బోరబండ ఎస్సై షేక్ నాగుల్ మీరాపై నగర పోలీస్ కమిషనర్ శనివారం సస్పెన్షన్ వేటు వేశారు. వివాహేతర సంబంధం పెట్టుకుని, భార్యను మానసికంగా, శారీరకంగా వేధిస్తున్నారనే ఆరోపణలు నిజమని తేలడంతో పోలీస్ కమిషనర్ ఈ నిర్ణయం తీసుకున్నారు. ఎస్సై నాగుల్ మీరాకు 2019లో ఆర్టీసీ కండక్టర్ షేక్ రహేమాతో వివాహం జరగ్గా.. వీరికి ముగ్గురు పిల్లలు ఉన్నారు.
అయితే, నగరంలోని మరో పోలీస్ స్టేషన్‌లో పనిచేస్తున్న ఓ మహిళా కానిస్టేబుల్‌తో ఎస్సై అక్రమ సంబంధం పెట్టుకుని, అడిగినందుకు భార్యను వేధింపులకు గురిచేయడం మొదలుపెట్టాడు. భర్త వేధింపులు భరించలేక బాధితురాలు రహేమా ఇటీవల డీజీపీతో పాటు హైదరాబాద్ పోలీస్ కమిషనర్‌కు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేసింది. దీనిపై స్పందించిన ఉన్నతాధికారులు.. ఎస్సై నాగుల్ మీరాతో పాటు సదరు మహిళా కానిస్టేబుల్‌ను పిలిపించి పద్ధతి మార్చుకోవాలంటూ గట్టిగా కౌన్సెలింగ్ ఇచ్చి హెచ్చరించారు. అయినప్పటికీ ఎస్సై తీరులో ఎలాంటి మార్పు రాలేదు.
పైగా తనపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసిందనే కక్షతో భార్య రహేమాను మరింత క్రూరంగా వేధించడం ప్రారంభించాడు. దీంతో బాధితురాలు మరోసారి పోలీస్ కమిషనర్‌ను ఆశ్రయించింది. ఈ ఫిర్యాదుపై నగర పోలీస్ కమిషనర్ పూర్తిస్థాయిలో అంతర్గత విచారణ జరిపించారు. విచారణలో ఎస్సై నాగుల్ మీరా.. మహిళా కానిస్టేబుల్‌తో వివాహేతర సంబంధాన్ని కొనసాగిస్తున్నట్లు, అలాగే భార్యను తీవ్రంగా వేధిస్తున్నట్లు ఆధారాలతో సహా నిర్ధారణ అయ్యింది. శాఖాపరమైన క్రమశిక్షణను ఉల్లంఘించి, పోలీసుల ప్రతిష్ఠను దిగజార్చేలా ప్రవర్తించిన ఎస్సై షేక్ నాగుల్ మీరాను సస్పెండ్ చేస్తూ సీపీ ఉత్తర్వులు జారీ చేశారు.












