రాష్ట్రంలో శాంతిభద్రతలను పరిరక్షించాల్సిన పోలీస్ కమిషనర్ ప్రెస్ మీట్లు పెట్టి గణేష్ నిమజ్జనంలో ఏ పాటలు పెట్టాలి, ఏ పాటలు పెట్టకూడదో ఆదేశాలు జారీ చేయడం విడ్డూరంగా ఉందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. రాజేంద్రనగర్ నియోజకవర్గ బీఆర్ఎస్ విస్తృత స్థాయి సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. పండగ వాతావరణంలో ప్రజలు ఉత్సాహంగా జరుపుకునే ఉత్సవాలపై ఆంక్షలు విధించడం సరికాదని పేర్కొన్నారు. నిమజ్జన శోభాయాత్రల్లో వివాదాలు, గొడవలు జరగకుండా నివారించాల్సిన పోలీసులు, కేసీఆర్ పాటలు ప్లే చేస్తే డీజే సిస్టమ్‌లను బలవంతంగా నిలిపివేయిస్తున్నారని ఆయన ఆరోపించారు.
తెలంగాణ సమాజం, మట్టి స్వభావాన్ని వివరించిన కేటీఆర్, సందర్భం వచ్చినప్పుడు ఇక్కడి గడ్డిపోచ కూడా గడ్డపారై తిరగబడుతుందని హెచ్చరించారు. ప్రజల భావప్రకటన స్వేచ్ఛను, సాంస్కృతిక స్వేచ్ఛను అణచివేసేందుకు యత్నిస్తే తీవ్ర ప్రతిఘటన తప్పదని స్పష్టం చేశారు. ప్రభుత్వం, పోలీసులు విధించిన అనవసరపు ఆంక్షల పట్ల ప్రజలు, యువత తీవ్ర అసంతృప్తితో ఉన్నారని ఆయన వెల్లడించారు.
అధికారుల వైఖరికి నిరసనగా యువత నేరుగా సిపి సజ్జనార్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిల సమక్షంలోనే కేసీఆర్‌ను గుర్తుచేసుకుంటూ 'దేఖ్ లేంగే' పాటలు ప్లే చేశారని కేటీఆర్ గుర్తుచేశారు. ఆంక్షలను సైతం లెక్కచేయకుండా ప్రజలు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనను, ఆయన నాయకత్వాన్ని స్మరించుకుంటున్నారని తెలిపారు. ఈ పరిణామం రాష్ట్రంలో బీఆర్ఎస్ పట్ల ప్రజలకు ఉన్న ఆదరణకు, ప్రభుత్వ ఆంక్షలపై యువత తిరుగుబాటుకు అద్దం పడుతోందన్నారు.
పోలీసు యంత్రాంగం నిష్పక్షపాతంగా వ్యవహరించాలని, అధికార పక్ష ఒత్తిళ్లకు తలొగ్గి ప్రజలను, యువతను వేధింపులకు గురిచేయకూడదని ఆయన డిమాండ్ చేశారు. పండుగల సందర్భంగా ప్రజల ఉత్సాహాన్ని దెబ్బతీసే చర్యలను మనుమానుకోవాలని కేటీఆర్ ప్రభుత్వానికి, పోలీసు అధికారులకు హితవు పలికారు.
30 శాతం కమిషన్ల సంస్కృతి పెరిగింది
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి త్వరలోనే మూడేళ్లు పూర్తవుతున్నా ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో పూర్తిగా విఫలమైందని కేటీఆర్ విమర్శించారు. రాష్ట్రంలో 30 శాతం కమిషన్ల సంస్కృతి పెరిగిపోయిందని, ప్లానింగ్ లేని నిర్ణయాల వల్ల హైదరాబాద్ రియల్ ఎస్టేట్ వ్యవస్థ పూర్తిగా కుప్పకూలిపోయిందని ఆరోపించారు. మూడేళ్ల కాలంలో ఒక్క కొత్త ఇటుక కూడా పేల్చని ప్రభుత్వం, హైడ్రా పేరుతో పేదల ఇళ్లను కూల్చుతూ భయాందోళనలకు గురిచేస్తోందని మండిపడ్డారు.
హైదరాబాద్ నగర అభివృద్ధి, మౌలిక వసతుల కల్పనపై మాట్లాడిన కేటీఆర్, కేసీఆర్ హయాంలోనే రాయదుర్గం నుంచి శంషాబాద్ విమానాశ్రయం వరకు మెరో లైన్ విస్తరణకు టెండర్లు పూర్తి చేశామని గుర్తుచేశారు. అయితే, కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే ఆ టెండర్లను రద్దు చేసి ప్రాజెక్టును నిలిపివేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. మూసీ ప్రక్షాళన కోసం బీఆర్ఎస్ ప్రభుత్వంలో రూ.16,000 కోట్లతో అద్భుతమైన ప్రణాళిక రూపొందించి, మురికినీరు మూసీలో కలవకుండా 32 ఎస్టీపీ (STP)లను నిర్మించామని తెలిపారు. అంతేకాకుండా జీవో 58 కింద రెండు లక్షల మందికి పట్టాలు ఇవ్వడంతో పాటు ఉచితంగా డబుల్ బెడ్రూం ఇళ్లు నిర్మించి ఇచ్చామన్నారు.
అధికార పార్టీ నేతల ఇళ్లు హైడ్రాకు కనిపించవా?
కాంగ్రెస్ ప్రభుత్వం అనుసరిస్తున్న హైడ్రా చర్యలపై విరుచుకుపడిన కేటీఆర్, హైడ్రా బుల్డోజర్లకు అధికార పార్టీ నాయకులైన వివేక్ వెంకటస్వామి, అనుముల తిరుపతి రెడ్డి, పట్నం మహేందర్ రెడ్డి ఇళ్లు ఎందుకు కనిపించడం లేదని ప్రశ్నించారు. ఫ్యూచర్ సిటీ పేరుతో కాలయాపన చేస్తున్నారని, అది కేవలం ఫార్మా సిటీ భూములకు చెందినదే తప్ప దేనికీ పనికిరాదని విమర్శించారు. రాజేంద్రనగర్ ఎమ్మెల్యే బీఆర్ఎస్‌ను మోసం చేసి కాంగ్రెస్‌లోకి వెళ్లారని, ఎవరు ఎక్కడ ఏం చేస్తున్నారో తమ దగ్గర పూర్తి సమాచారం ఉందని, మరో రెండేళ్లలో కేసీఆర్ మళ్లీ అధికారంలోకి రాగానే అన్ని లెక్కలు తేలుస్తామని హెచ్చరించారు.
‘ఫ్యూచర్ సిటీ’లో ఇంచు భూమి కూడా వదలం
ఫార్మాసిటీ కోసం సేకరించిన భూములను ‘ఫ్యూచర్ సిటీ’ పేరిట నిర్మించడానికి చట్టం అంగీకరించదని కేటీఆర్ స్పష్టం చేశారు. రెండేళ్లలో మళ్లీ బీఆర్‌ఎస్ ప్రభుత్వం అధికారంలోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేసిన ఆయన, అక్కడ ఫ్యూచర్ సిటీ పేరుతో ఎవరు భూములు కొనుగోలు చేసినా, తిరిగి వచ్చే తమ ప్రభుత్వం ఒక్క ఇంచు భూమిని కూడా వదలకుండా మళ్లీ స్వాధీనం చేసుకుంటుందని హెచ్చరించారు.
పోయింది మా అధికారం మాత్రమే.. ప్రజల అభిమానం కాదు
'ది ప్యారడైజ్' సినిమాలో కేసీఆర్ కనిపించిన ఆ నాలుగు నిమిషాల దృశ్యాలు చిత్రానికే ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయని కేటీఆర్ అన్నారు. తెలంగాణ ప్రజలకు స్వేచ్ఛా స్వాతంత్ర్యాలను, ప్రశ్నించే గొంతును అందించిన నాయకుడిని, ఒక జాతిని మేల్కొలిపిన నేతను ఈ సమాజం ఏ రీతిలో యాది చేసుకుంటోందో సినిమాలో అత్యంత అద్భుతంగా ఆవిష్కరించారని కొనియాడిన ఆయన, పోయింది కేవలం అధికారం మాత్రమేనని, ప్రజల గుండెల్లో కేసీఆర్‌పై ఉన్న అభిమానం, మమకారం, అనురాగం చెక్కుచెదరకుండా అలాగే ఉన్నాయని స్పష్టం చేశారు.








