తెలంగాణ

Telangana BJP: ఎవరి దారి వారిదే.. అసెంబ్లీ సాక్షిగా బీజేఎల్ పీలో ఏం జరిగింది?

రచన: Mahesh5 నిమిషాల పఠనం

Telangana BJP: తెలంగాణ అసెంబ్లీ వేదికగా ప్రధాన ప్రతిపక్ష పాత్రను సమర్థవంతంగా పోషించేందుకు వచ్చిన గోల్డెన్ ఛాన్స్‌ను బీజేపీ శాసనసభ్యులు చేజేతులా జారవిడుచుకున్నారన్న చర్చ ఇప్పుడు రాజకీయ వర్గాల్లో కలకలం రేపుతోంది.

Telangana BJP: తెలంగాణ అసెంబ్లీ వేదికగా ప్రధాన ప్రతిపక్ష పాత్రను సమర్థవంతంగా పోషించేందుకు వచ్చిన గోల్డెన్ ఛాన్స్‌ను బీజేపీ శాసనసభ్యులు చేజేతులా జారవిడుచుకున్నారన్న చర్చ ఇప్పుడు రాజకీయ వర్గాల్లో కలకలం రేపుతోంది. సమావేశాల ఆరంభంలోనే బీఆర్‌ఎస్ సభ్యులు సస్పెండ్ కావడంతో, ప్రభుత్వ వైఫల్యాలను నిలదీసి ప్రజల్లో బలమైన ముద్ర వేసే అద్భుతమైన అవకాశం కాషాయ దళానికి దక్కింది.

అయితే ఆ అవకాశాన్ని ప్రజా సమస్యల పరిష్కారానికి వాడాల్సింది పోయి, అంతర్గత కుమ్ములాటలు, వ్యక్తిగత ఇగోలకే పరిమితం చేశారన్న విమర్శలు ఇప్పుడు సొంత గూటి నుంచే వెల్లువెత్తుతున్నాయి.

బీజేఎల్‌పీలో హైడ్రామా..

ఈ సెషన్‌లో అత్యంత సంచలనంగా మారిన అంశం శాసనసభా ప్రాంగణంలోని బీజేఎల్‌పీ కార్యాలయంలో జరిగిన తీవ్ర వాగ్వాదం. స్వల్పకాలిక చర్చల్లో పార్టీ తరఫున మాట్లాడే అవకాశం ఎవరికి దక్కాలనే దానిపై సభ్యులు పరస్పరం కేకలు వేసుకునే స్థాయికి వివాదం వెళ్లిందని సమాచారం.

ప్రత్యేకించి శాంతిభద్రతల అంశంపై తనకు మాట్లాడే అవకాశం ఎందుకు ఇవ్వరంటూ ఓ బీజేపీ ఎమ్మెల్యే అగ్గిమీద గుగ్గిలమైనట్లు తెలిసింది. అసెంబ్లీ కారిడార్‌లోనే తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ, నేరుగా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడికే ఫోన్ చేసి ఏకంగా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానంటూ హెచ్చరికలు జారీ చేసినట్లు టాక్.

చివరికి ఆయనను బుజ్జగించేందుకు స్పీకర్‌ను కోరి మరీ మాట్లాడే వెసులుబాటు కల్పించాల్సి వచ్చిందంటే అసమ్మతి ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చనే కామెంట్స్ విపిస్తున్నాయి.

ఎవరి దారి వారిదే..

వాయిదా తీర్మానం ఏ అంశంపై ప్రవేశపెట్టాలి, ఎవరి పేరుతో ఇవ్వాలనే ప్రాథమిక విషయాల్లో కూడా సభ్యుల మధ్య ఏకాభిప్రాయం లోపించిందట. మైక్ దొరికితే చాలు అన్నట్లుగా ఎవరికి వారు సొంత ఎజెండాతో మాట్లాడటంతో, ఒకే పార్టీ సభ్యుల వాదనల మధ్య కనీస పొంతన లేకుండా పోయిందని అంటున్నారు.

కాంగ్రెస్ నేతలు "బీజేపీ-బీఆర్‌ఎస్ ఒకటే, గులాబీ పార్టీ వాళ్లు రాసిచ్చిన స్క్రిప్ట్‌నే వీరు చదువుతున్నారు" అంటూ తీవ్రస్థాయిలో వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నా, కమలం పార్టీ ఎమ్మెల్యేలు కలిసికట్టుగా కౌంటర్ ఇవ్వలేకపోయారనే కామెంట్స్ జోరుగా వినిపిస్తున్నాయి.

సమిష్టి వ్యూహం కొరవడటం, పార్టీ ప్రయోజనాల కంటే సొంత రాజకీయ ఇమేజ్ కోసం పాకులాడటం వల్లే అసెంబ్లీ వేదికగా కాషాయ దళం పూర్తిగా ఆత్మరక్షణలో పడిందన్న అసహనం ఇప్పుడు రాష్ట్ర పార్టీ అధిష్ఠానంలోనూ వ్యక్తమవుతోంది.

చేతికి వచ్చిన బంగారం లాంటి అవకాశాన్ని అంతర్గత విభేదాలతో వృథా చేసుకోవడం భవిష్యత్ రాజకీయాలపై తీవ్ర ప్రభావం చూపే ప్రమాదం ఉందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

#Telangana BJP#BJP#Telangana Politics#TG Politics#BJLP#BJP Legislature Party#BJP MLAs#swechaa news
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి