Nithin: టాలీవుడ్‌లో నితిన్‌కు లవర్ బాయ్ ఇమేజ్ ఉన్న సంగతి తెలిసిందే. ‘జయం’, ‘దిల్’, ‘ఇష్క్’, ‘గుండె జారి గల్లంతయ్యిందే’ వంటి సినిమాలతో హీరోగా తనకంటూ ఒక సపరేట్ ఇమేజ్‌ను సంపాదించుకున్నాడు నితిన్. ఇప్పుడు మరో ఆసక్తికరమైన ప్రేమకథతో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నాడు. ఆ సినిమానే ‘అలియాస్ రుక్మిణీ’. ప్రస్తుతం, షూటింగ్ దశలో ఉన్న ఈ సినిమా ఫస్ట్ షెడ్యూల్‌ను పూర్తి చేసుకునట్టుగా తాజా సమాచారం.
నేచురల్ స్టార్ గా పేరున్న హీరో నాని నిర్మాతగానూ మంచి కథా బలమున్న సినిమాలను అందిస్తున్నాడు. అలా, ఈ సినిమాకు నేచురల్ స్టార్ నాని సమర్పకుడిగా వ్యవహరిస్తున్నాడు. ఇక, ‘దండోరా’ సినిమాతో దర్శకుడిగా పరిచయమైన మురళీకాంత్ దేవసోత్ కథను రాసి ‘అలియాస్ రుక్మిణీ’ కి దర్శకత్వం వహిస్తున్నారు. నితిన్ సోదరి దీప్తి గంట నిర్మిస్తున్న ఈ చిత్రం యునానిమస్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై రూపొందుతోంది.
ఈ సినిమాలో సీనియర్ నటుడు సాయి కుమార్, హర్ష వర్ధన్ ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. విజయ్ బుల్గానిక్ సంగీతం అందిస్తున్నాడు. ఇక, ప్రాజెక్ట్ మొదలైనప్పుడు వదిలిన టైటిల్ గ్లింప్స్ ప్రేక్షకుల నుంచి విశేషమైన స్పందనను దక్కించుకుంది. అయితే, ఈ సినిమా కథాంశం చాలా కొత్తదని మాత్రం గ్లింప్స్‌తో అర్థమైంది. నాని కూడా ఈ కథ విపరీతంగా నచ్చి నిర్మాణంలో భాగస్వామిగా చేరాడు.
ఇక, ఈ సినిమాలో ముందు నుంచీ హీరోయిన్‌గా రుక్మిణి వసంత్ పేరు ప్రచారంలో నిలిచింది. కాంతారా 1 మూవీతో పాన్ ఇండియా వైడ్‌గా గుర్తింపు తెచ్చుకొని ఇప్పుడు డ్రాగన్ సినిమాలో నటిస్తోంది. దాంతో, నిజంగా ఆమె హీరోయిన్ అయితే సినిమాకి మంచి క్రేజ్ వస్తుందనుకున్నారు. కానీ, ఇరుముడి సినిమాతో టాలీవుడ్‌లో బ్లాక్ బస్టర్ అందుకున్న ప్రియ భవానీ శంకర్ ని తీసుకునే ఆలోచనలో మేకర్స్ ఉన్నట్టుగా తెలుస్తోంది. హీరోయిన్‌కి చాలా ప్రాధన్యం ఉండటంతో మేకర్స్ ఆలోచించి కరెక్ట్‌గా సెలెక్ట్ చేయాలనుకుంటున్నారు. ఇక, ఈ సినిమాను ఇదే ఏడాది డిసెంబర్‌లో రిలీజ్ చేయాలని కూడా సన్నాహాలు చేస్తున్నట్టుగా తాజా సమాచారం.










