ఏపీలో తీవ్ర విషాదం నెలకొంది. వినాయకచవితి ఉత్సవాల్లో డీజేలు పెట్టి సౌండ్స్ మోత మోగించడం కొందరికి అలవాటుగా మారింది.చిన్నా పెద్దా అంతా డీజే పాటలకు డ్యాన్స్ వేస్తూ సంబురాల్లో మునిగితేలుతున్నారు. ఈ క్రమంలోనే ఓ వ్యక్తి సైతం తనకు ఇష్టమైన నటుడు మెగాస్టార్ చిరంజీవి పాటకు హుషారుగా స్టెప్పులు వేశాడు.ఆయన వేస్తున్న స్టెప్పులకు అక్కడున్న వారు సైతం వారెవ్వా.. అని ప్రశంసలు కురిపించారు.ఇంతలో ఏమైందో తెలియదు.. అప్పటివరకు వీరలెవల్లో డ్యాన్సులు వేసిన అతను ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు.
వెంటనే అతన్ని ఆస్పత్రికి తరలించగా.. మార్గమధ్యలోనే మరణించినట్టు వైద్యులు తెలిపారు. వివరాల్లోకివెళితే.. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో వినాయక నిమజ్జనం వేడుకల్లో డీజే సాంగ్స్‌కు కాకర్లమూడి ఏసు (48)ఎంతో ఉత్సాహంగా స్టెప్పులు వేశారు. ఆయనతో పాటు ఆయన కుటుంబసభ్యులు, మరికొంత కూడా డ్యాన్సులు వేశారు.ఉన్నట్టుండి ఏసు కుప్పకూలడంతో కుటుంబసభ్యులు వెంటనే ఆస్పత్రికి తరలించారు.
పరిశీలించిన వైద్యులు గుండెపోటుతో ఏసు మరణించినట్టు పేర్కొన్నారు. ఆయనకు గుండెపోటు రావడానికి డీజే సౌండ్స్ కారణమని వైద్యులు వెల్లడించినట్టు తెలిసింది. డీజే ఎంతప్రమాదకరం అని చెప్పినా కొందరు వినిపించుకోవడం లేదు. శబ్ద తరంగాలు నేరుగా చెవుల గుండా వెళ్లి గుండెకు బలంగా తగిలితే కొన్నిసార్లు హార్ట్ బీటులో మార్పులు వచ్చి గుండె ఆగిపోయే ప్రమాదం ఉంటుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఏసు మరణానికి అదే కారణమని స్పష్టంచేశారు.
కాగా, మృతుడికి భార్య, ఇద్దరు కుమారులతో పాటు ఒక కుమార్తె ఉన్నారు.వచ్చే నెలలో కుమార్తె పెళ్లి ఉండగా ఇంతలోనే ఈ ఘటన చోటు చేసుకోవడంతో ఇంట్లో విషాదఛాయలు నెలకొన్నాయి.కుటుంబ పెద్దను కోల్పోవడంతో కూతురి వివాహం సైతం ప్రస్తుతం నిలిచిపోయినట్టు సమాచారం.కాగా, రాష్ట్రంలో డీజేలకు అనుమతులు నిరాకరించాలని ఈ ఘటన నేపథ్యంలో పలువురు కూటమి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు.డీజే సౌండ్ కూడా ఇంత డెసిబెల్‌లోనే ఉండాలని షరతులు విధించాలని డిమాండ్లు వినిపిస్తున్నాయి.












