తెలంగాణ

Congress : దళితుల భూమిని తీసుకోం.. విషప్రచారాన్ని నమ్మొద్దు : మంత్రి పొంగులేటి

రచన: Kumar7 నిమిషాల పఠనం

దళితులు, గిరిజనుల భూములను లాక్కోవడం ప్రజాప్రభుత్వ విధానం కాదని, వారి అంగుళం భూమిని కూడా తీసుకోబోమని రెవెన్యూ, హౌసింగ్, సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి స్పష్టంచేశారు.సీఎం రేవంత్ నాయకత్వంలోని ప్రజా ప్రభుత్వం దళితుల భూములకు సంపూర్ణ రక్షణగా నిలుస్తుందని, ఈ విషయంలో ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు.

దళితులు, గిరిజనుల భూములను లాక్కోవడం ప్రజాప్రభుత్వ విధానం కాదని, వారి అంగుళం భూమిని కూడా తీసుకోబోమని రెవెన్యూ, హౌసింగ్, సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి స్పష్టంచేశారు.సీఎం రేవంత్ నాయకత్వంలోని ప్రజా ప్రభుత్వం దళితుల భూములకు సంపూర్ణ రక్షణగా నిలుస్తుందని, ఈ విషయంలో ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. ఆదివారం విడుదల చేసిన ఒక ప్రకటనలో మంత్రి భరోసా ఇచ్చారు.

రాష్ట్రంలో రెండున్నరేండ్ల క్రితం దళితులు, గిరిజనులు, బడుగు బలహీన వర్గాల ప్రజల ఆశీస్సులతో రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందని పేర్కొన్నారు.సామాజిక న్యాయం, పేదల సంక్షేమం, అణగారిన వర్గాల అభ్యున్నతి కాంగ్రెస్ పాలనలో ఎప్పుడూ ప్రధాన ప్రాధాన్యతలుగా ఉన్నాయన్నారు. దేశంలో, రాష్టంలో పేదలు, దళితులు, బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం చారిత్రాత్మక నిర్ణయాలు తీసుకున్నది కాంగ్రెస్ ప్రభుత్వాలేనని గుర్తుచేశారు.

25 లక్షల ఎకరాల భూములు..

భూ సంస్కరణలు, భూ పంపిణీ వంటి కార్యక్రమాల ద్వారా భూమిలేని దళితులకు భూములు ఇచ్చి ఆ భూమిపై హక్కు కల్పించిన చరిత్ర కాంగ్రెస్ ప్రభుత్వాలకు ఉందన్నారు. రాష్ట్రంలో ఇందిరమ్మ ప్రభుత్వ హయాంలో దళితులకు సుమారు 25 లక్షల ఎకరాల భూముల పంపిణీ,అలాగే పోడు భూముల విషయంలో గిరిజనులకు సుమారు 2 లక్షల ఎకరాలపై హక్కులు కల్పించిన ఘనత కూడా కాంగ్రెస్‌దేనని తెలిపారు. భూమిలేని వారికి భూమి, హక్కులు లేని వారికి హక్కులు కల్పించడమే కాంగ్రెస్ విధానం అని స్పష్టంచేశారు. దళిత, గిరిజనుల భూ హక్కులను కాపాడుతూ ప్రజా ప్రభుత్వం ముందుకు సాగుతుందని మంత్రి పొంగులేటి భరోసా ఇచ్చారు.

అధికారంలోకి వస్తే దళితులకు మూడు ఎకరాల భూమి ఇస్తామని బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్ హామీ ఇచ్చి, అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ హామీని విస్మరించిన దొరవారి మాటలు నమ్మకూడదని విజ్ఞప్తి చేశారు.మంత్రిగా, సీఎం రేవంత్ రెడ్డి తరఫున దళిత కుటుంబాలకు తాను స్పష్టమైన హామీ ఇస్తున్నానని “మీ అంగుళం భూమి కూడా ప్రభుత్వం లాక్కోదు. మీ భూమిని తీసుకునే ఆలోచన కూడా ఈ ప్రభుత్వానికి లేదు. మీ భూముల విషయంలో మీరు ఎలాంటి భయాందోళనలకు గురికావాల్సిన అవసరం లేదు. ప్రజా ప్రభుత్వం మీకు అండగా ఉంటుంది” అని ఆయన అన్నారు.

భూములకు సంబంధించిన రికార్డుల పరిశీలన, సర్వేలు, భూ సమస్యల పరిష్కారం వంటి ప్రక్రియలను ప్రజల భూములను లాక్కోవడానికి చేస్తున్న చర్యలుగా చూడటం సరికాదన్నారు. భూములపై ప్రజలకు ఉన్న హక్కులను స్పష్టంగా నమోదు చేయడం, భూ వివాదాలను పరిష్కరించడం, భూ హక్కులకు రక్షణ కల్పించడమే ప్రభుత్వ ఉద్దేశమన్నారు.

విషప్రచారం నమ్మొద్దు..

దళితుల భూముల విషయంలో కొంతమంది దొరలు కావాలనే భయాందోళనలు సృష్టిస్తూ విషప్రచారం చేస్తున్నారని, తమ స్వార్థ ప్రయోజనాల కోసం దళితులను రెచ్చగొట్టే ప్రయత్నాలు చేస్తున్నారన్నారు. అలాంటి ప్రచారాల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు.“ఎవరో ఏదో చెప్పారని భయపడాల్సిన అవసరం లేదు. మీ భూముల విషయంలో ప్రభుత్వం స్పష్టమైన భరోసా ఇస్తోంది. వాస్తవాలను తెలుసుకోకుండా ఎలాంటి విషప్రచారాన్ని నమ్మవద్దు” అని మంత్రి పేర్కొన్నారు.

దళితులను రెచ్చగొట్టి వారి భూముల పేరుతో రాజకీయ లబ్ధి పొందాలని చూసే ప్రయత్నాలను అర్థం చేసుకోవాలన్నారు.ప్రభుత్వం తీసుకునే ప్రతి చర్య చట్టబద్ధంగా, పారదర్శకంగా ఉంటుందన్నారు.దశాబ్దాలుగా భూములపై హక్కులు లేక ప్రభుత్వ ప్రయోజనాలకు దూరమైన దళిత, గిరిజనులకు ప్రజా ప్రభుత్వం అండగా నిలుస్తోందని తెలిపారు. రీ-సర్వే ద్వారా భూముల వాస్తవ పరిస్థితులను గుర్తించి దళితులకు, గిరిజనులకు హక్కులు కల్పిస్తున్నామని చెప్పారు.

సూర్యాపేట జిల్లా నూతనకల్, మద్దిరాల ప్రాంతంలోని 15 రెవెన్యూ గ్రామాల్లో, మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలం నారాయణపురం గ్రామంలో దశాబ్దాల భూ సమస్యలకు పరిష్కారం చూపించామని తెలిపారు. భూమిపై హక్కులు కల్పించడం ద్వారా వారికి ప్రభుత్వ పథకాలు, ఇతర ప్రయోజనాలు అందేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. దళిత, గిరిజనులకు వారి భూములపై హక్కులను కల్పించి మరింత పటిష్టం చేయడమే ప్రజాప్రభుత్వం లక్ష్యమన్నారు. ‘దళిత కుటుంబాలు ఎలాంటి ఆందోళనకు గురికావాల్సిన అవసరం లేదని, ముఖ్యమంత్రి నాయకత్వంలోని ప్రభుత్వం మీకు అండగా ఉంటుంది’ అని మంత్రి వెల్లడించారు.

#minister ponguleti srinivasareddy#congress#dalith farmers#swechaanews
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి