దేశవ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించిన యువ వ్యాపారవేత్త కేతన్ అగర్వాల్ హత్య కేసులో మహారాష్ట్ర పోలీసులు విచారణ పూర్తి చేసి కోర్టులో ఛార్జిషీట్ సమర్పించారు. పుణె కోర్టులో దాఖలు చేసిన ఈ 5,053 పేజీల భారీ ఛార్జిషీట్‌లో ఈ దారుణ హత్య వెనుక ఉన్న కుట్ర, పథకరచన, అమలుకు సంబంధించిన ప్రణాళికను పోలీసులు సమగ్రంగా వివరించారు. ఈకేసులో ప్రధాన నిందితురాలైన కాబోయే భార్య సియా గోయల్, ఆమె ప్రియుడు చేతన్ చౌదరి, మరో నిందితుడు రితేష్ హంగేలను అరెస్ట్ చేసినట్లు అధికారులు వెల్లడించారు.
పోలీసులు సమర్పించిన వివరాల ప్రకారం.. 25ఏళ్ల వ్యాపారవేత్త కేతన్ అగర్వాల్‌తో 20ఏళ్ల సియా గోయల్‌కు ఈ ఏడాది ఫిబ్రవరిలో వివాహ నిశ్చితార్థం జరిగింది. ఈఏడాది నవంబర్‌లో జైపూర్ వేదికగా వీరి వివాహం ఎంతో వైభవంగా జరగాల్సి ఉంది. అయితే, ఈ పెళ్లి చేసుకోవడం ఇష్టం లేని సియా గోయల్, తన ప్రియుడు చేతన్ చౌదరి, స్నేహితుడు రితేష్‌లతో కలిసి కేతన్‌ను అంతమొందించేందుకు పక్కా వ్యూహం పన్నింది. ఇందులో భాగంగా కేతన్‌కు తెలిసిన ఒక యువతి ఫొటోతో 'మాహి' అనే ఫేక్ ఇన్‌స్టాగ్రామ్ ఐడీని సృష్టించి అతడితో చాటింగ్ చేస్తూ నమ్మకం పెంచుకున్నారు.
ఈ కుట్రలో భాగంగా జూన్ 18న లోహగడ్ కోట వద్ద సియాకు ముందస్తుగా బర్త్‌డే సర్‌ప్రైజ్ పార్టీ ఇద్దామని కేతన్‌ను నమ్మించి అక్కడికి రప్పించారు. జూన్ 18న సియాను వెంటబెట్టుకుని కోట వద్దకు వెళ్లిన కేతన్‌ను, ముందస్తు పథకం ప్రకారం కోట పైనుంచి కిందకు తోసి దారుణంగా హత్య చేశారు. అంతకుముందు జూన్ 14న కూడా అదే ప్రాంతంలో హత్య చేసేందుకు ప్రయత్నించి విఫలమైనట్లు పోలీసులు గుర్తించారు. ఫేక్ సోషల్ మీడియా ఖాతాలు, సర్‌ప్రైజ్ ప్లాన్ల ద్వారానే కేతన్‌ను లొకేషన్‌కు రప్పించినట్లు విచారణలో తేలింది.
ఈ సంచలనాత్మక కేసు ఛార్జిషీట్‌లో పోలీసులు ఐదుగురు ప్రత్యక్ష సాక్షులతో పాటు మొత్తం 100మందికి పైగా సాక్షుల వాంగ్మూలాలను పొందుపరిచారు. నిందితుల మొబైల్ ఫోన్లలోని డిజిటల్ డేటా, వాట్సాప్ సంభాషణలు, ఫొటోలు, కాల్ రికార్డింగ్‌లను బలమైన ఆధారాలుగా న్యాయస్థానానికి సమర్పించారు. సాంకేతిక ఆధారాల ఆధారంగా నిందితులకు కఠిన శిక్ష పడేలా చర్యలు తీసుకుంటామని సీనియర్ పోలీస్ అధికారులు స్పష్టం చేశారు.









