా రైతు సమస్యల పట్ల అవగాహన ఉన్న నాయకత్వం, రైతు సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వాలకు సూచన చేయాల్సిన లీడర్ షిప్ తగ్గుతోందన్నారు. చదువు కంటే సమస్య పట్ల అవగాహన, సంస్కారంతో కూడిన అంశాలను లేవనెత్తడంలో సారంపల్లితో పోటీ పడే వారు రాష్ట్రంలో ఎవరూ లేరన్నారు.కౌలు రైతులు, రైతులకు గిట్టుబాటు ధరలతో పాటు రైతు అంశాలపై మంచి పట్టు ఉందన్నారు.












