ఓటు చోరీకి కేంద్ర ఎన్నికల సంఘం చీఫ్ కమిషనర్ జ్ఞానేష్ కుమార్ మద్దతుగా నిలుస్తున్నారని, ఎస్ఐఆర్ పేరిట ఓట్ల చోరీకి పాల్పడుతున్నారని లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఆరోపించిన విషయం తెలిసిందే.ఆయన రాజీనామాకు కాంగ్రెస్ పార్టీ పట్టుడుతున్న నేపథ్యంలో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఘాటుగా స్పందించారు. రాహుల్ గాంధీ విచక్షణ కోల్పోయి మాట్లాడుతున్నారని విమర్శించారు. ఈసీ అంశంలో కాంగ్రెస్, దాని మిత్రపక్షాలు చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నట్టు పేర్కొన్నారు.
రాహుల్ గాంధీ చేస్తున్న ఆరోపణలను ప్రజలు అసహ్యించుకుంటున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ గెలిస్తే ఈసీ సరిగా పని చేస్తుందని.. అదే కాంగ్రెస్ ఓటమి చెందితే ఈసీ సరిగా పనిచేయట్లేదని అంటున్నారని విమర్శించారు. రాహుల్‌ను ప్రధానమంత్రి చేసేందుకు ఈసీ పని చేయదని స్పష్టంచేశారు. బీజేపీని విమర్శించే నైతిక హక్కు కాంగ్రెస్ పార్టీకి ఉందా?అని ప్రశ్నించారు. ప్రజాస్వామ్యం గురించి మాట్లాడే హక్కు కాంగ్రెస్‍కు ఉందా? అని నిలదీశారు. 12 ఏళ్ల బీజేపీ, ఎన్డీయే పాలనలో ఒక్క అవినీతి కుంభకోణం లేదని గుర్తుచేశారు.
యూపీఏ ప్రభుత్వం హయాంలో 2009లో నాటి సీఈసీ గోపాల స్వామి, ఈసీ నవీన్ చావ్లాను తప్పించాలని రాష్ట్రపతికి సిఫార్సు చేసిన చరిత్ర కాంగ్రెస్ పార్టీదని గుర్తుచేశారు. దీనిపై కాంగ్రెస్ సమాధానం చెప్పాలన్నారు. బీజేపీపై వ్యతిరేకత రావడం లేదని రాహుల్ మాట్లాడటం విచిత్రంగా ఉందన్నారు. ప్రజల మీద, ప్రజాస్వామ్యం మీద విశ్వాసం లేని వారు ఇదే రకమైన వితండవాదం చేస్తారన్నారు.
ప్రజల కోసం పని చేస్తే వారే ప్రభుత్వాన్ని నిలబెడతారని, ప్రధాని మోడీ నేతృత్వంలో అదే జరుగుతోందన్నారు. ఎన్నికలు ఉన్నప్పుడే తాము ప్రజల వద్దకు వెళ్లబోమని, ఎన్నికలున్నా లేకున్నా నిత్యం ప్రజాక్షేత్రంలో ఉంటామని స్పష్టంచేశారు. ప్రజలు స్థిరమైన ప్రభుత్వం, నాయకత్వం కోరుకుంటున్నారని, అందుకే బీజేపీకి ఓటు వేస్తున్నారని కేంద్రమంత్రి స్పష్టంచేశారు. ఈ విషయాన్ని రాహుల్ గాంధీ అర్థం చేసుకోలేకపోతే కాంగ్రెస్ పార్టీ, రాహుల్ గాంధీని ఎవరూ కాపాడలేరన్నారు. దేశభద్రత విషయంలో బీజేపీ ఎక్కడా రాజీపడబోదని.. మీకు లాగా ఉగ్రవాద, తీవ్రవాద శక్తులతో కుమ్మక్కై పని చేయబోమని తెలిపారు. ఉగ్రవాద మద్దతుదారులు, అర్బన్ నక్సలైట్లతో కాంగ్రెస్ పార్టీ అంటకాగిందని ఆరోపించారు.








