రాష్ట్రంలో అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం రోజున పోలీసులు, బీఆర్ఎస్ శాసనసభ్యులకు మధ్య తీవ్ర వాగ్వాదం నెలకొంది. గన్‌పార్క్ వద్ద కాంగ్రెస్ పాలనా వైఫల్యం, హామీలపై నిలదీస్తూ ప్లకార్డులు ప్రదర్శించి నిరసన తెలిపిన బీఆఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అసెంబ్లీ వద్దకు పాదయాత్రగా బయలుదేరారు. తీరా అసెంబ్లీ దగ్గర వారిని పోలీసులు అడ్డుకున్నారు. నల్లదుస్తులు, ప్లకార్డులు పట్టుకోని లోనికి వెళ్లడానికి వీల్లేదంటూ ఆపారు. దీంతో బీఆర్ఎస్ సభ్యులు, పోలీసుల నడుమ నెలకొన్న స్వల్ప వివాదం కాస్త ముదిరింది.తోపులాట నెలకొనడంతో పోలీసులు వారిని లాగేశారు.
ఈ క్రమంలోనే పోలీసులు మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి జుట్టుపట్టుకుని లాగినట్టు ఓ వీడియో వైరల్ అవుతోంది. మాజీ మంత్రి, మహిళా ప్రజాప్రతినిధి అని చూడకుండా అమానుషంగా వ్యవహరించారని పోలీసుల తీరుపై తీవ్రవిమర్శలు వెల్లువెత్తుతున్నాయి.దీనికి తోడు మాజీ మంత్రి సునీతా లక్ష్మారెడ్డి చీర కూడా పోలీసులు లాగినట్టు ఆరోపణలు వచ్చాయి.

ఈ క్రమంలోనే బీఆర్ఎస్ నేతలను పోలీసులు అరెస్టు చేసి పోలీస్ స్టేషన్లకు తరలించారు. అనంతరం తెలంగాణ భవన్‌కు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు చేరుకున్నారు. ఈ క్రమంలోనే మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి మీడియాతో మాట్లాడారు.కాంగ్రెస్ ప్రభుత్వంత తీరు, పోలీసులు వ్యహరిస్తున్న విధానంపై తీవ్రంగా మండిపడ్డారు. ‘మా చీరలు లాగి, గొంతులు పట్టమని రేవంత్ రెడ్డి ఆదేశం ఇచ్చాడా? పోలీసులు అలా ప్రవర్తిస్తే రేవంత్ రెడ్డికి ఆనందంగా ఉందా? రాహుల్ గాంధీ నల్ల రంగు టీ షర్ట్ వేసుకొని, దాని మీద మోడీ-అదానీ ఫోటో పెట్టుకొని పార్లమెంట్ దగ్గర ప్రశ్నించొచ్చు అంట. కానీ ఇక్కడ మేము నల్ల రంగు దుస్తులు వేసుకొని అసెంబ్లీకి వెళ్లొద్దు అంట.
https://x.com/TeluguScribe/status/2096836893505978842?s=20
అసెంబ్లీకి మా వ్యక్తిగత ప్రయోజనాల కోసం వెళ్లం.. ప్రజల తరపున మాట్లాడడానికి, హామీలపై ప్రశ్నించడానికి వెళ్తాం.కానీ, ఈరోజు అసెంబ్లీ లోపలికి కూడా వెళ్లనివ్వకుండా పోలీసులతో మమ్మల్ని అడ్డుకున్నారు. తెలంగాణ, ఉమ్మడి ఆంధ్ర చరిత్రలో ఎప్పుడూ ఇలా మహిళా శాసన సభ్యుల పట్ల పోలీసులు ప్రవర్తించిన తీరు లేదు. గత అసెంబ్లీ సమావేశాల్లో కూడా ముఖ్యమంత్రి మా మహిళా శాసన సభ్యులను పట్టుకొని కామెంట్స్ చేశాడు. ఆ వ్యాఖ్యలకు నిరసనగా 4 రోజులు మేము సమావేశాల్లో నిల్చోనే ఉంటే స్పీకర్ కనీసం కూర్చోమని అనలేదు, ముఖ్యమంత్రి నవ్వుతూ వెళ్లిపోయాడు’ అంటూ సబితా ఇంద్రారెడ్డి తీవ్ర విమర్శలు చేశారు.












