తెలంగాణ

Kalvakuntla Kavitha: నేను ఎవరి బాణాన్ని కాదు.. బహుజనుల బాణాన్ని : కవిత

రచన: Mahesh5 నిమిషాల పఠనం

Kalvakuntla Kavitha: సీఎం రేవంత్‌రెడ్డి సొంత అడ్డా కొడంగల్‌ గడ్డపై నుంచి తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత చేసిన కామెంట్స్ ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో సంచలనం సృష్టిస్తున్నాయి. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీలపై ముప్పేట దాడి చేస్తూనే.. స్థానిక పరిస్థితులపై నేరుగా సీఎంపైనే ప్రశ్నల వర్షం కురిపించారు.

Kalvakuntla Kavitha: సీఎం రేవంత్‌రెడ్డి సొంత అడ్డా కొడంగల్‌ గడ్డపై నుంచి తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత చేసిన కామెంట్స్ ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో సంచలనం సృష్టిస్తున్నాయి. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీలపై ముప్పేట దాడి చేస్తూనే.. స్థానిక పరిస్థితులపై నేరుగా సీఎంపైనే ప్రశ్నల వర్షం కురిపించారు. వికారాబాద్‌ జిల్లా కొడంగల్‌లో కార్యకర్తల భారీ ర్యాలీ నడుమ నిర్వహించిన ‘పాంచజన్య సంకల్ప సభ’లో ఆమె చేసిన ప్రసంగం ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో దుమారం రేపుతోంది.

ఎవరి బాణాన్ని కాదు.. నేనో నిప్పుకణికను

తన రాజకీయ అస్తిత్వంపై వస్తున్న విమర్శలను కవిత సూటిగా తిప్పికొట్టారు. "కాంగ్రెస్‌ విడిచిన బాణమని బీఆర్‌ఎస్‌ నేతలు ప్రచారం చేస్తుంటే.. కేసీఆర్‌ వదిలిన బాణమంటూ సీఎం రేవంత్‌రెడ్డి మాట్లాడుతున్నారు. మరికొందరు బుర్రలేని వ్యక్తులు నేను బీజేపీ బాణమంటూ ప్రచారం చేస్తున్నారు. కొడంగల్‌ సాక్షిగా తేల్చి చెబుతున్నా.. నేనెవరి బాణాన్నీ కాదు. అధికారానికి, నాణ్యమైన విద్యకు నోచుకోని తెలంగాణ బహుజనుల బాణాన్ని నేను. తెలంగాణ యువత గొంతుకను, అంబేడ్కర్‌ వాదాన్ని, మహాత్మా జ్యోతిబా ఫూలే ఆత్మగౌరవ నినాదాన్ని నేను" అంటూ గర్జించారు. ఒక మహిళ ఎవరి అండదండలు లేకుండా రాజకీయాల్లో ఎలా నిలబడగలదో చాటిచెప్పడానికే ఈ వేదికపైకి వచ్చానని, ప్రజలు ధైర్యమిస్తే ఆ పోరాటాన్ని చివరివరకు కొనసాగిస్తానని తేల్చిచెప్పారు.

కొడంగల్‌లో అఫ్గానిస్థాన్ పరిస్థితులా?..

సీఎం నియోజకవర్గంలో అభివృద్ధి లేమిని ఎత్తిచూపుతూ కవిత సంధించిన విమర్శలు సభలో చర్చనీయాంశంగా మారాయి. ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాలోని గట్టు, కేటీ దొడ్డి మండలాల్లో అక్షరాస్యత రేటు అఫ్గానిస్థాన్‌తో సమానంగా పడిపోయిందని విమర్శించారు. స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డే విద్యాశాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారని, కనీసం ప్రాథమిక విద్యా వ్యవస్థను కూడా బాగుచేయలేకపోయినందుకు ప్రజలకు ఆయన ఏం సమాధానం చెబుతారని సూటిగా నిలదీశారు.

తెలంగాణలో మహిళా పాలన రావాలి

సమాజంలో మహిళల పరిస్థితిపై ఆమె భావోద్వేగంగా స్పందించారు. స్త్రీలను మహారాణులు అంటూ మాటల్లో పొగిడే వ్యవస్థలో.. వంటింట్లోని చివరకు చిన్న గిన్నెల మీద కూడా మగవాళ్ల పేర్లే దర్శనమిస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. దేశంలోని 29 రాష్ట్రాల్లో ప్రస్తుతం ఒక్క మహిళ మాత్రమే ముఖ్యమంత్రిగా ఉన్న దుస్థితిని గుర్తుచేశారు. ఈ పాత సంప్రదాయాలను బద్దలు కొట్టి, చరిత్రను తిరగరాసేందుకు తెలంగాణలో మహిళా నాయకత్వంతో కూడిన మాతృస్వామ్య వ్యవస్థను తీసుకురావాలని పిలుపునిచ్చారు.

సీఎం రేవంత్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న కొడంగల్‌ వేదికగానే కవిత ఈ స్థాయిలో తీవ్ర విమర్శలు గుప్పించడంతో పాటు, బహుజన-మహిళా నినాదంతో సరికొత్త రాజకీయ పోరాటానికి తెరలేపడం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.

#Kalvakuntla Kavitha#Kavitha#Telangana Politics#Telangana Rashtra Sena#Kodangal#Revanth Reddy#swechaa news
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి