ఢిల్లీలో కదం తొక్కిన కాక్రోచ్ పార్టీ కార్యకర్తలు
జనసంద్రంగా జంతర్ మంతర్ వేదిక
చర్చలకు దిగొచ్చిన కేంద్రం
ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాల్సిందే అంటున్న సీజేపీ
దేశంలో జెన్ జీ ఉద్యమం మొదలైందా..?
జెన్ జీ అంటే కేవలం సోషల్ మీడియాకే పరిమితమనుకున్నారు. కాక్రోచ్ జనతా పార్టీ పేరుతో ఉద్యమం మొదలుపెడితే.. వీళ్లేం చేస్తారులే అని లైట్ తీసుకున్నారు. కానీ సోమవారం ఢిల్లీలో కదంతొక్కారు కాక్రోచ్ పార్టీ కార్యకర్తలు. సోషల్ మీడియాను వదిలేసి హస్తిన వీధులను ముంచెత్తారు. కేంద్ర ప్రభుత్వాన్నే గడగడలాడించారు. సోషల్ మీడియాలో వ్యంగ్య ఉద్యమంగా మొదలైన ఓ పోరాటం ఈ స్థాయికి చేరుకుంటుందని ఎవరూ ఊహించి ఉండరు. బహుషా భారతదేశ చరిత్రలో ఈ స్థాయిలో జెన్‌జీ ఉద్యమం మునుపెన్నడూ జరిగి ఉండదు. పొలిటికల్ హిస్టరీలోనే ఇదో కీలక మలుపు.
విద్యారంగాన్ని టచ్ చేశారు
కాక్రోచ్ జనతా పార్టీ తొలి అడుగే.. చాలా స్ట్రాటజీతో వేసింది. కోట్లాది మంది విద్యార్థులకు సంబంధించిన అంశాన్ని ఎత్తుకుంది. పేపర్ లీకేజీలను అరికట్టాలని, దేశంలోని విద్యా వ్యవస్థను సంస్కరించాలని నినదించింది. ఇది విద్యార్థులను మాత్రమే కాదు.. తల్లిదండ్రులను కూడా కదిలించింది. అందుకే జంతర్‌మంతర్ వేదిక వద్ద విద్యార్థులు కనిపించారు. అంతకుమించి పేరెంట్స్ కూడా కదంతొక్కారు. కేంద్ర విద్యాశాఖమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలనే డిమాండ్ ఆషామాషీదేం కాదు. రాజకీయాల్లో ఇలాంటి డిమాండ్లు వినిపిస్తూనే ఉంటాయి. ఎన్నోసార్లు ప్రతిపక్షాలు ప్రధాని రాజీనామాకు డిమాండ్ చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. కానీ ఇలాంటి డిమాండ్లను ఎవరూ పట్టించుకోరు. ఈ డిమాండ్లు ఉద్యమంగా కూడా ఎప్పుడూ మారవు.
ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా డిమాండ్ మాత్రం సీజేపీ కి ఓ అస్త్రంగా మారింది. కేంద్ర విద్యాశాఖ వైఫల్యం వల్లే ఎన్నో పరీక్ష పత్రాలు లీకయ్యాయని, విద్యార్థులు చనిపోయారని ఆ పార్టీ ఆరోపిస్తోంది. సోమవారం ఆ పార్టీ ప్రతినిధులు కేంద్రమంత్రి జేపీ నడ్డాతో సమావేశమైనప్పుడు కూడా ఇదే డిమాండ్‌ను ప్రధానంగా వినిపించారు. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాల్సిందేనని డిమాండ్ చేశారు. ఆ తర్వాత కూడా కేంద్రం నుంచి ఎలాంటి ప్రకటన రాకపోవడంతో సీజేపీ ఫౌండర్ అభిజీత్ దీప్కే మరోసారి నిరసకు దిగారు. తమ డిమాండ్లు నెరవేరే దాకా వెనక్కి తగ్గేది లేదని ప్రకటించారు.
ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేస్తారా..?
కాక్రోచ్ జనతా పార్టీ కేంద్రం ముందు పెట్టిన 3 డిమాండ్లలో ప్రధానమైంది.. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా. అందుకే ఈ చర్చలకు పీఠముడి పడింది. పార్టీలు నిరసనలు తెలిపినంత మాత్రాన కేంద్ర మంత్రులు రాజీనామాలు చేసిన సందర్భాలు చాలా అరుదు. కానీ ఈ ఉద్యమం పొలిటికల్‌గా కాకుండా, జెన్‌జీ ఉద్యమంగా రూపాంతరం చెందుతోంది. 20 రోజుల నుంచి ఢిల్లీలోనే దీక్ష చేస్తున్నా సీజేపీకి పెద్దగా మైలేజీ రాలేదు. కానీ సోమవారం ఎపిసోడ్‌తో సీజేపీ గ్రాఫ్ ఒక్కసారిగా పెరిగిపోయింది. ఇంటర్నేషనల్ మీడియా కూడా కవరేజీ ఇచ్చింది. ఇంత జరుగుతుందని కేంద్రం కూడా ఊహించి ఉండదు.
ఒకవేళ సీజేపీ డిమాండ్లకు తలొగ్గి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేస్తే అదో సంచలనమే అవుతుంది. దేశంలో జెన్‌జీ ఉద్యమం సాధించిన తొలి విజయంగా నమోదవుతుంది. ఆ తర్వాత మరికొన్ని డిమాండ్లను తెరపైకి తెస్తుంది కాక్రోచ్ పార్టీ. జనానికి బాగా కనెక్టయ్యే అంశాలను తీసుకొని ఉద్యమాన్ని ఉరకలెత్తిస్తుంది. యువత అంటేనే మరిగే రక్తం. ఆ యువత ఒక్కసారి ఉద్యమానికి కనెక్టయితే ఆపడం ఎవరి తరమూ కాదు. నేపాల్, బంగ్లాదేశ్, శ్రీలంకలో ఇలాంటి ఉద్యమాలనే చూశాం. కానీ మన దేశంలో అంత సీన్ లేదులే అనుకున్నారు. మన జెన్‌జీ మొబైల్ ఫోన్లలోనే ఉద్యమం చేస్తారని, రోడ్డెక్కేందుకు వాళ్లకు అంత టైమ్ ఉండదనీ భావించారు. కానీ ఢిల్లీలో జరిగిన నిరసన కార్యక్రమం.. దేశాన్నే తమ వైపు తిప్పుకుంది. యూపీ, హర్యాన, పంజాబ్ లాంటి రాష్ట్రాల నుంచి కూడా విద్యార్థులు ఢిల్లీ ఉద్యమానికి తరలివచ్చారు. ఇది నెమ్మదిగా దేశమంతా విస్తరించే అవకాశాలు కనిపిస్తున్నాయి.
ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయకపోతే..?
కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయకపోతే ఉద్యమం మరింత దూకుడుగా మారవచ్చు. ప్రతిపక్ష పార్టీలు కూడా సీజేపీకి మద్దతివ్వడం మొదలైంది. ఇదొక కీలక పరిణామం. కేంద్రంలోని బీజేపీని దెబ్బకొట్టాలంటే విపక్షాలకు ఎలాంటి దారి కనిపించడం లేదు. అందుకు సీజేపీని ఒక వేదికగా వాడుకునే ఆలోచనలో కొన్ని పార్టీలు ఉన్నాయని తెలుస్తోంది. అదే జరిగితే.. కాక్రోచ్ జనతా పార్టీ కూడా రానున్న రోజుల్లో పూర్తిస్థాయి పొలిటికల్ పార్టీగా రూపాంతరం చెందుతుంది. వేరే పార్టీల నుంచి నాయకులు ఇందులో చేరే అవకాశం ఉంది. ఐతే అభిజీత్ దీప్కే ఒక్కరితోనే ఇది సాధ్యం కాదు. ఇందుకు చాలా మంది మేధావుల మద్దతు అవసరమవుతుంది. మరి ఆ దిశగా సీజేపీ ఆలోచన చేస్తుందా చూడాలి.
పార్లమెంటు సమావేశాలే టార్గెట్
ప్రస్తుతం పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు జరుగుతున్నాయి. ఇవి ఆగస్టు 13 దాకా కొనసాగనున్నాయి. ఈ నేపథ్యంలో ఎంపీలంతా ఢిల్లీలోనే ఉంటారు. ఈ సమయంలో ఉద్యమం చేస్తే.. మీడియా కవరేజీ వస్తుంది. నాయకుల మద్దతూ లభిస్తుంది. సోమవారం ఢిల్లీలో జరిగింది కూడా ఇదే. సీజేపీ నాయకులు చెబుతున్న దాన్ని బట్టి... పార్లమెంటు సమావేశాలు జరిగినన్ని రోజులు ఢిల్లీలో నిరసనలు కొనసాగే అవకాశముంది. ఈలోగా ధర్మేంద్ర ప్రధాన్ రాజనామా చేస్తే కొంత విరామం తీసుకోవచ్చేమో. లేదంటే మాత్రం ఈ నిరసన తగ్గదు. జెన్ జీ వేడి కూడా తగ్గదు.












