తెలంగాణ

BRS: పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలపై గులాబీ దళం వ్యూహం ఇదేనా?

రచన: Mahesh••6 నిమిషాల పఠనం

BRS: తెలంగాణ రాజకీయాల్లో మరో కీలక సమరానికి నగారా మోగింది. ఉమ్మడి మహబూబ్‌నగర్-రంగారెడ్డి-హైదరాబాద్‌తో పాటు ఉమ్మడి వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల శాసనమండలి స్థానాలకు ఎన్నికల సంఘం ఓటర్ల నమోదు షెడ్యూల్ విడుదల చేసింది.

BRS: తెలంగాణ రాజకీయాల్లో మరో కీలక సమరానికి నగారా మోగింది. ఉమ్మడి మహబూబ్‌నగర్-రంగారెడ్డి-హైదరాబాద్‌తో పాటు ఉమ్మడి వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల శాసనమండలి స్థానాలకు ఎన్నికల సంఘం ఓటర్ల నమోదు షెడ్యూల్ విడుదల చేసింది. ఎన్నికలకు ఇంకా సమయం ఉన్నప్పటికీ, టికెట్ల కోసం గులాబీ గూటిలో భారీ పోటీ నెలకొంది. టికెట్ తమకే వస్తుందన్న ఆశతో తెలంగాణ భవన్ చుట్టూ చక్కర్లు కొడుతున్న ఆశావహులకు బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అనూహ్య ట్విస్ట్ ఇచ్చినట్లు తెలుస్తుంది. ఇప్పుడే అభ్యర్థుల ప్రకటన ఉండబోదని కుండబద్దలు కొడుతూ, గ్రౌండ్‌లో సరికొత్త పొలిటికల్ మైండ్‌గేమ్‌కు ఆయన తెరలేపారట.

ముందే ప్రకటిస్తే తిరుగుబాటు ముప్పు..

ఎన్నికలకు ముందే అభ్యర్థిని ఖరారు చేస్తే పార్టీకి జరిగే నష్టాలను అధిష్టానం లోతుగా బేరీజు వేస్తోందని తెలుస్తుంది. బీఆర్ఎస్‌లో ఒక్కో స్థానానికి డజను మందికి పైగా కీలక నేతలు పోటీ పడుతున్నారు. ఇప్పుడే ఒకరి పేరు ప్రకటిస్తే మిగిలిన ఆశావహులు అసంతృప్తితో దూరమయ్యే ప్రమాదం ఉందని అగ్ర నాయకత్వం ఆలోచనలో పడినట్లు తెలుస్తుంది. వారు ఓటర్ల నమోదును పట్టించుకోకపోతే పార్టీకి తీవ్ర నష్టం తప్పదని భావిస్తున్నట్లు తెలుస్తుంది.

ఒక్కో గ్రాడ్యుయేట్ స్థానం కింద 30కి పైగా అసెంబ్లీ నియోజకవర్గాలు విస్తరించి ఉన్నాయి. ప్రకటించే అభ్యర్థి అక్కడి స్థానిక నియోజకవర్గ ఇన్‌ఛార్జ్‌లకు నచ్చకపోతే, క్షేత్రస్థాయిలో ఓటర్ ఎన్‌రోల్‌మెంట్ ప్రక్రియను గాలికొదిలేసే ముప్పు ఉంది. ఆశావహుల మధ్య అంతర్గత కుమ్ములాటలు పెరగకుండా ఉండాలంటే అభ్యర్థి ఎంపికపై సస్పెన్స్ కొనసాగించడమే సరైన వ్యూహమని పార్టీ నాయకత్వం నిర్ణయించిందట.

"ఓట్లు చేర్పించినోళ్లకే టికెట్"

టికెట్ కోసం పార్టీ పెద్దల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్న నేతలకు కేటీఆర్ ఒక స్పష్టమైన టాస్క్ ఇచ్చినట్లు జోరుగా ప్రచారం జరుగుతుంది. పార్టీ యంత్రాంగం ఎలాగూ ఓటర్లను చేరుకుంటుంది, కానీ టికెట్ కోరుకునే వ్యక్తులు వ్యక్తిగత చొరవతో ఎంతమంది గ్రాడ్యుయేట్లను ఓటర్లుగా నమోదు చేయిస్తారనేదే ఇప్పుడు ప్రధాన కొలమానం. ఫార్మ్-18 ద్వారా ఓటర్ల నమోదు పూర్తయ్యాక, ఏ నియోజకవర్గంలో ఎంతమంది గ్రాడ్యుయేట్లు నమోదయ్యారు? ఏ సామాజిక వర్గం ఓట్లు ఎక్కువగా ఉన్నాయి? ఎవరికి పట్టభద్రులతో బలమైన సంబంధాలు ఉన్నాయో లెక్క తేలుస్తారు. క్షేత్రస్థాయిలో పని చేసి, క్యాడర్‌ను కలుపుకొని ఎక్కువ ఓట్లు నమోదు చేయించిన నాయకుడికే ఎమ్మెల్సీ టికెట్ దక్కుతుందన్న స్పష్టమైన సంకేతాలను కేటీఆర్ పంపినట్లు తెలుస్తుంది.

60 అసెంబ్లీ సెగ్మెంట్లు.. సార్వత్రిక ఎన్నికలకు సెమీఫైనల్స్

ప్రస్తుతం ప్రతిపక్షంలో ఉన్న బీఆర్‌ఎస్‌కు ఈ రెండు పట్టభద్రుల స్థానాలు జీవన్మరణ సమస్యగా మారాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈ రెండు పట్టభద్రుల నియోజకవర్గాలు రాష్ట్రంలోని దాదాపు 60 అసెంబ్లీ సెగ్మెంట్లలో విస్తరించి ఉన్నాయి. అంటే రాష్ట్రంలో దాదాపు సగం అసెంబ్లీ స్థానాల్లో ఈ ఎన్నికల ప్రభావం ఉంటుంది. విద్యావంతులు, ఉద్యోగులు, యువత అధికంగా ఉండే ఈ ఎన్నికల్లో విజయం సాధిస్తే, అది అధికార కాంగ్రెస్‌కు గట్టి హెచ్చరికగా మారడమే కాకుండా రాబోయే సార్వత్రిక ఎన్నికలకు కేడర్‌లో కొండంత ధైర్యాన్ని నింపుతుందని గులాబీ దళం భావిస్తోంది. ఈ సమీకరణాల దృష్ట్యా, అభ్యర్థుల ఎంపికలో ఎలాంటి తొందరపాటు లేకుండా పనితీరు ఆధారంగానే నిర్ణయం తీసుకునేలా బీఆర్‌ఎస్ అధిష్టానం వేసిన ఈ మాస్టర్ ప్లాన్ ఎంతవరకు ఫలిస్తుందో వేచి చూడాలి.

#BRS#BRS Politics#Telangana Politics#TG Politics#KTR#KTR Strategy#BRS Working President#swechaa news
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి