International

America: ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇక ఉండదా?.. ట్రంప్ కొత్త నేమ్ గేమ్!..

రచన: Venu4 నిమిషాల పఠనం

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన ఓ ప్రకటన ఇప్పుడు టెక్ ప్రపంచంలో ఆసక్తికర చర్చకు దారితీసింది. ఏఐకి ఉన్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనే పేరు అంత ఆకర్షణీయంగా లేదని భావించిన ట్రంప్.. దానికి కొత్త పేరు పెట్టేందుకు తన సోషల్ మీడియా వేదిక ట్రూత్ సోషల్‌లో ఓ పోల్ నిర్వహించారు.

ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వేగం ఊహించని స్థాయికి చేరుతోంది. మనిషి చేసే పనులను అర్థం చేసుకోవడం నుంచి కోడింగ్, పరిశోధన, కంటెంట్ సృష్టి, సైబర్‌ సెక్యూరిటీ వరకు ఏఐ పరిధి విస్తరిస్తోంది. అదే సమయంలో ఈ టెక్నాలజీ ఎంత వేగంగా అభివృద్ధి చెందాలి? దానికి ఎలాంటి భద్రతా నియంత్రణలు ఉండాలి? అనే చర్చ కూడా అంతే తీవ్రంగా సాగుతోంది.

ఇలాంటి సమయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన ఓ ప్రకటన ఇప్పుడు టెక్ ప్రపంచంలో ఆసక్తికర చర్చకు దారితీసింది. ఏఐకి ఉన్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనే పేరు అంత ఆకర్షణీయంగా లేదని భావించిన ట్రంప్.. దానికి కొత్త పేరు పెట్టేందుకు తన సోషల్ మీడియా వేదిక ట్రూత్ సోషల్‌లో ఓ పోల్ నిర్వహించారు. ఈ క్రమంలో ట్రంప్ సూచించిన మూడు పేర్లలో సుపీరియర్ ఇంటెలిజెన్స్, ఎక్స్‌ట్రీమ్ ఇంటెలిజెన్స్, సుప్రీమ్ ఇంటెలిజెన్స్ ఉన్నాయి.

ఈ మూడింటిలో ఏ పేరు బాగుంటుందో తన ఫాలోవర్లు ఓటు వేయాలని ఆయన కోరారు. పోల్ ప్రారంభమైన కొద్ది గంటల్లోనే వేలాది మంది స్పందించారు. అందుబాటులో ఉన్న నివేదికల ప్రకారం, ప్రారంభ దశలో సుపీరియర్ ఇంటెలిజెన్స్ పేరుకు గణనీయమైన మద్దతు లభించింది. అయితే ట్రంప్ ప్రతిపాదన కేవలం పేరు మార్పు వరకే పరిమితం కాలేదు. ఏఐ అభివృద్ధిని అడ్డుకునే చర్యలకు తన ప్రభుత్వం మద్దతు ఇవ్వదని ఆయన స్పష్టం చేస్తూ.. అమెరికా ఈ రంగంలో ప్రపంచ నాయకత్వాన్ని కొనసాగించాల్సిన అవసరం ఉందని చెబుతున్నారు.

అదే సమయంలో ఏఐ రంగాన్ని పర్యవేక్షించేందుకు కొత్త ఏఐ జార్‌ను నియమించనున్నట్లు, అలాగే ఏఐ ఫోర్స్ ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు. మరోవైపు ఏఐ అభివృద్ధి వేగంపై టెక్ పరిశ్రమలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఆంత్రోపిక్ సీఈఓ డారియో అమోడెయ్.. ఏఐ మోడళ్ల సామర్థ్యాల అభివృద్ధిని కొంత నియంత్రిత వేగంతో కొనసాగించాలని, భద్రతా వ్యవస్థలను మరింత బలోపేతం చేయాలని సూచించారు. ఆయన ప్రతిపాదనకు ఓపెన్‌ఏఐ సీఈఓ సామ్ ఆల్ట్‌మన్ సహా పలువురు టెక్ రంగ ప్రముఖులు మద్దతు తెలిపారు.

ఇలా ఒకవైపు ఏఐని మరింత వేగంగా అభివృద్ధి చేయాలన్న ఆలోచన.. మరోవైపు దాని ప్రమాదాలను అంచనా వేసి భద్రతా నియంత్రణలు పెంచాలన్న డిమాండ్.. రెండూ ప్రపంచవ్యాప్తంగా సమాంతరంగా సాగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఏఐకి పేరు మార్చాలన్న ట్రంప్ ప్రతిపాదన కంటే.. భవిష్యత్తులో ఈ టెక్నాలజీకి అమెరికా ఎలాంటి దిశానిర్దేశం చేస్తుందన్నదే ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది.

#technology#America#trump#Artificial Intelligence#public-vote#three-names#rename
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి