Harish Rao: సీఎం రేవంత్ కు సెలవు చెప్పే రోజు వచ్చేసిందన్నారు మాజీమంత్రి హరీశ్ రావు. కరెంటుకు సెలవు, నీళ్లకు సెలవు, పంటలకు సెలవు అంటున్న రేవంత్ రెడ్డికి మనందరం కలిసి సెలవు ప్రకటించొద్దా? అని అన్నారు. మీ చేతకాని పాలన ఇక చాలు అని మనందరం కలిసి రేవంత్ రెడ్డికి సెలవు చెప్పే రోజులు వచ్చాయన్నారు. ఆయనకు కూడా సెలవు చెప్పాల్సిందేనని హరీశ్ రావు వ్యాఖ్యానించారు. వనపర్తి జిల్లా పెద్దమందడి మండలం అల్వాల గ్రామంలో పర్యటించిన హరీశ్ రావు సాగునీరు అందక ఎండిపోయిన పంటపొలాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు.
24 లక్షల ఎకరాల్లో పంటలు ఎండాయి
రాష్ట్రంలో 24 లక్షల ఎకరాలు ఎండిపోవడానికి కాంగ్రెస్ ప్రభుత్వం చేతగానితనమే కారణం అన్నారు. ఇది కాలం తెచ్చిన కరువు కాదు కాంగ్రెస్ తెచ్చిన కరువు అంటూ విరుచుకుపడ్డారు. పక్కనే కృష్ణా నది ఉన్నా పాలమూరుకు నీళ్లు రాలేదు. కానీ.. 700 కిలోమీటర్ల దూరంలో ఉన్న కుప్పానికి నీళ్లు పోయాయన్నారు. పాలమూరు బిడ్డను అని చెప్పుకునేటువంటి సీఎం రేవంత్.. పాలమూరుకు చేసిందేమీ లేదని విమర్శించారు.
కాంగ్రెస్ తెచ్చిన కరువు
''రాష్ట్రవ్యాప్తంగా ఇవాళ 24 లక్షల ఎకరాల్లో పంటలు ఎండాయి. కరువు వచ్చిందని రేవంత్ అంటున్నారు. కానీ, కరువు రాలేదు. ఇది కాలం తెచ్చిన కరువు కాదు. ఇది కాంగ్రెస్ పార్టీ తెచ్చిన కరువు. నీళ్లు లేక కాదు కాంగ్రెస్ పార్టీ చేత కానితనంతో కరువు వచ్చింది. శ్రీశైలంలో 221 టీఎంసీలు, జూరాలలో 252 టీఎంసీల నీళ్లు వచ్చినా.. టైమ్ కి మోటార్లు ఆన్ చేయక, అన్ని మోటార్లు నడపక, 24 గంటలు మోటార్లు నడపక, నీళ్లు ఎత్తక ఇవాళ కరువు వచ్చింది.
''కల్వకుర్తి ఎత్తిపోతల కింద కేసీఆర్ హయాంలో ఎనిమిదేళ్ల పాటు రెండు పంటలు పుష్కలంగా పండిన పాలమూరు ప్రాంతంలో ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వ చేతగానితనం వల్ల వానకాలం పంటలే ఎండిపోతున్నాయి. రైతు మూడు ఎకరాల్లో వరి నాటేస్తే.. కలుపు తీసి, ఎరువులు వేసి, పెట్టుబడి అంతా పెట్టాక పొట్ట దశకు వచ్చిన పంట నీళ్లు రాక కళ్లముందే ఎండిపోయిందని కన్నీళ్లు పెట్టుకుంటున్నాడు. ఒక్క అల్వాలలోనే 250 ఎకరాలు, ఈ ప్రాంతంలో వేల ఎకరాలు, రాష్ట్రవ్యాప్తంగా 24 నుంచి 25 లక్షల ఎకరాల్లో పంటలు ఎండిపోయాయి. రేవంత్ రెడ్డి కరువు వచ్చిందని అబద్ధాలు చెప్తున్నారు. ఇది కాలం తెచ్చిన కరువు కాదు, నీళ్లు లేక వచ్చిన కరువు అంతకన్నా కాదు. ముమ్మాటికీ కాంగ్రెస్ పార్టీ చేతగానితనం వల్ల రేవంత్ రెడ్డి తెచ్చిన కరువు'' అంటూ హరీశ్ రావు విరుచుకుపడ్డారు.
కుప్పంలో పారుతున్నాయి.. వనపర్తిలో ఎందుకు పారడం లేదు?
కృష్ణా నది జలాలు పారాల్సిన ఈ పాలమూరులో ఇవాళ పంటలు ఎండిపోతుంటే చాలా బాధగా ఉంది. మన పంట పొలాల్లో పారాల్సిన కృష్ణా జలాలు.. పక్క రాష్ట్రానికి పరుగులెత్తిచ్చినటువంటి పాపాత్ముడు మీ రేవంత్ రెడ్డి. ఆయన చేతకానితనం వల్ల పక్కనే ఉన్న పాలమూరులో నీళ్లు పారడం లేదు.. కానీ, ఎక్కడో 700 కిలోమీటర్ల దూరంలో కుప్పంలో పోయి కృష్ణా జలాలు పారుతున్నాయి. 700 కిలోమీటర్ల దూరంలో ఉన్న కుప్పంలో నీళ్లు పారుతున్నాయి.. కానీ, పక్కనే 70 కిలోమీటర్ల దూరంలో ఉన్న వనపర్తిలో ఎందుకు పారడం లేదు?
మూడేళ్లలో ఒక్క ప్రాజెక్ట్ కూడా కట్టలేదు
నేను పాలమూరు బిడ్డనని డైలాగులు కొట్టడమే తప్ప.. పాలమూరు జిల్లాకు రేవంత్ రెడ్డి చేసిందేమీ లేదు. కరెంటు, నీళ్లు ఇవ్వకుండా పంటలను ఎండబెడుతున్నారు. తిట్టుడు తప్ప, తిట్ల దండకం తప్ప రేవంత్ రెడ్డికి నీళ్ళు ఇచ్చే తెలివే లేదు. అటు జూరాలలో, ఇటు శ్రీశైలంలో నీళ్లు కిందికి విడిచిపెట్టారు. ఆంధ్రోళ్లు ఒడిసి పట్టుకున్నారు, రేవంత్ రెడ్డి విడిచిపెట్టారు. ఈ రైతాంగానికి ఒక్కటే చెప్పదలుచుకున్నా. కేసీఆర్ ఉన్నప్పుడు నీళ్ళు వచ్చాయి. రేవంత్ రెడ్డి రాగానే నీళ్లు పోయాయి. రేవంత్ రెడ్డి వచ్చి మూడేళ్ళైంది. ఈ మూడేళ్లలో ఒక్క చెరువు కట్టింది లేదు. ఈ జిల్లాలో ఒక్క చెక్ డామ్ కట్టింది లేదు. ఈ జిల్లాలో ఒక్క ప్రాజెక్ట్ అన్నా పూర్తి చేసింది లేదు. రేవంత్ రెడ్డికి కూడా సెలవు చెప్పాలి. ఆ రోజులు వచ్చేశాయి'' అని హరీశ్ రావు ధ్వజమెత్తారు.


