Warangal MGM: వరంగల్ ఎంజీఎం ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రమాదం చోటుచేసుకుంది. రోగాల నుంచి విముక్తి పొందేందుకు ఆస్పత్రికి వచ్చిన పేషెంట్లపై పెచ్చులూడి పడ్డాయి. ఆరోగ్యశ్రీ వార్డులో ఎప్పటిలాగే ఆదివారం చికిత్స పొందుతున్న రోగులు, వారికి సపర్యలు చేస్తున్న కుటుంబ సభ్యులతో సందడిగా ఉంది. సరిగ్గా అదే సమయంలో ఎవరూ ఊహించని రీతిలో వార్డు పైకప్పు పెచ్చులు పెద్ద శబ్దంతో ఒక్కసారిగా ఊడి కిందపడ్డాయి. ఏం జరుగుతుందో తెలుసుకునే లోపే ఆ శిథిలాలు నేరుగా రోగులపై పడ్డాయి. ఈ ఊహించని పరిణామంతో వార్డులో చికిత్స పొందుతున్న సారయ్య, మస్తాన్, స్వరూపలతో పాటు వారిని పరామర్శించేందుకు వచ్చిన బంధువులు తీవ్రంగా గాయపడ్డారు. అంతేకాకుండా అక్కడే విధి నిర్వహణలో ఉన్న ఇద్దరు పారిశుద్ధ్య కార్మికులు కూడా ఈ ప్రమాదం బారినపడ్డారు.
పైకప్పు విరిగిపడటంతో ఒక్కసారిగా తీవ్ర భయాందోళనకు గురైన తోటి పేషెంట్లు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బయటకు పరుగులు తీశారు. అప్రమత్తమైన ఇతర సిబ్బంది వెంటనే క్షతగాత్రులను ఎమర్జెన్సీ వార్డు తరలించి తక్షణ చికిత్స అందించారు. సమాచారం అందుకున్న ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రామ్ కుమార్ రెడ్డి ఘటనా స్థలానికి చేరుకుని, బాధితులను పరామర్శించి మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు. ఎంజీఎం ఆసుపత్రిలో ఇలాంటి ఘటనలు జరగడం ఇదే మొదటిసారి కాదు.
గతంలోనూ పలుమార్లు వివిధ విభాగాల్లో సీలింగ్ పెచ్చులూడి పడిన సంఘటనలు వెలుగు చూశాయి. పదే పదే ఇలాంటి ప్రమాదాలు జరుగుతుండటంపై రోగుల బంధువులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వైద్యం కోసం వస్తే ప్రాణాలకే ముప్పు వాటిల్లే పరిస్థితి ఉందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ వరుస ఘటనలకు బాధ్యులెవరంటూ అధికారులు, పాలకులపై ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి శిథిలావస్థకు చేరిన వార్డులకు పూర్తిస్థాయిలో మరమ్మతులు చేపట్టాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.








