Tollywood: మన సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోలతో సినిమాలు చేయడం ఒక సవాల్. ఎందుకంటే..టాలీవుడ్, కోలీవుడ్ ఎక్కువగా ఫ్యాన్ బేస్డ్ ఇండస్ట్రీస్. అందుకే, స్టార్స్ ఇమేజ్‌కు తగ్గ కథ రాయాలి, అభిమానులను మెప్పించే మాస్ ఎలివేషన్స్ ఉండాలి. అలాగే, సాధారణ ప్రేక్షకుడిని కూడా థియేటర్‌కు రప్పించే కథా బలం ఉండాలి. ఈ విషయాలలో తనకంటూ ఒక ప్రత్యేకమైన శైలిని ఏర్పరుచుకున్న దర్శకుడు బాబీ (కె.ఎస్. రవీంద్ర).
2014లో రవితేజ హీరోగా వచ్చిన పవర్ సినిమాతో దర్శకుడిగా పరిచయమైన బాబీ, ఆ తర్వాత పవన్ కల్యాణ్, ఎన్టీఆర్, వెంకటేష్–నాగచైతన్య, చిరంజీవి–రవితేజ, బాలకృష్ణ వంటి అగ్ర హీరోల డైరెక్ట్ చేశాడు. మాస్ ఇమేజ్ ఉన్న హీరోలకి తగ్గ కథలతో బాబీ హిట్స్ తో పాటు ఫ్లాప్స్ కూడా చూశాడు.
బాబీ దర్శకుడిగా చేసిన తొలి సినిమా పవర్. రవితేజ హీరోగా రూపొందిన ఈ యాక్షన్ ఎంటర్‌టైనర్ ఆయనకు దర్శకుడిగా మంచి గుర్తింపును తెచ్చింది. అప్పటికే రచయితగా పనిచేసిన అనుభవం ఉండటంతో కథను కమర్షియల్ ఎలిమెంట్స్‌తో ఎలా నడిపించాలో బాబీకి బాగా తెలుసు. అలా, పవర్ తీసి ఈ సినిమా విజయం తర్వాత భారీ ప్రాజెక్ట్ కి ఛాన్స్ అందుకున్నాడు. తన రెండో సినిమాకే పవన్ కల్యాణ్‌తో సర్ధార్ గబ్బర్‌సింగ్ చేసే అవకాశం వచ్చింది.
అయితే, గబ్బర్ సింగ్ లాంటి భారీ హిట్ తర్వాత అంతే భారీ అంచనాల మధ్య వచ్చిన సర్ధార్ గబ్బర్ సింగ్ తో బాబికి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఈ సినిమాలో అతి ఎక్కువైందనే విమర్శలు కూడా వినిపించాయి. పవన్ కల్యాణ్ హీరోగా రూపొందిన ఈ సినిమాలో పోలీస్ గా అలరించాడు. కానీ, బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా ఊహించని ఫలితాన్ని చూసింది.
భారీ స్థాయిలో ఇమేజ్ ఉన్న హీరోలను అంతే స్థాయిలో కథ రాసి హిట్ ఇవ్వడం ఎంత కష్టమో సర్ధార్ గబ్బర్ సింగ్ సినిమాతో బాబీకి తెలిసొచ్చింది. ఆ తర్వాత ఊహించని అవకాశం వచ్చింది. ఆ సినిమానే ఎన్టీఆర్‌తో చేసిన జై లవ కుశ. బాబి కెరీర్‌లో ఈ సినిమా మంచి టర్నింగ్ పాయింట్ అని చెప్పాలి. ఎన్టీఆర్ కి మూడు విభిన్నమైన పాత్రలను రాసి సిల్వర్ స్క్రీన్ మీద అద్భుతంగా ఆవిష్కరించి బ్లాక్ బస్టర్ కొట్టాడు.
‘వెంకీ మామా’:
2019లో బాబీ దర్శకత్వంలో వచ్చిన వెంకీ మామా పూర్తిగా ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా వచ్చింది. వెంకటేష్–నాగచైతన్య కాంబినేషన్ సినిమాకి ప్రధాన ఆకర్షణగా నిలిచింది. ఈ సినిమా కథలో కుటుంబ అనుబంధం, కామెడీ, యాక్షన్, ఎమోషన్ వంటి అంశాలను కలిపి తీసిన వెంకీ మామా భారీ కమర్షియల్ హిట్ అని చెప్పలేము కానీ, నిర్మాతలకి మాత్రం నష్టాలు రాలేదు.
మెగాస్టార్-మాస్ మహరాజ్‌లతో మల్టీస్టారర్:
బాబి దర్శకత్వంలో వచ్చిన వాల్తేరు వీరయ్య టాలీవుడ్ మల్టీస్టారర్స్‌లో ఒకటి. ఈ సినిమా మంచి కమర్షియల్ సక్సెస్‌ను సాధించింది. చాలా ఏళ్ళ తర్వాత అభిమానులు చిరంజీవిని ఎలా చూడాలనుకున్నారో అలా చూపించి హిట్ కొట్టాడు. రవితేజ పాత్ర కూడా అద్భుతంగా రాశాడు బాబీ. అసలు, రవితేజ ఈ సినిమాను ఒప్పుకుంటాడా లేదా అనే సందేహాలు కూడా కలిగినప్పటికీ కాంబో సెట్ చేసి హిట్ ఇచ్చాడు.
డాకూ మహారాజ్‌తో బాలయ్యకి బ్లాక్ బస్టర్:
బాబీ మాస్ కథలకి బాలయ్య లాంటి హీరో అయితే బాక్సాఫీస్ వద్ద హిట్ గ్యారెంటీ అని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అది, డాకూ మహారాజ్ మూవీతో ప్రూవ్ అయింది. బాలయ్య ఇమేజ్‌ను దృష్టిలో పెట్టుకొని బాబీ రాసుకున్న కథ నందమూరి అభిమానులకే కాదు సినీ లవర్స్‌కి కుడా బాగా నచ్చింది. బాక్సాఫీస్ వద్ద మంచి కమర్షియల్ హిట్‌గా నిలిచింది.
మెగాస్టార్‌తో కాకా:
బాబి మరోసారి మెగాస్టార్‌ను డైరెక్ట్ చేస్తున్న సంగతి తెలిసిందే. కాకా అనే పవర్ ఫుల్ టైటిల్‌తో ఈ సినిమా తెరకెక్కుతోంది. అనస్వర రాజన్ కూతురు పాత్రలో..గెటప్ శీను, సునీల్ ఇతర కీలక పాత్రల్లో కనిపించబోతున్నారు. ఇప్పటికే, కాకా సినిమా నుంచి వచ్చిన టీజర్ భారీ అంచనాలను పెంచేసింది. ప్రస్తుతం, తీవ్ర నష్టాలలో ఉన్న నిర్మాణ సంస్థ కెవిఎన్ ప్రొడక్షన్స్‌ని ఆ ఊబి నుంచి బయట పడేసేది బాబి-చిరుల కాకా అని నమ్మకంగా ఉన్నారు. మరి, ఈ సినిమా ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.











