సినిమా

Amit Shah: అమిత్‌ షాతో చిరంజీవి, రామ్ చరణ్‌ భేటీ.. సడెన్‌గా ఎందుకు కలిశారు?

రచన: Mahesh••4 నిమిషాల పఠనం

Amit Shah: కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా హైదరాబాద్‌కు రావడం.. ఆయన బస చేసిన హోటల్‌కు వెళ్లి మెగాస్టార్ చిరంజీవి, రామ్ చరణ్ కలవడం ఒక్కసారిగా పెద్ద టాపిక్‌గా మారింది. వీళ్లు కలవగానే.. తెరవెనుక ఏదో రాజకీయ వ్యూహం నడుస్తోందని, ఏదో పెద్ద ప్లానే ఉందని చాలామంది అనుకున్నారు.

Amit Shah: కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా హైదరాబాద్‌కు రావడం.. ఆయన బస చేసిన హోటల్‌కు వెళ్లి మెగాస్టార్ చిరంజీవి, రామ్ చరణ్ కలవడం ఒక్కసారిగా పెద్ద టాపిక్‌గా మారింది. వీళ్లు కలవగానే.. తెరవెనుక ఏదో రాజకీయ వ్యూహం నడుస్తోందని, ఏదో పెద్ద ప్లానే ఉందని చాలామంది అనుకున్నారు. కానీ, అసలు విషయం బయటకు వచ్చాక అందరికీ క్లారిటీ వచ్చింది. ఈ భేటీ వెనుక ఎలాంటి పాలిటిక్స్ లేవని.. కేవలం సినిమా ఇండస్ట్రీలోని ఆర్టిస్టులను వేధిస్తున్న ఒక పెద్ద సమస్య గురించే చిరంజీవి నేరుగా అమిత్ షా దగ్గర మాట్లాడారు. అదే.. ఏఐ, డీప్‌ఫేక్ టెక్నాలజీతో సెలబ్రిటీల పరువు తీస్తున్న సైబర్ కేటుగాళ్ల వ్యవహారం.

ట్వీట్లతో ఆగిపోలేదు.. నేరుగా హోంమంత్రికే ఫిర్యాదు

ఈ మధ్యకాలంలో హీరోయిన్లు, ప్రముఖుల ముఖాలను డీప్‌ఫేక్ టెక్నాలజీతో మార్చేసి, అసభ్యకరమైన వీడియోలు, ఫొటోలు సోషల్ మీడియాలో వదులుతున్న సంగతి తెలిసిందే. దీనిపై మొన్నామధ్య చిరంజీవి ‘ఎక్స్’లో చాలా ఘాటుగా స్పందించారు. అయితే కేవలం పోస్టులు పెట్టి ఊరుకుంటే లాభం లేదని భావించిన మెగాస్టార్, రామ్ చరణ్‌తో కలిసి నేరుగా అమిత్ షా ముందుకే ఈ సమస్యను తీసుకెళ్లారు. క్రియేటివిటీ ముసుగులో కొందరు సైకోల్లా ప్రవర్తిస్తూ నటీనటుల, మహిళల ఆత్మగౌరవాన్ని ఎలా నాశనం చేస్తున్నారో వివరించారు. దీనివల్ల సినీ రంగంలో ఎంత ఆందోళన నెలకొందో పూసగుచ్చినట్లు చెప్పారు. ఇలాంటి వారిపై చర్యలు తీసుకోవడానికి సాధారణ నిబంధనలు సరిపోవని, కఠినమైన కొత్త చట్టాలు తీసుకురావాలని కోరారు.

సానుకూలంగా అమిత్ షా.. కిషన్ రెడ్డికి కీలక బాధ్యత

చిరంజీవి చెప్పిన విషయాలను అమిత్ షా చాలా శ్రద్ధగా విన్నారు. సమస్య తీవ్రతను అర్థం చేసుకున్న ఆయన.. దీనిపై కేంద్రం వెంటనే దృష్టి పెడుతుందని స్పష్టం చేశారు. టెక్నాలజీని వాడుకుని నటీనటులు, ఆడవాళ్ల పరువుతో ఆడుకుంటే ఎంతటి వారినైనా ఉపేక్షించబోమని, గట్టి చట్టాలు, రూల్స్ తెస్తామని హామీ ఇచ్చారు. దీనికి సంబంధించి పూర్తి వివరాలతో ఒక లిఖితపూర్వక వినతిపత్రం ఇవ్వాలని చిరంజీవికి సూచించారు. అంతేకాదు, ఈ వ్యవహారాన్ని దగ్గరుండి చూసుకోవాలని, సినీ పెద్దలతో సమన్వయం చేయాలని కేంద్ర మంత్రి జి.కిషన్ రెడ్డిని అక్కడికక్కడే ఆదేశించారు. కేంద్రం నుంచి ఇంత వేగంగా స్పందన రావడంపై చిరంజీవి సంతోషం వ్యక్తం చేశారు. దీంతో చిరంజీవి-అమిత్ షా భేటీపై మొదలైన రాజకీయ పుకార్లన్నింటికీ ఒక్కసారిగా ఫుల్‌స్టాప్ పడింది.

#Amit Shah#Chiranjeevi#Ram Charan#Chiranjeevi Amit Shah Meeting#swechaa news
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి