తెలంగాణ

HYDRA: హైడ్రా కమిషనర్‌పై హైకోర్టు ఫైర్.. కోర్టు ఆదేశాలు దిక్కరణ పై సీరియస్!..

రచన: Venu6 నిమిషాల పఠనం

హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ వ్యవహారంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రభుత్వం కానీ, ప్రభుత్వ అధికారులు కానీ చట్టానికి అతీతులు కాదని తేల్చిచెప్పింది.

హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ వ్యవహారంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఒకే భూ వివాదానికి సంబంధించి మూడు కోర్టు ధిక్కరణ పిటిషన్లు దాఖలవడంపై మండిపడింది. కోర్టు ఉత్తర్వులను పదేపదే ఎందుకు ఉల్లంఘిస్తున్నారని నేరుగా ప్రశ్నించిన ధర్మాసనం.. ప్రభుత్వం కానీ, ప్రభుత్వ అధికారులు కానీ చట్టానికి అతీతులు కాదని తేల్చిచెప్పింది.

మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా మల్కాజిగిరి మండలం లోతుకుంట గ్రామంలోని సర్వే నంబర్లు 1, 2లో ఉన్న సుమారు 40 ఎకరాల భూమిలో హైడ్రా అధికారులు చేపట్టిన కూల్చివేతలపై శాంతా శ్రీరామ్ కన్స్ట్రక్షన్స్ ప్రైవేట్ లిమిటెడ్ కోర్టు ధిక్కరణ పిటిషన్ దాఖలు చేసింది. ఈ వ్యాజ్యాన్ని విచారించిన హైకోర్టు.. ఇప్పటికే ఈ అంశంపై రెండు ధిక్కరణ పిటిషన్లు పెండింగ్‌లో ఉండగానే మరోసారి కోర్టు ఉత్తర్వులను ఉల్లంఘించారనే ఆరోపణలను తీవ్రంగా పరిగణించింది.

పిటిషనర్ తరఫు న్యాయవాది కోర్టుకు వివరాలు తెలియజేస్తూ.. హైకోర్టు స్పష్టమైన ఆదేశాలు అమల్లో ఉన్నప్పటికీ హైడ్రా అధికారులు భారీ బలగాలు, జేసీబీలు, బుల్డోజర్లతో ప్రైవేటు భూమిలోకి ప్రవేశించి ప్రహరీ గోడలు, టిన్ షెడ్లు, గేట్లు, సీసీ కెమెరాలు, విద్యుత్ వ్యవస్థను ధ్వంసం చేశారని వాదించారు. అంతేకాదు.. కోర్టు ఉత్తర్వులు చూపించినా పట్టించుకోకుండా పిటిషనర్‌ను, ఆయన న్యాయవాదిని పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లి గంటల తరబడి నిర్బంధించి కేసు నమోదు చేశారని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు.

ఈ వాదనలు విన్న జస్టిస్ జూకంటి అనిల్ కుమార్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అవసరమైతే కమిషనర్‌ను కోర్టు ముందు హాజరుపరచాల్సి వస్తుందని హెచ్చరించారు. దీంతో హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ అదే రోజు సాయంత్రం స్వయంగా హైకోర్టులో హాజరయ్యారు. విచారణ సందర్భంగా న్యాయమూర్తి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు తీవ్ర చర్చకు దారితీశాయి. కోర్టు ఉత్తర్వుల ఉల్లంఘన మీకు అలవాటుగా మారిందా? అంటూ ప్రశ్నించారు.

అలాగే ఈ కేసులో బాధితుడు పిటిషనర్ కాదు.. స్వయంగా కోర్టే అని న్యాయమూర్తి ఘాటుగా వ్యాఖ్యానించారు. కోర్టు ఉత్తర్వులను అపహాస్యం చేయడం ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోమని ఆయన స్పష్టం చేశారు. ప్రైవేటు ఆస్తిలో జోక్యం చేసుకోవద్దని స్పష్టమైన ఆదేశాలు అమల్లో ఉండగా వాటిని ఎందుకు ఉల్లంఘించారని న్యాయమూర్తి ప్రశ్నించారు. ప్రభుత్వ భూమిని రక్షిస్తున్నామనే పేరుతో ప్రైవేటు భూమిలోకి ఎలా ప్రవేశిస్తారని నిలదీశారు.

మరోవైపు అది రక్షణ శాఖ భూమి అని చెబుతున్నట్లయితే సంబంధిత శాఖను ఈ కేసులో ఎందుకు ప్రతివాదిగా చేర్చలేదని ప్రశ్నించారు. డివిజన్ బెంచ్ ఉత్తర్వులు అమల్లో ఉండగానే వాటికి విరుద్ధంగా వ్యవహరించడం న్యాయ ప్రక్రియలో జోక్యం చేసుకున్నట్లేనని న్యాయమూర్తి స్పష్టం చేశారు. ఇక హైడ్రా తరఫున అడ్వకేట్ జనరల్ సుదర్శన్ రెడ్డి వాదనలు వినిపిస్తూ.. జీఎల్‌ఆర్ సర్వే నంబర్ 243లో 119 ఎకరాల ప్రభుత్వ భూమి ఉందని, సర్వే పూర్తి చేసి భూముల విభజన చేపట్టేందుకు కొంత సమయం ఇవ్వాలని కోర్టును కోరారు.

అయితే గతంలో కూడా ఇలాంటి హామీ ఇచ్చారని, ఇప్పటివరకు ఎందుకు చర్యలు తీసుకోలేదని ధర్మాసనం ప్రశ్నించింది. కాగా ఈ కేసులో పిటిషనర్‌పై నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌కు సంబంధించిన పూర్తి వివరాలను అఫిడవిట్ రూపంలో సమర్పించాలని హైడ్రా కమిషనర్‌ను హైకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణను వాయిదా వేసింది. ప్రస్తుతం హైకోర్టు చేసిన ఈ ఘాటు వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయ, న్యాయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీశాయి. ఈ కేసు తదుపరి విచారణలో హైకోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందన్న అంశంపై అందరి దృష్టి నెలకొంది.

#Telangana#High Court#Medchal-Malkajgiri#Lothukunta#HYDRA Commissioner
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి