తెలంగాణలో పేద, మధ్యతరగతి కుటుంబాలకు సొంతింటి కలను నిజం చేసే దిశగా రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక అడుగు వేస్తోంది. క్యూర్ పరిధిలో నిర్మించనున్న ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించిన టెండర్లను త్వరలో ఖరారు చేయనున్నట్లు రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వెల్లడించారు.
మొత్తం 26 నియోజకవర్గాల్లో తొలి విడతగా ప్రతి నియోజకవర్గానికి 500 ఇళ్ల చొప్పున నిర్మాణం చేపట్టనున్నట్లు తెలిపారు. ప్రజలు ప్రస్తుతం నివసిస్తున్న ప్రాంతాలకు దగ్గర్లోనే ఈ ఇళ్లను నిర్మించేలా ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. ఇప్పటికే గుర్తించిన స్థలాల్లో పనులు వేగవంతం చేయడంతో పాటు, ఇంకా స్థలాలు గుర్తించాల్సిన ప్రాంతాల్లో వెంటనే చర్యలు తీసుకోవాలని సూచించారు.
అంతేకాదు.. రాష్ట్రవ్యాప్తంగా రెవెన్యూ, రిజిస్ట్రేషన్ శాఖలకు ఆధునిక సౌకర్యాలతో శాశ్వత భవనాల నిర్మాణం కూడా కొనసాగుతోంది. పది ఆర్డీవో కార్యాలయాలు, 107 తహసీల్దార్ కార్యాలయాలు, రెండు డీఐజీ కార్యాలయాలు, నాలుగు జిల్లా రిజిస్ట్రార్ కార్యాలయాలు, 52 సబ్-రిజిస్ట్రార్ కార్యాలయాలు ఒకే నమూనాలో, భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని నిర్మించనున్నట్లు మంత్రి తెలిపారు.
మరోవైపు... రైతుల భూముల భద్రతపై కూడా ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. భూ భారతి పోర్టల్‌ను మరింత పటిష్ఠంగా రూపొందించి భూముల రక్షణకు అవసరమైన చర్యలు చేపట్టాలని మంత్రి అధికారులను ఆదేశించారు.
గతంలో ధరణి పోర్టల్‌లో జరిగిన అక్రమాలపై జరుగుతున్న విచారణ పురోగతిని సమీక్షించిన ఆయన, ఎలాంటి లోపాలకు తావులేకుండా సమగ్ర దర్యాప్తు పూర్తి చేసి, రైతుల భూములకు పూర్తి భద్రత కల్పించేలా స్పష్టమైన సిఫార్సులు చేయాలని సూచించారు.
మొత్తానికి ప్రజా ప్రభుత్వం ఇళ్ల నిర్మాణం నుంచి భూముల భద్రత వరకు.. ప్రజలకు పారదర్శకమైన, విశ్వసనీయమైన సేవలు అందించడమే లక్ష్యంగా ముందుకు సాగుతుంది..












