రాష్ట్రంలో వర్షాలు లేక రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతుంటే కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని మాజీ మంత్రి హరీశ్ రావు మరోసారి ఫైర్ అయ్యారు. వర్భాభావ పరిస్థితుల కారణంగా నీళ్లు లేక పంటలు ఎండిపోతున్నాయని, పెట్టిన పెట్టుబడి కూడా వచ్చే పరిస్థితులు లేవని, ఇప్పటికైనా కాంగ్రెస్ సర్కార్ మొద్దునిద్ర వీడాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆదివారం ఉదయం సోషల్ మీడియా ‘ఎక్స్’ వేదికగా ఆసక్తికర పోస్టు పెట్టారు.
‘నీళ్లు ఉన్నా మోటార్లు ఆన్ చేసి నీళ్లు ఎత్తలేని దద్దమ్మ ప్రభుత్వం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం!. ఇది కాలం తెచ్చిన కరువు కాదు.. కాంగ్రెస్ పాలన తెచ్చిన కరువు!’ అని ఆగ్రహం వ్యక్తంచేశారు. కాళేశ్వరం వద్ద నీరు వృథాగా పోతున్నా పంపుహౌసుల ద్వారా ఎత్తిపోసి అన్నదాతలకు నీళ్లు ఇవ్వడం లేదని, రేవంత్ సర్కార్ కావాలనే రైతుల మీద పగ తీర్చుకుంటుందని ఆరోపించారు.

ఇదిలాఉండగా, కాంగ్రెస్ ప్రభుత్వం తమను పట్టించుకోవడం లేదని ఆగ్రహించిన రైతులు ఇటీవల స్వయంగా జూరాల ప్రాజెక్టుపైకి ఎక్కి సాగు నీళ్లు వదులుకున్న విషయం తెలిసిందే. వనపర్తి జిల్లా జూరాల ప్రాజెక్టు కుడి, ఎడమ కాలువలకు నీటిని నిలిపివేయడంతో ఆయకట్టు రైతులు ఆగ్రహం వ్యక్తంచేశారు. జూరాల ప్రాజెక్టు నుంచి సాగునీటిని విడుదల చేయాలని కోరుతూ ఉదయం నుంచి సాయంత్రం 7 గంటల వరకు ధర్నా చేసినా అధికారుల నుంచి స్పందన లేదు. దీంతో ఆగ్రహించిన అన్నదాతలు.. జూరాల ప్రాజెక్టు ఎడమ కాలువ రెగ్యులేటర్‌పైకి ఎక్కి స్వయంగా నీటిని విడుదల చేసుకున్న విషయం తెలిసిందే.
ఈ క్రమంలోనే తాజాగా జూరాల ప్రాజెక్టు గేట్లను అధికారులు బంద్ చేశారు. వనపర్తి జిల్లాలో పంటలు ఎండిపోతున్నా ప్రభుత్వం స్పందించకపోవడంతో నిన్న రైతులు గేట్లను ఎత్తగా.. అర్ధరాత్రి గేట్లు బంద్ చేసి, రైతులు రాకుండా ప్రాజెక్టు చుట్టూ అధికారలు పోలీస్ బందోబస్త్ ఏర్పాటు చేశారు.దీనికి సంబంధించిన విజువల్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. సాగు నీళ్లు ఇవ్వాలని డిమాండ్ చేసిన రైతులను పోలీసులతో బెదిరిస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం నిరంకుశ పాలన సాగిస్తోందని ప్రతిపక్ష బీఆర్ఎస్ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు.












