రాష్ట్రంలో ప్రజాప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలు, అన్నదాతలకు సాగు నీళ్లు ఇవ్వకుండా ఇబ్బందులకు గురిచేస్తున్న తీరుపై బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదివారం తెలంగాణ భవన్ వేదికగా ఆయన మీడియాతో మాట్లాడారు. రేవంత్ రెడ్డి పాలనపై ఈ సందర్భంగా తీవ్ర విమర్శలు గుప్పించారు. ముఖ్యమంత్రికి పాలన చేతకాదని ప్రజలకు అర్థమైందని, అందుకే ఆగ్రహించిన అన్నదాతలు జూరాల ప్రాజెక్టు తాళాలు పగులగొట్టి వెళ్లి మరీ ఆయకట్టుకు నీళ్లు వదులుకున్నారని చెప్పారు.
ఆయకట్టుకు నీళ్లు అందించాలని, రైతుల సమస్యలు, ఇబ్బందులను కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోకపోవడం వల్లే రైతులు తాళాలు పగులగొట్టి సాగు కోసం ప్రాజెక్టు గేట్లు ఎత్తి నీళ్లు వదులుకున్నారని పేర్కొన్నారు. దీనిని బట్టి రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం పనితీరు ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చని తెలిపారు.కాంగ్రెస్ పార్టీ ఎంపీ మల్లు రవి నియోజకవర్గంలో ఇలా జరిగితే ఆయన ఏం చేస్తున్నారని, ప్రజా సమస్యలు పట్టవా? అని ఆర్ ప్రవీణ్ కుమార్ మండిపడ్డారు.
ఇందుకోసమేనా మల్లు రవి ఎంపీ అయింది? అని నిలదీశారు. ప్రజా సమస్యలు గాలికి వదిలేసి ఎంపీ మల్లు రవి సిగ్గు లేకుండా మాజీ మంత్రి , బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీష్ రావు ఇంటికొచ్చి నిల్చున్నాడని ఎద్దేవాచేశారు. కాంగ్రెస్ ఎంపీలు తెలంగాణ ప్రజల ఆస్తుల మీద దాడి చేయడానికి వెళ్తుంటే ఈ పోలీసులు ఎందుకు హౌస్ అరెస్ట్ చేయలేదు? అని అడిగారు.ముందు దీనికి డీజీపీ సీవీ ఆనంద్ సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. నిరసనలకు వెళ్తుంటే బీఆర్ఎస్ నేతలను ముందస్తుగా హౌస్ అరెస్టు చేస్తారని, మరి కాంగ్రెస్ నేతలను చేయకుండా, వారికి సెక్యూరిటీ ఇచ్చి మరీ ప్రజల ఆస్తుల మీదకు పంపించడం ఏంటని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మండిపడ్డారు.
కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోకపోవడం వల్లే జూరాల ప్రాజెక్టు మీదకు ఎక్కి రైతులు నీళ్లును వదులుకున్నారని గుర్తుచేశారు. ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం తమ వైఫల్యాలను అంగీకరించాలని పేర్కొన్నారు. ప్రాజెక్టు వద్దకు పోలీసు బలగాలతో కాపాలా పెట్టి రైతులను బెదిరింపులకు గురిచేయడం సరికాదని హెచ్చరించారు. రేవంత్ సర్కారులో అన్నదాతలు అరిగోస పడుతున్నారని, నీళ్లు ఇవ్వలేని ప్రభుత్వం మీద రైతులు ఆగ్రహంతో ఉన్నారని, వచ్చే ఎన్నికల్లో తగిన బుద్ధి చెబుతారని ఫైర్ అయ్యారు.












