పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు కొనసాగుతూనే ఉన్నాయి. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయాలు, వరుస దాడుల నేపథ్యంలో ఇరాన్ సైతం దూకుడుగా వ్యవహరిస్తోంది. ఈ రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు తగ్గకపోవడంతో మిడిల్ ఈస్టులోని గల్ఫ్ కంట్రీస్ తీవ్ర ఇబ్బందులు పడుతున్నాయి. అమెరికా ఇరాన్‌ను లక్ష్యంగా చేసుకుని దాడులకు పాల్పడుతుంటే.. ఇరాన్ దాని మద్దతు దారులైన హౌతీ తీవ్రదారులు యూఎస్ మిత్రదేశాలపైన సౌదీ అరేబియా మీద విరుచుకుపడుతోంది.
తాజాగా ముందస్తు హెచ్చరికలు జారీ చేసి మరీ హౌతీ రెబల్స్ సౌదీ అరేబియాలోని ఓ విమానాశ్రయం మీద భారీగా దాడులు చేసినట్టు సమాచారం. హౌతీల దాడులకు రియాద్ విమానాశ్రయం సమీపంలో భారీ పేలుడు సంభవించింది.సౌదీ అరేబియా రాజధాని రియాద్‌లో వైమానిక దాడి హెచ్చరికల తర్వాత కింగ్ ఖాలిద్ అంతర్జాతీయ విమానాశ్రయం సమీపంలోని ఇంధన డిపోలో భారీగా మంటలు చెలరేగాయి. మంటలు భారీగా ఎగసిపడటంతో అధికారులు అప్రమత్తం అయ్యారు.
కిలో మీటర్ దూరం నుంచి చూసినా దాడి తీవ్రత స్పష్టంగా కనిపించేలా దట్టమైన పొగ కమ్ముకున్నట్టు తెలుస్తోంది. భారీగా పేలుడు శబ్దాలు వినిపించడంతో భద్రతా అధికారులు అప్రమత్తమయ్యారు. ఫైర్ సిబ్బంది వెంటనే రంగంలోకి దిగి మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నించింది. ఈ దాడులకు పాల్పడింది తామే అని యెమెన్‌కు చెందిన ఇరాన్ మద్దతుదారులైన హౌతీ రెబల్స్ ప్రకటించారు.
బాలిస్టిక్ క్షిపణులు, డ్రోన్లతో దాడులు చేసినట్టు తెలుస్తోంది. హౌతీల దాడుల్లో భారీ ఆస్తినష్టం వాటిల్లినట్టు సమాచారం. ప్రాణనష్టం జరిగిందా? అనే విషయంపై అధికారులు సమాచారం ఇవ్వలేదు.ఎయిర్ పోర్ట్ సమీపంలో దాడుల కారణంగా విమానాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. దీంతో విమానాశ్రయంలో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నట్టు సమాచారం. తమ డిమాండ్లకు తలొగ్గకపోతే మరిన్ని దాడులు తీవ్రం చేస్తామని, హోర్ముజ్ జలసంధిని సొంతం చేసుకుంటామని ట్రంప్ హెచ్చరికల నేపథ్యంలో ఇరాన్.. హౌతీల సాయంతో దాడులకు పాల్పడుతున్నట్టు తెలుస్తోంది.










