తెలంగాణలో మారిన రాజకీయం
బీఆర్ఎస్ దూకుడు వెనుక వ్యూహమేంటి..?
కేసీఆర్ చెప్పగానే.. రోడ్డెక్కిన కేటీఆర్, హరీష్
తెలంగాణ రాజకీయాల్లో బీఆర్ఎస్ మళ్లీ తన పాత పోరాట పంథాలోకి అడుగుపెడుతున్న సంకేతాలు కనిపిస్తున్నాయి. పార్టీ అధినేత కేసీఆర్ నిన్న ఇచ్చిన పిలుపు.. మరుసటి రోజే అసెంబ్లీ వేదికగా అమల్లోకి వచ్చింది. కేటీఆర్, హరీష్‌రావు నేతృత్వంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు రోడ్డుపైకి వచ్చి నిరసనకు దిగడం, పోలీసులు అడ్డుకోవడం, బ్లాక్ టీషర్టులు విప్పేసి కూడా ఆందోళన కొనసాగించడం, చివరకు కేటీఆర్, హరీష్‌రావులను పోలీసులు అదుపులోకి తీసుకోవడం.. ఇవన్నీ చూస్తే ఇది యాదృచ్ఛికంగా జరిగిన నిరసన కాదనే అభిప్రాయం కలుగుతోంది.
కేసీఆర్ ఆదేశం.. వెంటనే యాక్షన్
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఇకపై ప్రజా సమస్యలపై మరింత దూకుడుగా పోరాడాలని పార్టీ నేతలకు దిశానిర్దేశం చేసిన మరుసటి రోజే ఈ పరిణామాలు చోటుచేసుకున్నాయి. అంటే.. పార్టీ ఇక కేవలం అసెంబ్లీలో ప్రభుత్వాన్ని ప్రశ్నించడం, ప్రెస్‌మీట్లకు పరిమితం కావడం కాకుండా.. నేరుగా ప్రజల్లోకి వెళ్లి పోరాటం చేయాలని నిర్ణయించుకున్నట్టుగా కనిపిస్తోంది.
ఇవాళ అసెంబ్లీ వద్ద బీఆర్ఎస్ ఎమ్మెల్యేల నిరసన ఈ వ్యూహానికి తొలి బహిరంగ సంకేతంగా మారింది. బ్లాక్ టీషర్టులతో ఎమ్మెల్యేలు ఆందోళనకు దిగడంతో పోలీసులు అడ్డుకున్నారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. టీషర్టులు విప్పేసి కూడా నిరసన కొనసాగించడం, కేటీఆర్, హరీష్‌రావు అరెస్టు కావడం ఈ ఆందోళనకు మరింత రాజకీయ ప్రాధాన్యత తెచ్చింది.
రెండేళ్ల ముందే ఎన్నికల మూడ్..?
తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా సమయం ఉంది. కానీ బీఆర్ఎస్ మాత్రం ఇప్పటి నుంచే రాజకీయ పోరాటాన్ని వేడెక్కించే ప్రయత్నం చేస్తోంది. దీనివెనుక ప్రధానంగా రెండు లెక్కలు కనిపిస్తున్నాయి.
మొదటిది.. కాంగ్రెస్ ప్రభుత్వంపై పెరుగుతున్న అసంతృప్తిని రాజకీయంగా క్యాష్ చేసుకోవడం. రెండోది.. ప్రతిపక్ష రాజకీయాల్లో బీఆర్ఎస్ తన స్థానాన్ని మళ్లీ బలంగా స్థిరపరచుకోవడం.
ఎన్నికల ఏడాది వరకు వేచి చూస్తే.. క్యాడర్‌ను మళ్లీ పూర్తిస్థాయిలో యాక్టివ్ చేయడం కష్టం. అందుకే ఇప్పటి నుంచే ఉద్యమాలు, నిరసనలు, ప్రజా సమస్యలపై పోరాటాలతో పార్టీని గ్రౌండ్‌లోకి తీసుకెళ్లాలని బీఆర్ఎస్ భావిస్తున్నట్టుగా కనిపిస్తోంది. అంటే అసెంబ్లీ వద్ద జరిగిన ఆందోళనను కేవలం ఒక నిరసనగా కాకుండా.. రాబోయే రెండేళ్ల రాజకీయ యాక్షన్ ప్లాన్‌కు ఆరంభంగా చూడాలా? అన్న చర్చ మొదలైంది.
కాంగ్రెస్‌కు నేరుగా సవాల్...
బీఆర్ఎస్ దూకుడు వెనుక మొదటి టార్గెట్ కాంగ్రెస్ ప్రభుత్వమే. అధికారంలో ఉన్న పార్టీని ప్రతి అంశంలో ఇరుకున పెట్టడం, ప్రభుత్వ హామీలు, నిర్ణయాలు, ప్రజా సమస్యలను ఆయుధాలుగా మార్చుకోవడం ద్వారా కాంగ్రెస్‌పై నిరంతర ఒత్తిడి పెంచాలన్నది బీఆర్ఎస్ వ్యూహంగా కనిపిస్తోంది.
ఇకపై అసెంబ్లీ సమావేశాలు జరిగినప్పుడు మాత్రమే బీఆర్ఎస్ గొంతు వినిపించకుండా.. అసెంబ్లీ బయట కూడా అదే స్థాయిలో రాజకీయ పోరాటం చేయాలని పార్టీ భావిస్తున్నట్టుగా ఉంది. ఒక సమస్యను పట్టుకోవడం.. దానిపై ఆందోళన చేయడం.. నేతల అరెస్టులు.. ఆ తర్వాత ప్రభుత్వంపై మరింత రాజకీయ దాడి చేయడం.. ఇలా ఒక కంటిన్యూయస్ పొలిటికల్ నేరేటివ్‌ను నిర్మించే ప్రయత్నం జరిగే అవకాశం ఉంది.
ఇదే జరిగితే కాంగ్రెస్‌కు ముందున్న రెండేళ్లు కేవలం పాలనకు సంబంధించిన సవాళ్లే కాదు.. ప్రతిరోజూ ఒక రాజకీయ సవాల్‌ను ఎదుర్కోవాల్సిన పరిస్థితి రావచ్చు.
బీజేపీకి కూడా చెక్ పెట్టే లెక్క!
అయితే బీఆర్ఎస్ దూకుడు కేవలం కాంగ్రెస్‌ను టార్గెట్ చేయడానికే పరిమితం కాదు. తెలంగాణలో కాంగ్రెస్ వ్యతిరేక రాజకీయ స్పేస్‌పై బీఆర్ఎస్, బీజేపీ మధ్య కూడా పోటీ ఉంది. ఇక్కడే బీఆర్ఎస్ వ్యూహం ఆసక్తికరంగా మారుతోంది. ప్రభుత్వంపై బలమైన పోరాటం చేసే ప్రధాన ప్రతిపక్షంగా తానే కనిపించాలని బీఆర్ఎస్ భావిస్తే.. బీజేపీకి సహజంగానే ఇబ్బంది. ఎందుకంటే కాంగ్రెస్ వ్యతిరేకతను ఎవరు ముందుగా ప్రజల్లోకి తీసుకెళ్తారన్నదే కీలకం.
ప్రస్తుతం బీఆర్ఎస్ స్థాయిలో బీజేపీ నుంచి నిరంతరమైన స్ట్రీట్‌ఫైట్ కనిపించడం లేదనే రాజకీయ చర్చ ఉంది. ఈ పరిస్థితిని బీఆర్ఎస్ తనకు అనుకూలంగా మలుచుకోవాలని చూస్తున్నట్టుగా కనిపిస్తోంది. ప్రభుత్వాన్ని ప్రశ్నించేది మేమే.. ప్రజల తరఫున రోడ్డెక్కేది మేమే అనే నేరేటివ్‌ను బలంగా తీసుకెళ్లగలిగితే.. అది కాంగ్రెస్‌పై దాడితో పాటు బీజేపీకి కూడా చెక్ పెట్టే వ్యూహంగా మారుతుంది.
కేటీఆర్, హరీష్‌కు కీలక బాధ్యత
ఈ మొత్తం వ్యూహంలో కేటీఆర్, హరీష్‌రావు పాత్ర కూడా కీలకం. కేసీఆర్ రాజకీయ దిశానిర్దేశం ఇస్తే.. దాన్ని క్షేత్రస్థాయిలో అమలు చేసే బాధ్యత ఈ ఇద్దరు కీలక నేతలపై పడుతోంది. ఇవాళ అసెంబ్లీ వద్ద జరిగిన నిరసనలో ఇద్దరూ ముందుండటం, అరెస్టు కావడం.. పార్టీ ఇక వెనక్కి తగ్గే మూడ్‌లో లేదనే సంకేతాన్ని క్యాడర్‌కు ఇచ్చే ప్రయత్నంగా చూడొచ్చు.
అయితే ఇక్కడ బీఆర్ఎస్‌కు కూడా ఒక పరీక్ష ఉంది. ఒక్కరోజు నిరసనతో రాజకీయ పునరాగమనం సాధ్యం కాదు. ఈ దూకుడు జిల్లాలకు, నియోజకవర్గాలకు, గ్రామస్థాయికి ఎంతవరకు వెళ్తుంది? ప్రజా సమస్యలతో ఎంతవరకు కనెక్ట్ అవుతుంది? అన్నదే అసలు ప్రశ్న.
స్ట్రీట్ ఫైట్.. పొలిటికల్ రీసెటా?
మొత్తానికి.. కేసీఆర్ ఇచ్చిన పిలుపు, కేటీఆర్-హరీష్‌రావు చేపట్టిన ఆందోళనను కలిపి చూస్తే బీఆర్ఎస్ ఒక కొత్త రాజకీయ దశకు సిద్ధమవుతున్నట్టుగా కనిపిస్తోంది. కాంగ్రెస్‌పై ఒత్తిడి పెంచాలి.. క్యాడర్‌ను మళ్లీ కదిలించాలి.. ప్రజల్లోకి వెళ్లాలి.. అదే సమయంలో బీజేపీకి ప్రతిపక్ష స్పేస్ దక్కకుండా చూడాలి. ఈ నాలుగు లెక్కల చుట్టూనే బీఆర్ఎస్ కొత్త స్ట్రీట్ ఫైట్ సాగించే అవకాశం ఉంది.
అందుకే అసెంబ్లీ వద్ద జరిగిన గొడవను కేవలం ఒకరోజు నిరసనగా చూడటం కంటే.. వచ్చే రెండేళ్ల తెలంగాణ రాజకీయాలకు బీఆర్ఎస్ వేసిన పొలిటికల్ బేస్‌గా చూడాలని విశ్లేషకులు చెబుతున్నారు.
కేసీఆర్ చెప్పారు.. కేటీఆర్, హరీష్ చేశారు. ఇక రాబోయే రోజుల్లో బీఆర్ఎస్ ఏం చేస్తుందన్నదే తెలంగాణ రాజకీయాల్లో అసలు ఆసక్తికరమైన ప్రశ్న.












