రిటైర్మెంట్ తర్వాత ఎక్కువ పెన్షన్ వస్తుందని ఆశిస్తున్న ఉద్యోగులు, పెన్షనర్లకు సంబంధించి కీలక పరిణామం చోటుచేసుకుంది. ఎంప్లాయీస్ పెన్షన్ స్కీమ్.. అంటే EPS-1995 కింద హైయర్ పెన్షన్ కోసం ఎదురుచూస్తున్న వారి సమస్యలపై బీజేపీ రాజ్యసభ సభ్యుడు డాక్టర్ అజీత్ మాధవరావ్ గోప్చడే ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి లేఖ రాశారు. పెండింగ్‌లో ఉన్న హైయర్ EPS పెన్షన్ క్లెయిమ్‌లను ఒకే విధమైన నిబంధనలతో, నిర్దిష్ట కాలపరిమితిలో పరిష్కరించేలా జోక్యం చేసుకోవాలని ఆయన కోరారు.
2022 నవంబర్ 4న సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుతో ఎక్కువ వేతనంపై EPSలో చందా చెల్లించి హైయర్ పెన్షన్ పొందేందుకు అర్హులైన ఉద్యోగులకు మార్గం ఏర్పడింది. ఆ తీర్పు అమలుకు EPFO చర్యలు తీసుకున్నట్లు కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే రాజ్యసభలో వెల్లడించింది. అయితే, ప్రక్రియలో ఎదురవుతున్న పరిపాలనా, డాక్యుమెంటేషన్ సమస్యలు, వివిధ సంస్థలు, ట్రస్టుల్లో అమలవుతున్న విధానాలు, కోర్టుల్లో కొనసాగుతున్న కేసులు ఇప్పటికీ పలువురు ఉద్యోగులు, పెన్షనర్లకు ఇబ్బందిగా మారుతున్నాయని ఎంపీ తన లేఖలో ప్రస్తావించారు.
ముఖ్యంగా EPF స్కీమ్‌లోని పేరా 26(6)కు సంబంధించిన సమస్యల కారణంగా కొంతమంది హైయర్ పెన్షన్ క్లెయిమ్‌లు నిలిచిపోతున్నాయని ఆయన పేర్కొన్నారు. ఒకే రకమైన అర్హతలు ఉన్న ఉద్యోగులు, పెన్షనర్లు వేర్వేరు కోర్టులను ఆశ్రయించాల్సిన పరిస్థితి ఎందుకు వస్తోందన్న అంశాన్ని కూడా లేఖలో ప్రస్తావించారు. పాత కేసులు, ఎగ్జెంప్టెడ్ సంస్థల ట్రస్టుల నిబంధనలు, కోర్టు ఆదేశాల అమలులో తేడాలు వంటి అంశాలపై స్పష్టమైన వ్యవస్థ అవసరమని కోరారు.
BHEL, SAIL వంటి సంస్థలకు చెందిన ట్రస్టుల్లో ఒకే విధమైన పరిస్థితుల్లో ఉన్న ఉద్యోగులకు పెన్షన్ ప్రయోజనాల్లో తేడాలు కనిపిస్తున్నాయన్న ఫిర్యాదులను కూడా ఎంపీ ప్రస్తావించారు. ఇలాంటి వివాదాలు ప్రతి ఒక్కరూ కోర్టును ఆశ్రయించే పరిస్థితికి దారితీయకుండా, ఒకే విధమైన సమస్యలకు ఒకే విధమైన పరిష్కారం లభించేలా పటిష్టమైన యంత్రాంగాన్ని ఏర్పాటు చేయాలని కోరారు.
ఇదే అంశంపై అజీత్ గోప్చడే ఆగస్టు 2026లో రాజ్యసభలోనూ ప్రశ్న లేవనెత్తారు. అప్పట్లో కేంద్ర ప్రభుత్వం.. సుప్రీంకోర్టు 2022 తీర్పును ఎగ్జెంప్టెడ్, అన్‌ఎగ్జెంప్టెడ్ సంస్థలకు వర్తించేలా అమలు చేస్తున్నామని తెలిపింది. మరోవైపు సెప్టెంబర్ 17, 2026 నుంచి EPFO కింద తప్పనిసరి కవరేజీకి సంబంధించిన వేతన పరిమితిని కేంద్రం 15 వేల రూపాయల నుంచి 25 వేల రూపాయలకు పెంచింది.
దీనివల్ల అదనంగా 51 లక్షలకు పైగా ఉద్యోగులు EPFO పరిధిలోకి వచ్చే అవకాశం ఉందని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. అయితే ఈ మార్పు ప్రధానంగా కొత్తగా తప్పనిసరి కవరేజీలోకి వచ్చే ఉద్యోగులకు సంబంధించినది. ఇక EPS-1995 ఆర్థిక స్థితిగతులను సమీక్షించడం, పేరా 26(6) సమస్యలను పరిష్కరించడం, అర్హులైన పెన్షనర్లకు సమాన న్యాయం అందించడం, అవసరం లేని కోర్టు వివాదాలను తగ్గించడం వంటి అంశాలపై కేంద్రం దృష్టి పెట్టాలని ఎంపీ కోరుతున్నారు. కాగా ఈ విషయంలో కేంద్రం తీసుకునే తదుపరి చర్యలపై ఆసక్తి నెలకొంది..










