ఇందిరమ్మ ఇళ్లు వస్తుందని ఆశించిన ఓ వృద్ధ జంటకు నిరాశే ఎదురైంది. ముందుగా ఇందిరమ్మ ఇళ్లు మంజూరు అయ్యిందని చెప్పడంతో ఆశగా ఉన్న ఆ దంపతులు.. ప్రస్తుతం ఉంటున్న ఇంటిని కూల్చివేశారు. ఆ స్థలంలోనే కొత్త ఇంటిని నిర్మించుకోవాలని భావించారు.తీరా చూస్తే వారికి ఇందిరమ్మ ఇళ్లు మంజూరు కాలేదని అధికారులు చావు కబురు చల్లగా చెప్పారు.ఇంకేముంది ఉన్న ఇళ్లు పోయి.. ఇందిరమ్మ ఇళ్ల రాక ఈ వయస్సులో రోడ్డు మీద పడ్డారు. తమకు ఆదుకోవాలని ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు.
ఈ ఘటన జనగామ జిల్లా స్టేషన్‌ఘన్‌పూర్ మండలం ఇప్పగూడెంలో ఆలస్యంగా వెలుగుచూసింది. వివరాల్లోకివెళితే.. వృద్ధ దంపతులు కొలిపాక వెంకటయ్య, వెంకటమ్మకు ఇందిరమ్మ ఇల్లు మంజూరైనట్లు జూన్ నెలలో ఆ గ్రామంలో జరిగిన ఓ సమావేశంలో ఎమ్మెల్యే కడియం శ్రీహరి చేతుల మీదుగా మంజూరు పత్రం అందజేశారు. కొత్త ఇంటి నిర్మాణానికి సర్పంచ్ మందపురం రాణి అనిల్ ఆధ్వర్యంలో భూమిపూజ నిర్వహించారు.
ఇల్లు వస్తుందన్న సంతోషంతో శిథిలావస్థలో ఉన్న పాత పెంకుటిల్లును దంపతులు కూల్చి వేయించారు. తీరా నిర్మాణ పనులు ప్రారంభించే సమయంలో ఇల్లు మంజూరు కాలేదంటూ అధికారులు చెప్పడంతో తీవ్ర నిరాశకు లోనయ్యారు. నిలువ నీడ కోల్పోయి బంధువుల ఇంటి ముందున్న రేకుల షెడ్డులో వృద్ధ దంపతులు తలదాచుకుంటున్నట్టు సమాచారం.
వానకు తడుస్తూ, చలికి వణుకుతూ అద్దె షెడ్డులో దయనీయ జీవనం గడుపుతున్నారు. ఇందిరమ్మ ఇల్లు మంజూరు పత్రంలో ఎక్కడ పొరపాటు జరిగిందో గుర్తించి సమస్య పరిష్కరించాలని స్థానికుల డిమాండ్ చేస్తున్నారు. ఇందిరమ్మ ఇల్లు వస్తుందన్న ఆశతో ఇల్లు కూల్చేస్తే చివరికి నిలువ నీడ లేకుండా పోయిందన్న వృద్ధులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయంలో స్థానిక ఎమ్మెల్యే కడియం శ్రీహరి వెంటనే స్పందించి వారికి ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయించాలని స్థానికులు కోరుతున్నారు.







