దేశవ్యాప్తంగా వినాయకచవితి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. అయితే, చవితి వేడుకల్లో భాగంగా అక్కడక్కడ అనుకోని ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి.నిమజ్జన వేడుకలకు హాజరై నీటమునిగి, విద్యుత్ షాక్‌తో పలువురు మరణించడం, యాక్సిడెంట్ వంటివి చోటుచేసుకోవడం ఇలా అనేకం వెలుగుచూస్తున్నాయి. తాజాగా దేశఆర్థిక రాజధాని ముంబైలోని లాల్‌బాగ్ గణపతి కొలువుదీరిన ప్రదేశంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ప్రమాదవశాత్తు ఆరుగురు విద్యుత్ షాక్‌కు గురైనట్టు తెలుస్తోంది.
ఆదివారం తెల్లవారుజామున ఓ గణేష్ మండపం సమీపంలో కరెంట్ షాక్‌తో ఇద్దరు మృతి చెందగా, మరో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. మృతుల్లో ఓ చిన్నారి, మహిళ ఉన్నట్టు సమాచారం.ముంబైలోని కాలచౌకి ప్రాంతంలో జరిగిన విద్యుత్ ప్రమాదం కారణంగా ఉత్సవ ప్రాంగణంలో విషాద ఛాయలు అలముకున్నాయి. వివరాల్లోకివెళితే.. ఇవాళ తెల్లవారుజామున సుమారు 2 గంటల సమయంలో భక్తులు గణేష్ మండపం సమీపంలో ఉండగా విద్యుత్ తీగలు మీద పడినట్టు సమాచారం.
ఈ ప్రమాదంలో ఓ చిన్నారి,మహిళ సహా మరో నలుగురు తీవ్రంగా గాయపడగా..చికిత్స నిమిత్తం భైకల్లాలోని మసీనా ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనలో 8 ఏండ్ల రాఘణి ఘన్‌శ్యామ్ యాదవ్ అనే చిన్నారి ఆసుపత్రికి చేరుకునేలోపే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. పరేల్‌లోని గ్లోబల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మహిళ పరిస్థితి సైతం విషమించడంతో మరణించింది. ఆమె వివరాలు తెలియాల్సి ఉంది.
గాయపడిన నలుగురిలో కిరణ్ అక్బర్ నాయక్ (19), తన్వి నర్ష్ హాండే (19), సాహిల్ సందీప్ తారే (19), రూహి సింగ్ (12) చికిత్స పొందుతున్నారు. వీరిలో రూహి పరిస్థితి అత్యంత విషమంగా ఉండటంతో గ్లోబల్ ఆసుపత్రికి తరలించినట్టు తెలిసింది. మిగిలిన ముగ్గురికి మసీనా ఆసుపత్రిలోని ఐసీయూలో వైద్యులు ట్రీట్మెంట్ చేస్తున్నారు.సమాచారం అందుకున్న పోలీసులు కేసు ఫైల్ చేసి విచారణ జరుపుతున్నారు. ప్రమాదం ఎలా చోటుచేసుకుందనే దానిపై దర్యాప్తు చేస్తున్నట్టు తెలిసింది.









