ఏపీలోని పల్నాడు జిల్లాలో అత్యంత అరుదైన, విస్మయపరిచే వైద్య అద్భుత ఘట్టం వెలుగుచూసింది. తీవ్రమైన ఛాతీ నొప్పితో బాధపడుతూ ఆస్పత్రికి వచ్చిన ఒక మహిళను పరిశీలించిన వైద్యులకు మైండ్ బ్లాంక్ అయ్యే నిజం తెలిసింది. ఆమె కడుపులో వస్తువులు ఉన్నట్లు గుర్తించిన వైద్యులు, శస్త్రచికిత్స ద్వారా ఏకంగా 14 ప్లాస్టిక్ పెన్నులు, 5 చెక్క స్పూన్లు, ఒక కొవ్వొత్తిని బయటకు తీశారు. మానసిక అనారోగ్యం, వ్యక్తిగత జీవితంలో ఎదురైన తీవ్ర వేదన కారణంగానే ఆ మహిళ ఈ రకమైన ప్రమాదకర చర్యకు పాల్పడినట్లు కుటుంబ సభ్యులు వెల్లడించారు.

బాధితురాలి వివరాల్లోకి వెళితే.. నరసరావుపేట మండలం పెట్లూరివారిపాలెం గ్రామానికి చెందిన 33ఏళ్ల మహిళ గత కొన్ని రోజులుగా తీవ్రమైన ఛాతీ నొప్పితో అల్లాడిపోతోంది. దీంతో ఆందోళన చెందిన కుటుంబసభ్యులు ఆమెను వెంటనే సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. వైద్యులు ఆమెకు ప్రాథమిక పరీక్షలు నిర్వహించి, స్కానింగ్ చేయగా కడుపులో భారీసంఖ్యలో ఘన వస్తువులు పేరుకుపోయి ఉన్నట్లు చూసి తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. పరిస్థితి విషమించకుండా ఉండేందుకు నరసరావుపేట వైద్యుల బృందం తక్షణమే శస్త్రచికిత్స చేయడానికి సిద్ధమైంది.
అత్యంత చాకచక్యంగా వ్యవహరించిన నిపుణులైన వైద్యుల బృందం లాప్రోస్కోపిక్ (Laparoscopic) శస్త్రచికిత్స విధానాన్ని ఎంచుకుంది. మహిళ పొత్తికడుపు భాగంలో చిన్న రంధ్రం చేసి, పొట్టలో ఉన్న మొత్తం 20 వస్తువులను అత్యంత సురక్షితంగా బయటకు తొలగించారు. ఆమె మింగిన పెన్నులలో ఒక పెన్నుకు మూత (క్యాప్) లేకపోవడం వల్ల, ఆ పదునైన భాగం కడుపు లోపలి గోడలకు గుచ్చుకుని తీవ్రమైన ఛాతీ, కడుపు నొప్పికి దారితీసిందని శస్త్రచికిత్స నిర్వహించిన వైద్యులు వివరించారు. ప్రస్తుతం బాధితురాలి ఆరోగ్యం పూర్తిగా నిలకడగా ఉందని, కోలుకుంటున్నారని వైద్యులు తెలిపారు.
ఈ విచిత్ర ఉదంతంపై బాధితురాలి తండ్రి నోముల హనుమంతరావు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. తన కుమార్తె గత పదేళ్లుగా తీవ్రమైన మానసిక అనారోగ్యంతో బాధపడుతోందని, ఆమె పరిస్థితిని అర్థం చేసుకోకుండా కేవలం రెండు నెలల క్రితమే భర్త విడాకులు ఇచ్చి వెళ్లిపోయాడని కన్నీటిపర్యంతమయ్యారు. భర్త వదిలేయడంతో తీవ్రమైన మానసిక ఒత్తిడి, వేదనకు గురైన ఆమె ఈ విపరీత చర్యకు ఒడిగట్టి ఉండవచ్చని కుటుంబ సభ్యులు భావిస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ లాప్రోస్కోపిక్ ద్వారా ప్రాణాపాయం తప్పించడంతో కుటుంబ సభ్యులు వైద్యులకు కృతజ్ఞతలు తెలిపారు.












