తెలంగాణ

Etela Rajender: సీఎం కుర్చీపై ఈటల కన్ను పడిందా?.. ఆ ఇంటర్వ్యూ క్లిప్‌తో నెట్టింట దుమారం!

రచన: Mahesh5 నిమిషాల పఠనం

Etela Rajender: తెలంగాణ రాజకీయ ముఖచిత్రంపై ఎప్పటికప్పుడు రాజుకునే ‘సామాజిక న్యాయం’ నినాదం మరోసారి తెరపైకి వచ్చింది. రాష్ట్ర జనాభాలో సింహభాగం ఉన్న వెనుకబడిన వర్గాలకు (బీసీలకు) అత్యున్నత అధికార పీఠం ఎందుకు అందని ద్రాక్షగా మిగిలిపోతోంది?

Etela Rajender: తెలంగాణ రాజకీయ ముఖచిత్రంపై ఎప్పటికప్పుడు రాజుకునే ‘సామాజిక న్యాయం’ నినాదం మరోసారి తెరపైకి వచ్చింది. రాష్ట్ర జనాభాలో సింహభాగం ఉన్న వెనుకబడిన వర్గాలకు (బీసీలకు) అత్యున్నత అధికార పీఠం ఎందుకు అందని ద్రాక్షగా మిగిలిపోతోంది? ఉద్యమాల గడ్డపై సామాజిక సమీకరణాల చర్చ ఎటు మళ్లుతోందని అంటూ ఒక ఇంటర్వ్యూలో బీజేపీ సీనియర్ నేత, ఎంపీ ఈటల రాజేందర్ తాజా కామెంట్స్ ఇప్పుడు అధికార, విపక్ష శిబిరాల్లో సరికొత్త ప్రకంపనలు రేపుతున్నాయి.

ఏడు దశాబ్దాల చరిత్ర.. ఒక్క బీసీ సీఎం లేడు

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ తొలి ముఖ్యమంత్రి నీలం సంజీవరెడ్డి పాలన మొదలుకొని నేటి రేవంత్ రెడ్డి ప్రభుత్వం వరకు దాదాపు ఏడు దశాబ్దాల రాజకీయ ప్రస్థానాన్ని పరిశీలిస్తే ఒక చేదు నిజం స్పష్టంగా కనిపిస్తుంది. ఎందరో ఉద్దండులు ముఖ్యమంత్రులుగా మారినా, సంఖ్యాపరంగా అత్యధికంగా ఉన్న బీసీ, ఎస్సీ వర్గాలకు పాలనా పగ్గాలు చేపట్టే అవకాశం దక్కలేదు.

ప్రత్యేక రాష్ట్ర ఆకాంక్ష నెరవేరి దశాబ్దం గడిచినా తెలంగాణ గడ్డపై అదే ఆధిపత్య రాజకీయ సమీకరణాలు పునరావృతమవుతున్నాయన్న భావన ప్రజల్లో ఉంది. ఈ సున్నితమైన అంశాన్ని నేరుగా ఎత్తిచూపడం ద్వారా ఈటల రాజేందర్ తెలంగాణ రాజకీయాల్లో అత్యంత క్లిష్టమైన చర్చకు తెరలేపారు.

గుడిసెల్లో చైతన్యం వెల్లివిరిసింది

ఒకప్పుడు రాజకీయ పార్టీలు ఇచ్చే తాయిలాలు, హామీలను గుడ్డిగా నమ్మే అమాయకత్వం ఇప్పుడు ప్రజల్లో లేదని ఈటల అభిప్రాయడ్డారు. ‘రూడు బసవల’ తరహా రాజకీయాలు ముగిశాయని, ప్రతి పల్లెలో, ప్రతి గుడిసెలో చదువుకున్న ఆడబిడ్డలు, ప్రశ్నించే యువత పెరిగారని ఆయన గుర్తుచేస్తున్నారు.

సామాజిక వర్గాల చైతన్యం అంతర్గతంగా రగులుతోందని, అది ఒక్కసారి ‘ట్రిగ్గర్’ అయితే సాంప్రదాయ రాజకీయ సమీకరణాలన్నీ కొట్టుకుపోవడం ఖాయమని స్పష్టం చేశారు.

కాంగ్రెస్, బీఆర్‌ఎస్ వైఖరిపై సూటి ప్రశ్నలు

దశాబ్ద కాలం పాటు తెలంగాణను పాలించిన బీఆర్‌ఎస్ అయినా, అణగారిన వర్గాల బాసటగా నిలుస్తామని చెప్పుకునే కాంగ్రెస్ అయినా బీసీలకు సీఎం కుర్చీ ఇచ్చే ధైర్యం చేశాయా? అన్నది ఈటల వేస్తున్న ప్రధాన ప్రశ్న. సామాజిక న్యాయం కేవలం ప్రసంగాలకే పరిమితమైందా అన్న విమర్శలను ఆయన బలంగా ముందుకు తెచ్చారు.

ఇదే సమయంలో, హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియం వేదికగా స్వయంగా దేశ ప్రధాని నరేంద్ర మోడీ బహిరంగంగా "బీజేపీని గెలిపిస్తే బీసీని సీఎం చేస్తాం" అని ఇచ్చిన హామీని గుర్తుచేస్తూ బీజేపీని భిన్నమైన ప్రత్యామ్నాయంగా నిలిపే ప్రయత్నం చేశారు.

రేపు ఈటల సీఎం అవుతారా?

"బీజేపీ అధికారంలోకి వస్తే మీరే సీఎం అవుతారా?" అన్న సూటి ప్రశ్నకు ఈటల వ్యూహాత్మక జవాబిచ్చారు. "నేను అవుతానా లేదా అన్నది కాదు.. తెలంగాణకు బీసీ సీఎం కావడం మాత్రం అనివార్యం" అని చెప్పడం ద్వారా వ్యక్తిగత ఆకాంక్ష కంటే వర్గ చైతన్యాన్ని ముందుంచారు.

ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వ పాలనపై ప్రజల్లో పెరుగుతున్న అసంతృప్తిని క్షేత్రస్థాయి పోరాటాలతో ప్రజాక్షేత్రంలోకి తీసుకెళ్లాలని చూస్తున్న బీజేపీకి, ఈ ‘బీసీ సీఎం’ నినాదం అత్యంత బలమైన రాజకీయ అస్త్రంగా మారనుందా అన్నది రానున్న రోజుల్లో తేలనుంది.

#Etela Rajender#Etela Rajender Interview#Etela Rajender Latest News#Telangana Politics#swechaa news
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి