నేటి నుంచి ఆగస్టు 10 వరకు దరఖాస్తుల పక్రియ
10 అంతస్తుల భారీ భవనాల్లో 7,680 ఫ్లాట్ల నిర్మాణం
పేదల్లో చిగురిస్తున్నఆశలు
హైదరాబాద్ పరిధిలోని పేదలకు సొంతింటి కలను నెరవేర్చేందుకు తెలంగాణ ప్రభుత్వం ‘ఇందిరమ్మ ఇండ్లు’ పథకాన్ని నేడు(మంగళవారం) ప్రారంభించింది. కోర్ అర్బన్ రీజియన్ ఎకానమీ (CURE) పరిధిలోని అల్పాదాయ వర్గాల (LIG)కు ఇది వర్తిస్తుంది. తొలి విడతగా హైదరాబాద్ పరిధిలోని 16 నియోజకవర్గాల్లో ఈ పైలట్ ప్రాజెక్టును చేపడుతున్నారు. నియోజకవర్గానికి 480 చొప్పున మొత్తం 7,680 ఫ్లాట్లను 10 అంతస్తుల భారీ భవనాల్లో నిర్మించనున్నారు.
ఈ పథకం కింద నిర్మించే ఒక్కో ఫ్లాట్ 528 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉంటుంది. ఒక్కో ఫ్లాట్ నిర్మాణ వ్యయాన్ని రూ. 11లక్షలుగా నిర్ణయించారు. ఇందులో ప్రభుత్వం రూ. 5లక్షలను ఉచిత సబ్సిడీగా అందిస్తుండగా, మిగిలిన రూ. 6 లక్షలను లబ్ధిదారులు నాలుగు విడతల్లో చెల్లించాల్సి ఉంటుంది. అంతేకాకుండా, ఎంపికైన లబ్ధిదారులకు ప్రభుత్వం ఉచితంగా రిజిస్ట్రేషన్ సౌకర్యాన్ని కూడా కల్పిస్తుంది.
గత 10 ఏళ్లుగా నగరంలో నివసిస్తూ, సొంత ఇల్లు లేని రూ. 6 లక్షలలోపు వార్షిక ఆదాయం ఉన్నవారు మాత్రమే ఈ పథకానికి అర్హులు. అర్హులైన వారు జూలై 21 నుంచి ఆగస్టు 10 వరకు తెలంగాణ హౌసింగ్ బోర్డు వెబ్‌సైట్, మీ-సేవ లేదా వాట్సాప్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు ఫీజు రూ. 100 కాగా, ఈఎమ్‌డీ (EMD) కింద రూ. 10,000 చెల్లించాలి. లాటరీ ప్రక్రియలో ఇల్లు రాని వారికి ఈ EMD సొమ్మును వెంటనే రీఫండ్ చేస్తారు.
ఈ పథకం ద్వారా పొందిన ఇళ్లను లబ్ధిదారులు 10 ఏళ్ల వరకు విక్రయించడానికి వీలు లేదు. వచ్చే ఏడు బోనాల పండుగ నాటికి నిర్మాణాలను పూర్తి చేసి పేదలకు ఇళ్లను అందజేస్తామని మంత్రి పొంగులేటి స్పష్టం చేశారు. కాగా, ప్రభుత్వం నిర్వహించిన పోటీలో 'ఇందిరమ్మ ఇండ్లు' అనే పేరునే కొనసాగించాలని సూచించిన నకిరేకల్‌కు చెందిన కొండా నాగరాజు అనే వ్యక్తికి మంత్రులు రూ. లక్ష బహుమతి చెక్కును అందజేశారు.












