TG: తెలంగాణలో ఈరోజు నుంచి సభాపర్వం మొదలైంది. ఎప్పట్లాగానే ఈసారి కూడా అసెంబ్లీ సమావేశాలకు బీఆర్ఎస్ అధినేత, శాసనసభ విపక్ష నేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ హాజరు కాలేదు. ఇదే సమయంలో ఆయన ప్రజా తీర్పుకు వ్యతిరేకంగా నడుచుకుంటున్నారని విమర్శలు గత కొంతకాలంగా వినిపిస్తున్నాయి. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావం తరువాత జరిగిన ఎన్నికల్లో నాటి టీఆర్ఎస్ నేటి బీఆర్ఎస్ పార్టీకి ప్రజలు పట్టం కట్టిన సంగతి తెలిసిందే. ముఖ్యమంత్రిగా ఆ పార్టీ అధినేత కేసీఆర్ సీఎం పీఠం అదిరోహించి, వరుసగా రెండు పర్యాయాలు తెలంగాణ రాష్ట్రానికి సీఎంగా సేవలందించారు.
అనంతరం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్ర ప్రజలకు తీర్పుకనుగుణంగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కొలువుదీరింది. ప్రజలు బీఆర్ఎస్ ప్రభుత్వానికి ప్రతిపక్ష హోదాను కట్టబెట్టారు. అసెంబ్లీలో ప్రతిపక్ష నేతగా ఎన్నికైన కేసీఆర్ ఇప్పటి వరకు వేళ్ళ మీద లెక్కించినన్నిసార్లు అసెంబ్లీ సమావేశాలకు హాజరై అపకీర్తిని మూట పెట్టుకున్నారు. అధికారం దూరమైందన్న కారణంగానే ఆయన అసెంబ్లీకి రావడం మానేశారనే విమర్శలను బీఆర్ఎస్ అధినేత నిజం చేస్తున్నారా అని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
ఏదేమైనా ఆయనకున్న రాజకీయ అనుభవం, ప్రజా సమస్యల మీద ఆయనకున్న అవగాహన, కొత్తగా ఎన్నికైన కాంగ్రెస్ ప్రభుత్వానికి మార్గదర్శనం చేసే స్థాయిలో ఉండాల్సిన ఆయన అసెంబ్లీ సమావేశాలకు రాకపోవడాన్ని ప్రజలు సైతం తప్పుపడుతున్నారని రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు. ఇదే సమయంలో పక్క రాష్ట్రంలో ప్రస్తుతం ముఖ్యమంత్రిగా సేవలు అందిస్తున్న నారా చంద్రబాబు నాయుడుని ఉదాహరణగా పేర్కొంటూ పోలికలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. గతంలో ఆయన ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు అసెంబ్లీకి హాజరై నాటి అధికారపక్షమైన వైఎస్ఆర్సీపీ నాయకుల చేత ఎన్నో అవమానాలు, అవహేళనలను ఎదుర్కొన్న సందర్భాలు అసెంబ్లీ సాక్షిగా కనిపించిన దాఖలాలు ఉన్నాయి.
వాస్తవానికి అవే ఆయనకు ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో సీఎం పీఠానికి చేరుకునే మెట్లుగా నిలిచాయని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. నాడు ఆయన అసెంబ్లీ సాక్షిగా ఎదుర్కొన్న అవమానాలే ప్రజల్లో ఆయన పట్ల సానుభూతిని తీసుకొచ్చాయని చెబుతున్నారు. ఇదే సమయంలో తెలంగాణ రాష్ట్రంలో ప్రతిపక్ష పాత్ర పోషించాల్సిన కేసీఆర్ అసెంబ్లీ సమావేశాలకు కూడా రాకుండా ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రంలోనే ఉండటాన్ని కాంగ్రెస్, బీజేపీ వర్గాలు తీవ్రంగా విమర్శిస్తున్నాయి. ఇటీవల కాంగ్రెస్ నాయకుల ఆధ్వర్యంలో అసెంబ్లీ సమావేశాలకు రాని కేసీఆర్ తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని మహా ధర్నా కూడా నిర్వహించారు.
నిజానికి ఆయన అసెంబ్లీ సమావేశాలకు రాకపోతే బీఆర్ఎస్ పార్టీకి కచ్చితంగా మైనస్ అవుతుందనే వాదనలు క్షేత్రస్థాయిలో సాధారణ ప్రజల నుంచి వినిపిస్తున్నాయి. ఒడిశా ముఖ్యమంత్రిగా 5 సార్లు (5 పర్యాయాలు) వరుసగా పనిచేసిన నవీన్ పట్నాయక్ కూడా ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఓడిపోతే ఎలాంటి అవమానంగా భావించకుండా ప్రతిపక్ష నాయకుడి హోదాలో గౌరవంగా అసెంబ్లీ సమావేశాలకు హాజరయ్యారు. ఇలా అందరూ నాయకులు అప్పటివరకు ముఖ్యమంత్రిగా సేవలు అందించిన తర్వాత జరిగిన ఎన్నికల్లో ఓటమి పోలైనా ప్రజల తీర్పును పాటించకుండా అసెంబ్లీ సమావేశాలకు రాకుండా పోలేదని గుర్తు చేస్తున్నారు.
కేసీఆర్ వ్యవహార శైలి ఇలాగే కొనసాగితే ప్రజలుకి ఇవి తప్పుడు సంకేతాలుగా వెళ్లి.. వచ్చే ఎన్నికల్లో పార్టీకి అధికారాన్ని దూరం చేసే వాటిలో ప్రతిపక్షాలకు ఆయుధాలుగా మారుతాయనే కామెంట్స్ సొంత పార్టీ నేతల నుంచి కూడా వినిపిస్తున్నాయి. ఇకనైనా ఆయన అసెంబ్లీ సమావేశాలకు వెళ్లి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేలా ప్రభుత్వ తప్పిదాలను ఎత్తి చూపి, ప్రజల పక్షాన నిలబడి పోరాడాలని సాధారణ ప్రజల నుంచి, బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల వరకు ఆకాంక్షిస్తున్నారు. చూడాలి మరి ప్రస్తుతం జరుగుతున్న అసెంబ్లీ సమావేశాలకు బీఆర్ఎస్ అధినేతగా, ప్రతిపక్ష నేతగా అసెంబ్లీ సమావేశాలకు కేసీఆర్ హాజరవుతారు లేదో అనేది.












