అస్సాంలో గత కొన్ని రోజులుగా కురుస్తున్న ఎడతెరిపి లేని భారీ వర్షాలకు జనజీవనం అస్తవ్యస్థంగా మారుతోంది. వరదల తాకిడికి ఇప్పటివరకు 10మంది ప్రాణాలు కోల్పోగా, లక్షలాది మంది నిరాశ్రయులయ్యారు. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 16 జిల్లాల్లోని 794 గ్రామాలు తీవ్రంగా ప్రభావితమయ్యాయి. ముఖ్యంగా శివసాగర్, జోర్హాట్, దిబ్రూఘర్, కమ్‌రూప్ వంటి జిల్లాల్లో పరిస్థితి దయనీయంగా మారింది. దాదాపు 3.62లక్షల మంది ప్రజలు వరద నీటిలో చిక్కుకుని తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
భారీ వర్షాల కారణంగా రాష్ట్రంలోని ప్రధాన నదులు ప్రమాదకర స్థాయిలో ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. నేమతిఘాట్ వద్ద బ్రహ్మపుత్రతో పాటు బుర్హిదిహింగ్, దిసాంగ్, ధన్‌సిరి, దిఖౌ నదులు ప్రమాద హెచ్చరికలను దాటి ప్రవహిస్తుండటంతో జనావాసాల్లోకి వరద నీరు భారీగా చేరింది. ఇళ్లలోకి నీరు చేరడం, రోడ్లు కొట్టుకుపోవడంతో ప్రజలు అల్లాడిపోతున్నారు. దీంతో రంగంలోకి దిగిన సహాయక బృందాలు బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నాయి. అధికారులు ఇప్పటివరకు 101 పునరావాస శిబిరాలను ఏర్పాటు చేసి నిరాశ్రయులకు ఆశ్రయం కల్పిస్తున్నారు.
ఈ ప్రకృతి విపత్తు వల్ల రాష్ట్రంలో వ్యవసాయ రంగం తీవ్రంగా దెబ్బతింది. దాదాపు 19,100 హెక్టార్లలో సాగైన పంటలు పూర్తిగా నీటమునిగిపోవడంతో రైతుల పరిస్థితి దయనీయంగా మారింది. చేతికొచ్చే దశలో ఉన్న పంటలు వరదపాలు కావడంతో రైతాంగం తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తోంది. అస్సాంలో రాబోయే రోజుల్లో మరిన్ని వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ ప్రకటించడంతో అధికారులు మరింత అప్రమత్తమయ్యారు. చెరువులు, నదుల నీటిమట్టాలను నిరంతరం పర్యవేక్షిస్తూ, ప్రమాదకర ప్రాంతాల్లో ఉన్న ప్రజలను ఖాళీ చేయిస్తున్నారు. ప్రజలందరూ స్థానిక అధికారుల సూచనలను పాటిస్తూ, సురక్షిత ప్రాంతాల్లో ఉండాలని ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది.












