National

ప్రభుత్వ ఉద్యోగులకు షాక్.. రీల్స్, పోస్టుల కట్టడికి త్వరలో కొత్త నిబంధనలు!

రచన: Mamatha puppala4 నిమిషాల పఠనం

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల డిజిటల్ ప్రవర్తన, సోషల్ మీడియా వినియోగంపై కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోబోతోంది. ఇన్‌స్టాగ్రామ్, ఎక్స్(ట్విట్టర్), ఫేస్‌బుక్, యూట్యూబ్ వంటి సామాజిక మాధ్యమాల్లో ఉద్యోగులు చేసే పోస్టులపై ప్రత్యేకంగా ఒక సమగ్ర 'సోషల్ మీడియా కోడ్ ఆఫ్ కండక్ట్' (Social Media Code of Conduct) రూపొందించేందుకు సన్నాహాలు చేస్తోంది.

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల డిజిటల్ ప్రవర్తన, సోషల్ మీడియా వినియోగంపై కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోబోతోంది. ఇన్‌స్టాగ్రామ్, ఎక్స్(ట్విట్టర్), ఫేస్‌బుక్, యూట్యూబ్ వంటి సామాజిక మాధ్యమాల్లో ఉద్యోగులు చేసే పోస్టులపై ప్రత్యేకంగా ఒక సమగ్ర 'సోషల్ మీడియా కోడ్ ఆఫ్ కండక్ట్' (Social Media Code of Conduct) రూపొందించేందుకు సన్నాహాలు చేస్తోంది. ఇటీవల ప్రభుత్వ కార్యదర్శులతో జరిగిన ఉన్నత స్థాయి సమావేశంలో స్వయంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ అంశాన్ని ప్రస్తావించి, దీనిపై సమగ్ర అధ్యయనం చేసి నూతన మార్గదర్శకాలను ఖరారు చేయాలని సీనియర్ అధికారుల బృందాన్ని ఆదేశించినట్లు విశ్వసనీయ సమాచారం.

ఈ నూతన నిబంధనలు అమల్లోకి వస్తే హోదాతో సంబంధం లేకుండా కేంద్ర ప్రభుత్వ పరిధిలోని ఉద్యోగులు, అధికారులందరికీ ఒకే విధమైన ఆంక్షలు, నిబంధనలు వర్తిస్తాయి. ఇటీవలి కాలంలో కొందరు అధికారులు అధికారిక విధుల్లో ఉంటూనే ఇన్‌స్టాగ్రామ్‌లో రీల్స్ చేయడం, యూట్యూబ్ ఛానెళ్లు నడపడం, వ్యక్తిగత అభిప్రాయాల పేరుతో ప్రభుత్వ విధానాలపై వ్యాఖ్యలు చేయడం విస్తృతంగా పెరిగింది. అధికారిక సమాచారం, వ్యక్తిగత డిజిటల్ కంటెంట్ సరిహద్దులు చెరిగిపోవడంపై ఉన్నతాధికారుల నుంచి అభ్యంతరాలు వ్యక్తమైన నేపథ్యంలో ఈ నియంత్రణ చర్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.

ప్రస్తుతం వివిధ ప్రభుత్వ శాఖల్లో పాతకాలపు సర్వీస్ రూల్స్ మాత్రమే అమల్లో ఉండటంతో, ఆధునిక రీల్స్, యూట్యూబ్ షార్ట్స్ వంటి ప్లాట్‌ఫారమ్‌లకు అనుగుణంగా స్పష్టమైన చట్టపరమైన నిబంధనలు లేవు. 2017లో ఒక బీఎస్‌ఎఫ్ (BSF) జవాన్ తనకు లభించే ఆహార నాణ్యతపై వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టడం అప్పట్లో తీవ్ర దుమారం రేపింది. అలాంటి ఘటనల పునరావృతం కాకుండా, డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌లలో ప్రభుత్వ గోప్యతను, క్రమశిక్షణను కాపాడటానికి స్పష్టమైన చట్టపరమైన చట్రం అవసరమని కేంద్రం భావిస్తోంది.

రాబోయే కొత్త నిబంధనల కోడ్‌లో ఉద్యోగులు సోషల్ మీడియాలో ఎలాంటి విషయాలను పంచుకోవచ్చు, ఏయే అంశాలపై స్పందించకూడదనే దానిపై పూర్తి స్పష్టతనివ్వనున్నారు. ఒకవేళ ఈ కోడ్ ఆఫ్ కండక్ట్‌ను ఉల్లంఘిస్తే శాఖాపరమైన క్రమశిక్షణా చర్యలతో పాటు ఎలాంటి శిక్షలు విధించాలనే అంశాన్ని కూడా అందులో పొందుపరచనున్నారు. ఇప్పటికే ఏఐ కంటెంట్ గుర్తించడం, అక్రమ పోస్టుల తొలగింపుపై నిబంధనలను కఠినతరం చేసిన కేంద్రం, త్వరలోనే ఉద్యోగుల కోసం ఈ కొత్త సోషల్ మీడియా మార్గదర్శకాలను అధికారికంగా విడుదల చేయనుంది.

#CentralGovtEmployees#SocialMediaRules#CodeOfConduct#NarendraModi#PublicServiceRules#swechaanews
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి