తెలంగాణ

Egg Donation Mafia: హైదరాబాద్‌లో అండాల మాఫియా.. చీకటి దందా వెనక వణికించే నిజాలు!

రచన: Mahesh••6 నిమిషాల పఠనం

Egg Donation Mafia: వెండితెరపై చూసే మెడికల్ మాఫియా కథలను తలదన్నేలా హైదరాబాద్ నడిబొడ్డున ఒక భయానక చీకటి రాజ్యం నడిచింది. పేదరికాన్ని ఆసరాగా చేసుకుని, అమాయక మహిళల శరీరాలను ఏటీఎం మిషన్లుగా మార్చేసిన ఒక కిరాతక ఎగ్ డొనేషన్ నెట్‌వర్క్‌ను సిటీ పోలీసులు గుట్టురట్టు చేశారు.

Egg Donation Mafia: వెండితెరపై చూసే మెడికల్ మాఫియా కథలను తలదన్నేలా హైదరాబాద్ నడిబొడ్డున ఒక భయానక చీకటి రాజ్యం నడిచింది. పేదరికాన్ని ఆసరాగా చేసుకుని, అమాయక మహిళల శరీరాలను ఏటీఎం మిషన్లుగా మార్చేసిన ఒక కిరాతక ఎగ్ డొనేషన్ నెట్‌వర్క్‌ను సిటీ పోలీసులు గుట్టురట్టు చేశారు. వైద్య నిబంధనలను చెత్తబుట్టలో వేసి, ప్రాణాలకే ప్రమాదమని తెలిసినా ఒక్కో మహిళ నుంచి పదే పదే అండాలు తీసి కోట్లు కొల్లగొట్టిన ఈ ముఠా అకృత్యాలు బయటకు రావడంతో యావత్ సమాజం ఉలిక్కిపడింది.

ఒక్కో శరీరం నుంచి 10 సార్లు..

సాధారణంగా ఐవీఎఫ్ రూల్స్ ప్రకారం ఒక మహిళ జీవితకాలంలో పరిమితంగా మాత్రమే అండాల సేకరణ జరగాలి. అది కూడా పూర్తి ఆరోగ్య పరీక్షలు, చట్టబద్ధమైన గైడ్‌లైన్స్ ప్రకారమే సాగాలి. కానీ ఈ ముఠా దృష్టిలో మహిళలు కేవలం లాభాలు తెచ్చిపెట్టే సరుకులు మాత్రమే. ప్రమాదకర హార్మోన్ ఇంజెక్షన్లను విచ్చలవిడిగా గుచ్చి, శరీరం తట్టుకోలేక విలవిల్లాడుతున్నా పట్టించుకోకుండా ఒక్కో మహిళ నుంచి ఏకంగా 10 సార్లు అండాలు బయటకు లాగేశారు. మార్కెట్లో డిమాండ్‌ను బట్టి ఒక్కో విడత సేకరించిన అండాలను ఐవీఎఫ్ క్లినిక్‌లకు సుమారు రూ.3 లక్షలకు అమ్ముకున్నారు. అంటే ఒక్కో మహిళ ప్రాణాలను పణంగా పెట్టి ఏకంగా రూ.30 లక్షల వరకు అక్రమ సంపాదన పిండుకున్నారు.

నార్త్ నుంచి సిటీకి గుట్టుచప్పుడు కాకుండా ట్రాఫికింగ్

గడిచిన ఏడాది కాలంలోనే యూపీ, బీహార్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల నుంచి దాదాపు 600 నుంచి 1,000 మంది నిరుపేద మహిళలను హైదరాబాద్‌కు అక్రమంగా తరలించారు. వీరిలో బెంగాల్ వీధుల్లో భిక్షాటన చేస్తూ పొట్టపోసుకునే నిస్సహాయులే ఎక్కువ. అక్కడ నిక్కత్ పర్వీణ్ అనే ప్రధాన సూత్రధారిణి ఏజెంట్లతో ఒక రాకెట్‌ను నడుపుతూ, చేతినిండా డబ్బులు ఇప్పిస్తామని నమ్మించి వీరిని వలలో వేసుకుంది. ఇండోర్‌కు చెందిన అమిత్ శర్మ క్షేత్రస్థాయిలో అండాల సేకరణ వ్యవహారాలు చక్కబెట్టేవాడు. చట్టం కళ్లుగప్పేందుకు నకిలీ ఆధార్ కార్డులు సృష్టించి, వారి స్వచ్ఛంద ఆమోదంతోనే డొనేట్ చేస్తున్నట్లు బోగస్ డాక్యుమెంట్లు రెడీ చేశారు.

వీర్యం దందా నుంచి అండాల వేట దాకా!

స్థానికులకు ఎలాంటి అనుమానం రాకుండా పక్కా ప్లాన్‌తో వ్యవహరించారు. ఒక్కో బ్యాచ్‌లో 50 మంది మహిళలను నగరానికి తీసుకొచ్చి, నెలకు రూ.50 వేల వరకు అద్దె చెల్లించి పలు హాస్టళ్లలో ఉంచారు. ఇక్కడ సేకరించిన అండాలను కేవలం హైదరాబాద్‌లోనే కాకుండా కర్ణాటక, గుజరాత్‌లోని ప్రముఖ ఫెర్టిలిటీ క్లినిక్‌లకు నెట్‌వర్క్ ద్వారా సప్లై చేశారు. ఈ రాకెట్‌లో పట్టుబడిన పంకజ్ సోని అనే పాత నేరస్థుడి చరిత్ర మరింత దిగ్భ్రాంతి కలిగిస్తోంది. గతంలో సికింద్రాబాద్ పరిసరాల్లో ఫుట్‌పాత్‌లపై ఉండే యాచకులకు ఒక పూట బిర్యానీ, ఒక క్వార్టర్ బాటిల్ ఇచ్చి వారి నుంచి వీర్యం సేకరించి క్లినిక్‌లకు అమ్మిన ఘనుడు ఇతడు.

ప్రస్తుతం ఈ దారుణ రాకెట్‌లో కీలకమైన 8 మంది నిందితులను కటకటాల వెనక్కి నెట్టిన పోలీసులు వారి బ్యాంకు ఖాతాలను ఫ్రీజ్ చేశారు. కేవలం ఏజెంట్లతోనే సరిపెట్టకుండా, అనుమతులు లేకుండా వీరి వద్ద నుంచి అండాలు కొనుగోలు చేసిన పలు కార్పొరేట్ ఫెర్టిలిటీ సెంటర్లు, ప్రైవేట్ క్లినిక్‌ల పాత్రపై స్పెషల్ టీమ్స్ లోతైన దర్యాప్తు జరుపుతున్నాయి. డాక్టర్ల ముసుగులో ఈ మాఫియాకు సహకరించిన వారి మెడకూ ఉచ్చు బిగుస్తోంది.

#Hyderabad Egg Donation Mafia#Egg Donation Scam#Hyderabad Crime News#swechaa news
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి