National

Indore: రాహుల్ సభలో మోదీపై స్కిట్.. భగ్గుమన్న బీజేపీ!!..

రచన: Venu4 నిమిషాల పఠనం

ఇండోర్‌లో కాంగ్రెస్ నిర్వహించిన ఛాత్రోంకీ గుంజ్ కార్యక్రమం విద్యార్థుల సమస్యలపై చర్చకు వేదిక కావాల్సి ఉండగా.. ప్రధాని నరేంద్ర మోదీపై జరిగిన మిమిక్రీతో రాజకీయ వివాదానికి కేంద్ర బిందువుగా మారింది.

ఇండోర్‌లో కాంగ్రెస్ నిర్వహించిన ఛాత్రోంకీ గుంజ్ కార్యక్రమం విద్యార్థుల సమస్యలపై చర్చకు వేదిక కావాల్సి ఉండగా.. ప్రధాని నరేంద్ర మోదీపై జరిగిన మిమిక్రీతో రాజకీయ వివాదానికి కేంద్ర బిందువుగా మారింది. సెప్టెంబర్ 19న జరిగిన ఈ కార్యక్రమంలో స్టాండప్ కమెడియన్ పుల్కిత్ మణి.. ప్రధాని మోదీ మాట్లాడే తీరు, హావభావాలను అనుకరిస్తూ స్కిట్ చేశారు. ఆ సమయంలో లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ కూడా వేదికపైనే ఉన్నారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో బీజేపీ తీవ్రంగా స్పందించింది.

బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి సీఆర్ కేశవన్.. ఈ ప్రదర్శనను అసభ్యంగా, బాధ్యతారహితంగా అభివర్ణించారు. ముఖ్యంగా ఓ వృద్ధ మహిళకు సంబంధించిన వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ.. మహిళలు, వృద్ధుల పట్ల గౌరవం దెబ్బతీసేలా వ్యవహరించారని ఆరోపించారు. ఇక కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు.. కాంగ్రెస్‌ను కామెడియన్లు, జోకర్ల పార్టీగా అభివర్ణిస్తూ ఎక్స్‌లో విమర్శలు గుప్పించారు.

కేంద్ర విద్యాశాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి.. ప్రధాని మోదీ దివంగత తల్లిని అవమానించేలా కార్యక్రమం సాగిందని ఆరోపించారు. మరోవైపు విద్యార్థుల సమస్యలు, పేపర్ లీకులు, విద్యా వ్యవస్థ, ఉద్యోగ అవకాశాలపై రాహుల్ గాంధీ మాట్లాడిన ఛాత్రోంకీ గుంజ్ కార్యక్రమం.. చివరికి మోదీ మిమిక్రీ చుట్టూ ఎందుకు తిరుగడం పై విమర్శలు అందుకుంటుంది. కానీ కాంగ్రెస్ ఈ ఘటనను రాజకీయ వ్యంగ్యంగా చూడవచ్చనే వాదన వినిపిస్తుంది.

కానీ బీజేపీ మాత్రం ఇది ప్రధానమంత్రి పదవిని, వ్యక్తిగత గౌరవాన్ని కించపరిచే స్థాయికి వెళ్లిందని విమర్శిస్తోంది. దీంతో అసలు విద్యార్థుల సమస్యలు వెనక్కి వెళ్లి.. మిమిక్రీ, వ్యక్తిగత వ్యాఖ్యలు, రాజకీయ సంస్కృతి అనే అంశాలే ముందుకు వచ్చాయి. ఇక రాహుల్ గాంధీకి ఇది మరో రాజకీయ కమ్యూనికేషన్ పరీక్షగా మారింది. ప్రతిపక్షంగా ప్రభుత్వాన్ని ప్రశ్నించడం ఒక కోణమైతే.. ఆ విమర్శలు ఏ వేదికపై, ఏ భాషలో, ఏ రూపంలో వ్యక్తమవుతున్నాయన్నది మరో కీలక అంశం. ఇండోర్ ఘటన ఇప్పుడు కాంగ్రెస్-బీజేపీ మధ్య మాటల యుద్ధాన్ని మరింత పదును పెట్టే అంశంగా మారింది..

#national-news#Indore#pm-modi#mimicry#rahul-gandhi#meeting#sparks-bjp#Voice of the Students
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి