సిరిసిల్లకు వస్తానని ప్రకటించిన సీఎం రేవంత్ రెడ్డికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పలు సూటి ప్రశ్నలు సంధించారు. తన నియోజకవర్గంలో 8 వేల ఎకరాలను బీఆర్ఎస్ నేతలు కబ్జా చేశారని సీఎం రేవంత్ ఇటీవల ఆరోపించగా.. ఆ భూములపై శ్వేతపత్రం విడుదల చేయాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. ఈ మేరకు సీఎంకు ఓ లేఖ రాశారు.
ఆ 8 వేల ఎకరాల్లో 2,400 ఎకరాలు రికవరీ చేసినట్లు చెబుతున్న వివరాలను బయటపెట్టాలన్నారు. నేతన్న, రైతన్న, విద్యార్థి, అన్ని వర్గాల సమస్యలకు సమాధానం చెప్పాలని కోరారు.హామీల అమలుపై స్పష్టమైన తేదీలు ప్రకటించాలన్నారు. సిరిసిల్ల అభివృద్ధిపై ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దాదాపు మూడేళ్లు పూర్తయిన తర్వాత తొలిసారిగా సిరిసిల్లకు వస్తున్న సీఎం రేవంత్ రెడ్డికి కేటీఆర్ స్వాగతం పలికారు.సీఎం హోదాలో సిరిసిల్లకు వస్తున్నందున రాజకీయ విమర్శలు, వ్యక్తిగత దూషణలకు కాకుండా ప్రజల సమస్యలకు సమాధానం చెప్పాలని కోరారు. సిరిసిల్లలో బీఆర్‌ఎస్ నాయకులు 8 వేల ఎకరాల ప్రభుత్వ భూమిని దోచుకున్నారని, అందులో 2,400 ఎకరాలను ప్రభుత్వం తిరిగి స్వాధీనం చేసుకుందని అసెంబ్లీలో సీఎం చేసిన ఆరోపణలు నిరాధారమని కేటీఆర్ పేర్కొన్నారు.
2014 నుంచి 2023 డిసెంబర్ వరకు రాజన్న సిరిసిల్ల జిల్లాలో కేవలం 1,272 ఎకరాల భూమి మాత్రమే పంపిణీ జరిగిందని, అందులో సిరిసిల్ల నియోజకవర్గంలో కేవలం 204 ఎకరాలు మాత్రమే పంపిణీ చేశామన్నారు..భూ రికార్డుల ప్రక్షాళనలో భాగంగా రైతుల అభ్యర్థనల మేరకు, అర్హత ప్రకారం రికార్డులు సవరించామని చెప్పారు.
నేతన్నలకు ఏడాది పొడవునా పని..
బీఆర్‌ఎస్ ప్రభుత్వం సిరిసిల్ల నేత కార్మికులకు నిరంతరం ఉపాధి కల్పించాలనే లక్ష్యంతో బతుకమ్మ చీరల పథకాన్ని ప్రారంభించి విజయవంతంగా అమలు చేసిందని కేటీఆర్ తెలిపారు. స్కూల్ యూనిఫాంలు, కేసీఆర్ కిట్, రంజాన్, క్రిస్మస్ గిఫ్ట్ ప్యాక్‌లు, సంక్షేమ శాఖ వస్త్ర ఉత్పత్తి ఆర్డర్లతో పాటు అనేక ప్రభుత్వ ఆర్డర్లను సిరిసిల్ల మరమగ్గాల పరిశ్రమకు అందించామని చెప్పారు.బీఆర్‌ఎస్ ప్రభుత్వ కాలంలో రూ.3,313 కోట్ల విలువైన 100 కోట్ల మీటర్ల బట్టకు పీపీ ఆర్డర్లు, టెస్కో ద్వారా ఆర్డర్లు ఇచ్చామన్నారు.
దీంతో నేతన్నలకు ఏడాది పొడవునా ఉపాధి లభించడంతో పాటు నెలకు రూ.15 వేల నుంచి రూ.20 వేల వరకు వేతనం పొందే పరిస్థితి కల్పించామని చెప్పారు.సిరిసిల్ల వస్త్ర ఉత్పత్తుల టర్నోవర్‌ను ఏడాదికి రూ.250 కోట్ల నుంచి దాదాపు రూ.1,000 కోట్లకు పెంచామని, నేతన్నల ఆత్మహత్యలు తగ్గడంతో పాటు వలసలు కూడా నిలిచిపోయాయన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం బతుకమ్మ చీరల పథకాన్ని నిలిపివేసి 2024లో నేతన్నలకు పూర్తిగా ఉపాధి లేకుండా చేసిందని కేటీఆర్ ఆరోపించారు.
రూ.60 కోట్ల బకాయిలు ఎప్పుడు చెల్లిస్తారు?
పాత బకాయిలన్నీ చెల్లించామని కాంగ్రెస్ ప్రభుత్వం చెబుతున్నప్పటికీ, రూ.300 కోట్ల బకాయిల్లో ఇంకా రూ.60 కోట్లు చెల్లించాల్సి ఉందని కేటీఆర్ తెలిపారు.నేతన్నలకు చెల్లించిన 10 శాతం యార్న్ సబ్సిడీని కాంగ్రెస్ ప్రభుత్వం నిలిపివేసిందని ఆరోపించారు.రూ.60 కోట్ల పెండింగ్ బకాయిలను ఎప్పుడు చెల్లిస్తారు? 10 శాతం యార్న్ సబ్సిడీని ఎప్పుడు విడుదల చేస్తారు? స్పష్టమైన తేదీలు ప్రకటించాలని డిమాండ్ చేశారు.
సిరిసిల్లలో యార్న్ డిపో ఏర్పాటు చేయాలి
వస్త్ర పరిశ్రమ ఉన్న సిరిసిల్లను కాదని వేములవాడలో యార్న్ డిపో ఏర్పాటు చేయడం ద్వారా సిరిసిల్ల నేతన్నలను అవమానించారని కేటీఆర్ ఆరోపించారు.వస్త్రోత్పత్తికి రూ.300 కోట్ల విలువైన యార్న్ అవసరం ఉండగా కేవలం రూ.50 కోట్లు మాత్రమే కేటాయించారని తెలిపారు.సిరిసిల్లలోనే యార్న్ డిపో ఏర్పాటు చేసి అవసరమైన మేరకు యార్న్ అందుబాటులోకి తీసుకురావాలని డిమాండ్ చేశారు.
రూ.5 లక్షల నేతన్న బీమాను పునరుద్ధరించాలి
రైతుబీమా తరహాలో నేత కార్మికుల కోసం బీఆర్‌ఎస్ ప్రభుత్వం ప్రారంభించిన రూ.5 లక్షల నేతన్న బీమా పథకాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రీమియం కూడా చెల్లించకుండా నిలిపివేసిందని కేటీఆర్ తెలిపారు.నేతన్న బీమాను ఎప్పుడు పునరుద్ధరిస్తారో ముఖ్యమంత్రి ప్రకటించాలని డిమాండ్ చేశారు.అపరెల్ పార్క్‌లో కొత్త పరిశ్రమలు ఏర్పాటు చేయాలి.పెద్దూర్ ప్రాంతంలో 60 ఎకరాల్లో రూ.174 కోట్లతో అపరెల్ పార్క్ నిర్మించామని కేటీఆర్ తెలిపారు. గోకుల్‌దాస్,టెక్స్‌పోర్ట్ తదితర సంస్థల ద్వారా 2,500 మంది మహిళలకు ఉపాధి కల్పించామని చెప్పారు.మరో 8 వేల మందికి పని కల్పించే అవకాశం ఉన్నప్పటికీ కాంగ్రెస్ ప్రభుత్వం కొత్త పరిశ్రమలను ఏర్పాటు చేయడానికి సహకరించడం లేదని ఆరోపించారు.
కాంగ్రెస్ ప్రభుత్వం ఆ షెడ్లను వడ్ల గోదాములు, విద్యుత్ పరికరాల గోదాములు, ఇతర అవసరాలకు వినియోగిస్తూ నేతన్నల కలలను దెబ్బతీస్తోందని ఆరోపించారు. వీవింగ్ పార్క్‌ను ఎప్పుడు ప్రారంభిస్తారు? షెడ్లను ఎప్పటిలోగా నేతన్నలకు కేటాయిస్తారు? కార్మికులను ఎప్పటిలోగా యజమానులుగా మారుస్తారు? స్పష్టంగా ప్రకటించాలని డిమాండ్ చేశారు.
రైతుబంధు బకాయిలు ఎప్పుడు చెల్లిస్తారు?
బీఆర్‌ఎస్ హయాంలో సిరిసిల్ల నియోజకవర్గంలోని సుమారు 56 వేల మంది రైతులకు ఎకరాకు రూ.10 వేల చొప్పున రూ.532 కోట్ల పెట్టుబడి సాయం రైతుబంధు కింద అందించామని కేటీఆర్ తెలిపారు. కాంగ్రెస్ మ్యానిఫెస్టోలో రైతుబంధును రూ.15 వేలకు పెంచుతామని హామీ ఇచ్చారని, అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ హామీని పూర్తిగా అమలు చేయలేదని విమర్శించారు. ఎగ్గొట్టిన రైతుబంధు బకాయిలను ఎప్పుడు చెల్లిస్తారో, ఎకరాకు రూ.15 వేల చొప్పున ఎప్పటి నుంచి ఇస్తారో స్పష్టంగా ప్రకటించాలని డిమాండ్ చేశారు.
కౌలు రైతులకు రైతుబంధు ఎప్పుడు?
కౌలు రైతులకు ఎకరాకు రూ.15 వేల రైతుబంధు ఇస్తామని ఇచ్చిన హామీని ఎప్పటి నుంచి అమలు చేస్తారో ముఖ్యమంత్రి ప్రకటించాలని కేటీఆర్ కోరారు.రూ.2 లక్షల రైతు రుణమాఫీ పూర్తి చేయాలిఎన్నికల్లో ఇచ్చిన రూ.2 లక్షల రైతు రుణమాఫీ హామీని సంపూర్ణంగా ఎప్పటిలోగా అమలు చేస్తారో సీఎం స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు.
రైతు బీమాను పునరుద్ధరించాలి
బీఆర్‌ఎస్ హయాంలో రైతుబీమా కింద సిరిసిల్ల నియోజకవర్గంలోని 806 రైతు కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున మొత్తం రూ.40.30 కోట్లు అందించామని కేటీఆర్ తెలిపారు.ప్రస్తుత ప్రభుత్వం బీమా సంస్థకు ప్రీమియం కూడా చెల్లించకుండా రైతుబీమా పథకాన్ని నిలిపివేసిందని ఆరోపించారు.రైతుబీమాను ఎప్పుడు పునరుద్ధరిస్తారో ప్రకటించాలని డిమాండ్ చేశారు.
వ్యవసాయ యాంత్రీకరణకు నిధులు ఇవ్వాలి
బీఆర్‌ఎస్ ప్రభుత్వం రూ.12 కోట్లతో సుమారు 260 మంది రైతులకు ట్రాక్టర్లు, ఇతర వ్యవసాయ పనిముట్లు అందించిందని కేటీఆర్ తెలిపారు.ప్రస్తుత ప్రభుత్వం వ్యవసాయ యాంత్రీకరణను పట్టించుకోవడం లేదని ఆరోపించారు.మార్కెట్ యార్డులు, గోదాముల సామర్థ్యం పెంచాలి.నియోజకవర్గంలో రూ.15 కోట్లతో నాలుగు కొత్త మార్కెట్ కమిటీలను ఏర్పాటు చేశామని, సర్దాపూర్‌లో రూ.26 కోట్లతో ఆధునిక మార్కెట్ యార్డు నిర్మించామన్నారు.
మల్కపేట నుంచి అప్పర్ మానేరు వరకు నీరు ఎప్పుడు?
సిరిసిల్ల నియోజకవర్గంలో సాగునీటి సామర్థ్యాన్ని 1.36 లక్షల ఎకరాలకు పెంచామని కేటీఆర్ తెలిపారు.కాళేశ్వరం 9వ ప్యాకేజీలో భాగంగా మధ్య మానేరు నుంచి అప్పర్ మానేరు వరకు అనుసంధాన పనులను రూ.1,604 కోట్లతో చేపట్టామని, రూ.533 కోట్లతో 3 టీఎంసీల సామర్థ్యంతో మల్కపేట రిజర్వాయర్ పూర్తి చేశామని తెలిపారు.మల్కపేట నుంచి అప్పర్ మానేరు వరకు నీటిని ఎప్పుడు తరలిస్తారు? డిస్ట్రిబ్యూటరీ కాలువలను ఎప్పుడు మంజూరు చేస్తారు? స్పష్టంగా ప్రకటించాలని డిమాండ్ చేశారు.
చెరువులు, చెక్‌డ్యామ్‌లకు నిధులు ఇవ్వాలి
మిషన్ కాకతీయలో భాగంగా రూ.80 కోట్లతో చెరువుల అభివృద్ధి, ట్యాంక్‌బండ్ల నిర్మాణం చేపట్టామని కేటీఆర్ తెలిపారు.రూ.140 కోట్లతో 12 చెక్‌డ్యామ్‌లు నిర్మించామని చెప్పారు.జిల్లాలో చెరువుల అభివృద్ధికి, చెక్‌డ్యామ్‌ల నిర్మాణానికి ఎన్ని కోట్లు కేటాయిస్తారో సీఎం ప్రకటించాలని డిమాండ్ చేశారు.
విద్యారంగంపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలి
JNTU ఇంజినీరింగ్ కాలేజీకి నిధులు విడుదల చేయాలి. సిరిసిల్లను ఎడ్యుకేషన్ హబ్‌గా తీర్చిదిద్దే లక్ష్యంతో బీఆర్‌ఎస్ ప్రభుత్వం వివిధ విద్యాసంస్థలను ఏర్పాటు చేసిందని కేటీఆర్ తెలిపారు. జిల్లాలో రూ.400 కోట్లతో JNTU ఇంజినీరింగ్ కాలేజీ, రూ.166 కోట్లతో మెడికల్ కాలేజీ, రూ.10 కోట్లతో వ్యవసాయ పాలిటెక్నిక్ కళాశాల, రూ.80 కోట్లతో వ్యవసాయ కళాశాల, రూ.36 కోట్లతో నర్సింగ్ కళాశాల, రూ.4 కోట్లతో ప్రభుత్వ ITI ఏర్పాటు చేశామని తెలిపారు.రూ.400 కోట్లతో మంజూరైన JNTU ఇంజినీరింగ్ కాలేజీకి కాంగ్రెస్ ప్రభుత్వం నిధులు విడుదల చేయడం లేదని ఆరోపించారు.
సిరిసిల్ల అభివృద్ధిపై ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలి
2014 నుంచి 2023 వరకు సిరిసిల్ల పట్టణంలో సుమారు రూ.1,564 కోట్లతో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామని కేటీఆర్ తెలిపారు.రహదారులు, మురికి కాలువలు, జంక్షన్లు, వైకుంఠధామాలు, సామాజిక సంఘ భవనాలు, పార్కులు, సెంట్రల్ లైటింగ్, క్రీడా ప్రాంగణాలు, మార్కెట్లు, డిజిటల్ గ్రంథాలయం, దోభీఘాట్ తదితర పనులు చేపట్టామని చెప్పారు.మిషన్ భగీరథ ద్వారా పట్టణ ప్రజలకు ఇంటింటికీ సురక్షిత తాగునీరు అందించామని తెలిపారు.కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పట్టణంలో కొత్తగా చేపట్టిన అభివృద్ధి పనుల వివరాలను పత్రికాముఖంగా విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
పంచాయతీరాజ్, ఆర్‌అండ్‌బీ ద్వారా కొత్త పనులు మంజూరు చేయాలి
బీఆర్‌ఎస్ హయాంలో పంచాయతీరాజ్, రోడ్లు–భవనాల శాఖల ద్వారా సుమారు రూ.1,000 కోట్లతో డబుల్ రోడ్లు, రింగ్ రోడ్లు, తారు రోడ్లు, సీసీ రోడ్లు, మురికి కాలువలు, కమ్యూనిటీ భవనాలు, గ్రామపంచాయతీ భవనాలు, గోదాములు, క్రీడా ప్రాంగణాలు, ప్రభుత్వ కార్యాలయాలు నిర్మించామని కేటీఆర్ తెలిపారు.మిషన్ భగీరథ ద్వారా రూ.1,132 కోట్లతో జిల్లాలోని అన్ని గ్రామాల్లో ప్రతి ఇంటికీ తాగునీరు అందించామని పేర్కొన్నారు.సిరిసిల్ల నియోజకవర్గానికి ఎన్ని రోడ్లు, ఎన్ని భవనాలు మంజూరు చేస్తారు? వెంటనే ఎన్ని నిధులు విడుదల చేస్తారు? ప్రకటించాలని డిమాండ్ చేశారు.
CESS రద్దుపై సీఎం సమాధానం చెప్పాలి
2014 నుంచి 2023 వరకు సిరిసిల్ల నియోజకవర్గంలో రూ.120 కోట్లతో 17–33/11 KV సబ్‌స్టేషన్లు, ఒక 132/33, ఒక 220/133 సబ్‌స్టేషన్ మంజూరు చేసి 24 గంటల నాణ్యమైన విద్యుత్ అందించామని కేటీఆర్ తెలిపారు.సిరిసిల్ల సహకార విద్యుత్ పంపిణీ సంస్థ CESSను నిబంధనలకు విరుద్ధంగా రద్దు చేశారని ఆరోపించారు.CESSను ఎందుకు రద్దు చేశారో ముఖ్యమంత్రి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
సిరిసిల్ల వైద్యరంగానికి మరిన్ని నిధులు ఇవ్వాలి
బీఆర్‌ఎస్ ప్రభుత్వం 2014 నుంచి 2023 వరకు రూ.213 కోట్లతో జిల్లా ప్రధాన ఆసుపత్రిని 300 పడకలకు పెంచిందని కేటీఆర్ తెలిపారు.మాతాశిశు కేంద్రం, రక్తనిధి, డయాలసిస్ కేంద్రం, ఐసీయూ, ఆధునిక మెటర్నిటీ వార్డు వంటి సౌకర్యాలను ఏర్పాటు చేశామని చెప్పారు.గ్రామీణ ప్రాంతాల్లో రూ.11 కోట్లతో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, 30 పడకల ఆసుపత్రులు ఏర్పాటు చేశామని తెలిపారు.సిరిసిల్ల వైద్యరంగ అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకునే చర్యలు, కేటాయించే నిధుల వివరాలను సీఎం ప్రకటించాలని డిమాండ్ చేశారు.
సంక్షేమ పథకాలను పునరుద్ధరించాలి
బీఆర్‌ఎస్ హయాంలో ఆసరా పెన్షన్లు, కల్యాణలక్ష్మి, షాదీముబారక్, కేసీఆర్ కిట్, ఆరోగ్యలక్ష్మి, కంటి వెలుగు వంటి పథకాల ద్వారా పేదలు, మహిళలు, వృద్ధులకు సంక్షేమ ఫలాలు అందించామని కేటీఆర్ తెలిపారు.చేపపిల్లల పంపిణీ, గొర్రెల పంపిణీ, దళితబంధు, బీసీబంధు వంటి పథకాల ద్వారా వివిధ వర్గాలకు జీవనోపాధి కల్పించామని చెప్పారు.సిరిసిల్ల నియోజకవర్గంలో సుమారు రూ.250 కోట్లతో 4,500 ఇళ్ల నిర్మాణం చేపట్టామని తెలిపారు.
పెన్షన్ బకాయిలు వెంటనే చెల్లించాలి
ఆసరా పెన్షన్లను రూ.2 వేల నుంచి రూ.4 వేలకు పెంచుతామని హామీ ఇచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఆ హామీని అమలు చేయలేదని కేటీఆర్ ఆరోపించారు.కొత్త పెన్షన్లు ఇవ్వకపోగా ఉన్న పెన్షన్లకు కూడా కోతలు విధించారని విమర్శించారు.వృద్ధులు, బీడీ కార్మికులకు 33 నెలలుగా బాకీ ఉన్న రూ.66 వేల మొత్తాన్ని వెంటనే వారి ఖాతాల్లో జమ చేయాలని డిమాండ్ చేశారు.
మహాలక్ష్మి హామీపై స్పష్టత ఇవ్వాలి
మహిళలకు నెలకు రూ.2,500 ఇస్తామని ఇచ్చిన హామీని ఎప్పుడు అమలు చేస్తారో ప్రకటించాలని కేటీఆర్ డిమాండ్ చేశారు.ప్రతి ఆడబిడ్డకు 33 నెలలకు బాకీ ఉన్న రూ.82,500 ఎప్పుడు చెల్లిస్తారో చెప్పాలని కోరారు.కల్యాణలక్ష్మి కింద తులం బంగారం పథకం ఎప్పుడు ప్రారంభిస్తారు? పెన్షన్ల పెంపు, కొత్త పెన్షన్ల మంజూరు ఎప్పుడు? ప్రకటించాలని డిమాండ్ చేశారు.చేపపిల్లలు, గొర్రెల పంపిణీ, దళితబంధు, బీసీబంధు పునరుద్ధరించాలన్నారు.
ఆటో డ్రైవర్లకు రూ.12 వేల హామీ అమలు చేయాలి
ఆటో డ్రైవర్లకు ఏడాదికి రూ.12 వేల చొప్పున ఇస్తామని ఇచ్చిన హామీని అమలు చేయాలని కేటీఆర్ డిమాండ్ చేశారు.రెండేళ్లకు బాకీ ఉన్న రూ.24 వేల మొత్తాన్ని ఎప్పుడు వారి ఖాతాల్లో వేస్తారో ప్రకటించాలని కోరారు.
బాండ్ పేపర్లపై ఇచ్చిన హామీలకు దిక్కేది?
అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా స్థానిక కాంగ్రెస్ అభ్యర్థులు బాండ్ పేపర్లపై హామీలు రాసిచ్చి అమలు చేస్తామని చెప్పారని కేటీఆర్ తెలిపారు.మూడేళ్లు కావస్తున్నా ఆ హామీలకు, బాండ్ పేపర్లకు దిక్కులేకుండా పోయిందని విమర్శించారు.100 రోజుల్లో అన్ని గ్యారెంటీలు అమలు చేస్తామని ముఖ్యమంత్రి ఇచ్చిన హామీకి కూడా ఇప్పటికీ మోక్షం లేదని పేర్కొన్నారు.
సిరిసిల్ల ప్రజల ప్రశ్నలకు సీఎం సమాధానం చెప్పాలి
సిరిసిల్ల ప్రజల పక్షాన బీఆర్‌ఎస్ లేవనెత్తిన ప్రశ్నలకు ముఖ్యమంత్రి సమాధానం చెప్పాలని కేటీఆర్ డిమాండ్ చేశారు.కేవలం రాజకీయ విమర్శలు, ఆరోపణలతో సిరిసిల్ల పర్యటనను ముగించకుండా ప్రజల సమస్యలపై స్పష్టమైన సమాధానాలు ఇవ్వాలని కోరారు.భూముల ఆరోపణలపై శ్వేతపత్రం, నేతన్నల బకాయిలు, రైతు సమస్యలు, సాగునీరు, పరిశ్రమలు, విద్య, వైద్యం, అభివృద్ధి పనులు, విద్యుత్, సంక్షేమ పథకాలు, వివిధ వర్గాలకు ఇచ్చిన హామీలపై ముఖ్యమంత్రి స్పష్టమైన ప్రకటన చేయాలని కేటీఆర్ డిమాండ్ చేశారు.
చైతన్యానికి ప్రతీకైన సిరిసిల్ల గడ్డపైకి వస్తున్న ముఖ్యమంత్రి ప్రజల ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఉందని పేర్కొన్నారు.








